Telugu Global
National

సగం జీతానికే పనిచేయండి.. షాకిచ్చిన విప్రో

కంపెనీ ఇచ్చిన ట్రైనింగ్ లో సరిగా ప్రతిభ చూపలేదనే కారణంతో ఆమధ్య 425మంది ఫ్రెషర్స్ కి అపాయింట్ మెంట్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసింది విప్రో యాజమాన్యం. ఇప్పుడు కూడా ట్రైనీల మెడపైనే కత్తి పెట్టింది.

సగం జీతానికే పనిచేయండి.. షాకిచ్చిన విప్రో
X

ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్ సీజన్ నడుస్తోంది. ఆఫీస్ కి బయలుదేరిన వారికి కూడా ఇక మీ సేవలు చాలు అంటూ మెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఈ దశలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనంటూ టెన్షన్ పడుతున్నారు టెకీలు. టెకీలే కాదు, ట్రైనీలకు కూడా కష్టాలు మొదలయ్యాయి. క్యాంపస్ లకు వెళ్లి ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకున్న బడా కంపెనీలు కూడా ఇప్పుడు చేతులెత్తేస్తున్న పరిస్థితి. ఈ దశలో విప్రో కంపెనీ తాజాగా ట్రైనీలకు షాకిచ్చింది. సగం జీతానికే పనిచేయాలంటూ మెయిల్స్ పంపించింది.

ట్రైనీలే టార్గెట్..

విప్రో సంస్థ నేరుగా లేఆఫ్ ప్రకటించకపోయినా ట్రైనీలను టార్గెట్ చేసింది. కంపెనీ ఇచ్చిన ట్రైనింగ్ లో సరిగా ప్రతిభ చూపలేదనే కారణంతో ఆమధ్య 425మంది ఫ్రెషర్స్ కి అపాయింట్ మెంట్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసింది విప్రో యాజమాన్యం. ఇప్పుడు కూడా ట్రైనీల మెడపైనే కత్తి పెట్టింది. ట్రైనీల జీతాన్ని సగానికి సగం తెగ్గోస్తున్నట్టు స్పష్టం చేసింది. దానికి సిద్ధమైతేనే ఉద్యోగంలోకి తీసుకుంటామని, లేకపోతే వేచి చూడాల్సిందేనని చెప్పేసింది.

2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఫ్రెషర్లకు గతంలో రూ.6.5 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్‌ చేసింది. శిక్షణ విజయవంతంగా పూర్తయిన వారిని, 2023 మార్చి నుంచి ఆన్ రోల్స్ లోకి తీసుకోవాల్సి ఉంది. అయితే శాలరీ మాత్రం ఆరున్నర లక్షలు కాదు.


దాన్ని మూడున్నర లక్షలకు కుదించింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్ మూడున్నర లక్షలకు ఓకే చెబితే మార్చి నుంచి ఆన్ రోల్స్ లోకి వస్తారని చెప్పింది కంపెనీ. లేకపోతే వేచి చూడాల్సిందేనంటూ మెయిల్స్ పంపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నామని కంపెనీ మెయిల్ లో తెలిపినట్టు తెలుస్తోంది. ట్రైనీలు మాత్రం ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ సగానికి సగం జీతం తెగ్గోస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. విప్రో ఆఫర్ కోసం ఇతర కంపెనీలను కాలదన్నుకుమన్నామని, ఇప్పుడిలా తమకు షాకిచ్చారని వాపోతున్నారు ట్రైనీ టెకీలు.

First Published:  21 Feb 2023 11:47 AM GMT
Next Story