Telugu Global
National

రాహుల్‌కు మాట్లాడే అవకాశమిస్తారా..?

నరేంద్ర మోదీని గ్లోబల్‌ లీడర్‌గా, విశ్వగురువుగా ఫోకస్‌ చేసి రానున్న లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందాలని చూస్తున్న కాషాయ పరివారానికి రాహుల్‌ లండన్‌ ప్రసంగాలు మింగుడు పడటం లేదు.

రాహుల్‌కు మాట్లాడే అవకాశమిస్తారా..?
X

తన మీద బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలకు పార్లమెంటులోనే సమాధానం చెబుతానంటున్న రాహుల్‌ గాంధీని బిజెపి ప్రభుత్వం మాట్లాడనిస్తుందా..? తొలుత జాతికి క్షమాపణ చెప్పాలని మొండికేస్తుందా..? భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని లండన్‌ పర్యటనలో రాహుల్‌ చెప్పడాన్ని బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు శక్తిగా పరిణమించి దేశంలోని సకల వ్యవస్థలనీ, సంస్థలనీ ఆక్రమించిందని రాహుల్‌ విస్పష్టంగా చెప్పారు. కొన్నాళ్ళుగా ఆర్‌ఎస్‌ఎస్‌ను నేరుగా ప్రశ్నించడాన్ని సంఘ్‌ పరివారం భరించలేకపోతున్నది.

నరేంద్ర మోదీని గ్లోబల్‌ లీడర్‌గా, విశ్వగురువుగా ఫోకస్‌ చేసి రానున్న లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందాలని చూస్తున్న కాషాయ పరివారానికి రాహుల్‌ లండన్‌ ప్రసంగాలు మింగుడు పడటం లేదు. అందువల్లనే విదేశీ శక్తుల జోక్యాన్ని రాహుల్‌ కోరుతున్నాడనే ఆరోపణలకు తెగబడింది. రాహుల్‌ గాంధీ ప్రసంగాలన్నీ రికార్డు అయి ఉన్నాయి. ఆయన చెప్పని మాటలని చెప్పినట్టుగా దుష్ప్రచారానికి దిగింది బిజెపి. ఈ ఆరోపణలకు పార్లమెంటులోనే సమాధానం చెబుతానంటున్న రాహుల్‌కు ఆ అవకాశం కల్పిస్తే మరింత గట్టిగా బిజెపి అప్రజాస్వామిక విధానాలని తూర్పార బట్టే అవకాశముంది. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే బిజెపి అప్రజాస్వామిక ధోరణి లోకానికి తేటతెల్లం చేసినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకని రాహుల్‌ గాంధీ ముందుగా జాతికి క్షమాపణ చెప్పాలంటూ పార్లమెంటులోని కాషాయ పరివారం యాగీ చేసే అవకాశం లేకపోలేదు.

గౌతమ్‌ అదానీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గల సన్నిహిత సంబంధాల గురించి రాహుల్‌ గాంధీ ప్రశ్నిస్తే ఇప్పటివరకు మోదీగానీ, బిజెపి నేతలు గానీ జవాబు చెప్పలేదు. అదానీ కుంభకోణాల నేపథ్యంలో రాహుల్‌ సంధించిన ప్రశ్నలపై మోదీ మౌనం వహించగా, తనపై పార్లమెంటులో చేస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్‌ గాంధీ అంటున్నారు. ఈ పరిణామం బిజెపికి సంకట స్థితి.

దాదాపు ఏడాది కాలంలో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టనీ, ప్రత్యేకించి రాహుల్‌ గాంధీ ఇమేజ్‌ని దెబ్బతీయాలనే కుతంత్రంలో భాగంగానే మూడురోజులుగా పార్లమెంటును స్తంభింపజేస్తున్నది బిజెపి. లక్షల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అదానీ కంపెనీల వ్యవహారంపై ప్రతిపక్షాలు నోరెత్తకుండా చేయాలనే కుట్ర కూడా ఇందులో దాగివుంది. గత ఎనిమిదేళ్ళ కాలంలో అడుగడుగునా ప్రజాస్వామ్య హనానికి పాల్పడే మోదీ పరివారమే ప్రజాస్వామ్యం గురించి వాపోవడం విడ్డూరం.

లండన్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ ఎక్కడా భారత్‌లో విదేశాలు జోక్యం చేసుకోవాలని కోరలేదు. దేశంలో ప్రజాస్వామ్యం పునాదులు బలహీనపడటాన్ని మాత్రమే ప్రస్తావించారు. సకల సంస్థలలో ఆర్‌ఎస్‌ఎస్‌ చొరబాట్ల గురించి నిజాలనే చెప్పారు. భారత్‌ వ్యవహారాలలో ఇతర దేశాల జోక్యాన్ని రాహుల్‌ గాంధీ కోరాడు అనటానికి ఒక్క ఆధారమూ లేదు. అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పాలని కోరడం బిజెపి నేతల ధూర్తత్వం.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఖ్యాతిగ‌డించిన భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటమంటే అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడటమేనని రాహుల్‌ చెప్పారు. అయినప్పటికీ భారత్‌లో ప్రజాస్వామ్యానికి దాపురించిన ముప్పును ప్రజలు తమంతట తాము ఎదుర్కొంటారని స్పష్టంగా తెలిపారు. రాహుల్‌ ప్రసంగాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. కానీ రాహుల్‌ మాటల్లో అసంగతాలేవీ లేవని మన దేశంలోని మీడియా బలంగా చెప్పడం లేదు. రాహుల్‌ మాటలని బిజెపి నేతలు వక్రీకరిస్తుంటే వత్తాసు పలుకుతున్నది. రాహుల్‌ మాటల్లోని నిజానిజాలు నిర్ధారించాల్సిన మీడియా చోద్యం చూస్తున్నది. అందుకే మీడియా అమ్ముడుపోయిన తీరును దుయ్యబట్టిన రాహుల్‌ మాటలకు బలం చేకూరింది. పార్లమెంటులో బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై మీడియా మౌనం రాహుల్‌ మాటల్లోని నిజాల్ని నిరూపిస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్లమెంటులో రాహుల్‌ గాంధీ ప్రసంగించడానికి కాషాయ ప్రభుత్వం అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి.

First Published:  16 March 2023 11:52 AM GMT
Next Story