Telugu Global
National

గంగూలీ, జైషా బీసీసీఐ పదవుల్లో కొనసాగుతారా? వచ్చే వారమే సుప్రీంకోర్టులో విచారణ

గంగూలీ, జైషా బీసీసీఐ పదవుల్లో కొనసాగుతారా? వచ్చే వారమే సుప్రీంకోర్టులో విచారణ
X

ప్రపంచంలోని సంపన్న బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా తమ పదవుల్లో కొనసాగాలో లేదో వచ్చే వారం సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వనున్నది. బీసీసీఐ రాజ్యాంగంలో చేసిన మార్పులను ఆమోదించాలని గతంలో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని బోర్డు కోరడంతో వచ్చే వారం విచారిస్తామని శుక్రవారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

అసలు ఏం జరిగింది?

2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాం కారణంగా బీసీసీఐపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని 2015లో జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐలో సంస్కరణలు, పాలనలో పారదర్శకత తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే లోధా కమిటీని నియమించింది. ఆ సమయంలో లోధా కమిటీ పలు సిఫార్సులు చేసి బీసీసీఐ రాజ్యాంగాన్ని మార్చేసింది. 70 ఏళ్ల వయసు దాటిన వ్యక్తి పదవి నుంచైనా రిటైర్ కావల్సిందేనని చెప్పింది. క్రిమినల్ చార్జెస్ ఉన్నవారితో పాటు ఆర్థిక నేరగాళ్లు, ఇతర క్రీడా బోర్డులో సభ్యులుగా ఉన్నవాళ్లు బీసీసీఐ పదవికి అనర్హులని చెప్పింది.

ఒక రాష్ట్ర బోర్డుకు ఒకే ఓటు ఉండేలా చేసింది. అంతే కాకుండా ఐపీఎల్‌కు ఒక ఇండిపెండెంట్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐలో వరుసగా రెండు టర్మ్స్ (ఆరేళ్లు) పని చేసినవాళ్లు వెంటనే పదవి నుంచి దిగిపోవాలని సూచించింది. మధ్యలో మూడేళ్ల కూలింగ్ పిరియడ్ అనంతరం తిరిగి పదవి చేపట్టవచ్చని చెప్పింది. ఆ మేరకు బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులు చేసింది.

కాగా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా గంగూలీ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా జైషా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత వారు.. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరి పదవీ కాలం 2020 జూలైలోనే పూర్తయ్యింది. నిబంధనల ప్రకారం వీరిద్దరూ తమ పదవులను వదులుకోవాలి. కానీ 2019 డిసెంబర్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త ప్రతిపాదనలు చేశారు. ఈ నిబంధనలు అమలు అయితే వీరిద్దరూ 2024 వరకు పదవుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ మేరకు నిబంధనల సవరణను అనుమతించాలని కోరుతూ బీసీసీఐ 2020 ఏప్రిల్‌లో పిటిషన్ వేసింది. కరోనా కారణంగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను విచారించడం లేదు.

మరోవైపు పాత నిబంధనల ప్రకారం వీరిద్దరూ పదవుల్లో ఉండకూడదు. అందుకే తమ పదవులకు ముందు 'గౌరవ' అని చేర్చుకొని, ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్నారు. ముఖ్యమైన ఇద్దరు పాలనాధికారుల పదవులపై గందరగోళం ఉండటంతో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐసీసీ, ఏసీసీ వంటి వాటితో సంప్రదింపులు కూడా కష్టంగా మారాయి. అందుకే సదరు పిటిషన్‌ను త్వరగా విచారించమని బీసీసీఐ కోరుతోంది.

కాగా, బీసీసీఐ నియమించిన లోధా కమిటీనే ఈ రాజ్యాంగ మార్పులను సూచించగా.. సుప్రీంకోర్టు ఓకే చేసింది. మరి ఇప్పుడు అదే సుప్రీంను రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నారు. దీనికి సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా అనేది అనుమానమే. కేవలం గంగూలీ, జైషాల కోసం రాజ్యాంగాన్ని మార్చడం సబబు కాదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి అత్యున్నత ధర్మాసనం వచ్చేవారం ఏం చెప్పబోతోందో అని క్రీడా వర్గల్లో ఆసక్తి నెలకొన్నది.

First Published:  15 July 2022 12:33 PM GMT
Next Story