Telugu Global
National

ఫ్రెషర్స్ కు షాక్: ఇచ్చిన ఆఫర్ లెటర్స్ ను రద్దు చేస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు

ఫ్రెషర్స్ కు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోగా ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నాయి.

ఫ్రెషర్స్ కు షాక్: ఇచ్చిన ఆఫర్ లెటర్స్ ను రద్దు చేస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు
X

విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాతో సహా పలు ఐటి కంపెనీల్లో వందలాది మంది ఐటీ ఉద్యోగులు కొన్ని నెలల కిందట ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని, పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత ఆఫర్ లెటర్లు అందుకొన్నారు. కొన్ని నెలలుగా జాయినింగ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. నెలలు గడిచిపోయినా ఆయా కంపెనీల నుండి పోస్టింగ్ ఆర్డర్లు రాలేదు కానీ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తూ లెటర్లందాయి.

అర్హత ప్రమాణాలు, కంపెనీ మార్గదర్శకాల ఆధారంగా టెక్ కంపెనీలు తమ ఆఫర్ లెటర్‌లను ఉపసంహరించుకున్నామ‌ని చెప్తున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.

"మీరు మా విద్యా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేరని గుర్తించబడింది. అందువల్ల మీకిచ్చిన‌ ఆఫర్ ను రద్దు చేస్తున్నాము ." అని వారికి లేఖలు అందినట్టు బిజినెస్ లైన్ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లలో లిక్విడిటీ తగ్గడం , ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరగడం, ఐటీ స్టార్టప్‌లకు అందుబాటులో డబ్బు కరువవడం వంటి కారణాలు IT కంపెనీల పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఇటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల‌ చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేసాయి. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా తాజా నియామకాలను నిలిపివేసాయి. అందుబాటులో ఉన్న వనరులతో సర్దుకుపోవాలని ఉద్యోగులను ఆదేశించాయి.

భారతీయ ఐటి కంపెనీల విషయానికొస్తే, కొత్త రిక్రూట్‌మెంట్ల ప్రక్రియను 3-4 నెలలు ఆలస్యం చేస్తున్నాయని గతంలో చాలా నివేదికలు వెల్లడించాయి. చాలా మంది ఫ్రెషర్లు లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రక్రియలో ఆలస్యం గురించి పోస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆఫర్ లెటర్లనే రద్దు చేస్తున్నట్టు బిజినెస్ లైన్ బైటపెట్టింది.

First Published:  3 Oct 2022 11:40 AM GMT
Next Story