Telugu Global
National

బక్క చిక్కిన రూపాయి.. మోడీ ! ఏమిటిది ..?

దేశంలో అదేం విచిత్రమోగానీ నానాటికీ రూపాయి బక్క చిక్కిపోతోంది. 2013 లో మోడీ తాను గుజరాత్ సీఎంగా ఉండగా ఇండియాలో రూపాయి పతనానికి అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

బక్క చిక్కిన రూపాయి.. మోడీ ! ఏమిటిది ..?
X

దేశంలో అదేం విచిత్రమోగానీ నానాటికీ రూపాయి బక్క చిక్కిపోతోంది. 2013 లో మోడీ తాను గుజరాత్ సీఎంగా ఉండగా ఇండియాలో రూపాయి పతనానికి అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న యావ తప్ప రూపాయి విలువ ఎందుకు దిగజారిపోతోందన్న ఆందోళన లేదన్నారు.. నాడు డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 60రూపాయల 72 పైసలుంది.


కేంద్ర ప్రభుత్వానికి, రూపాయికి మధ్య ఓ 'పోటీ' ఉండాలని మోడీ సూచించారు. అసలు ఎకానమీపై సర్కార్ కి ఏ మాత్రం శ్రద్ధ లేదని ఆరోపించారు. మన కరెన్సీ విలువను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదన్నారు. ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని దేశం ఏనాడూ ఊహించలేదన్నారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా.. తాను అధికారంలోకి వస్తే 'ప్రస్తుతం ఆసుపత్రిలో అస్వస్థతగా ' ఉన్న రూపాయికి పూర్తి స్వస్థత చేకూరుస్తానని ఆయన వాగ్దానం చేశారు. బలహీన ఆర్ధిక వ్యవస్థను పుంజుకునేలా చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇలా లెక్కలేనన్ని వరాలు గుప్పించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మొన్నటికి మొన్న డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75 రూపాయలుండగా ఒక్కసారిగా అది నిన్న 80 రూపాయలకు చేరింది. మన దేశ ఆర్ధిక పరిస్థితి జఠిలమవుతోందనడానికి ఇది సాక్ష్యం కాక మరేమిటి ?

విదేశీమారక ద్రవ్య నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే అదనని మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా .. మోడీ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. ఇండియా పరిస్థితి శ్రీలంక మాదిరి తయారవుతోందని కొన్ని రోజుల క్రితం వరకు ఉన్న 641 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత స్పీడ్ గా రూపాయి పతనాన్ని దేశం ఎప్పుడూ చూడలేదని, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఇలాగే రూపాయి విలువ కాస్త తగ్గగానే మోడీ చేసిన వ్యాఖ్యలను తాము ఇప్పటికీ మరువలేదని అన్నారు. ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఎందుకున్నారని ప్రశ్నించారు.


ఈ పతనాన్ని అడ్డుకుని ఎకానమీని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంకు 45 బిలియన్ డాలర్లను వ్యయం చేసిందని, రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత దిగజారి 85 రూపాయలయినా మార్కెట్ ను మనం ఏమీ అనజాలమని సిన్హా ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంకు సాద్యమైనంత త్వరగా దీనిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఎకానమీని దేవుడే కాపాడాలన్నది ఆర్ధిక నిపుణుల అభిప్రాయం కూడా.. ఆర్బీఐ గవర్నర్ దీన్ని నిశితంగా గమనిస్తున్నారని తెలిసినా భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఇటీవల జరిగిన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ ల ఉన్నత స్థాయి సమావేశంలో.. విదేశీ కమర్షియల్ రుణాల ద్వారాగానీ, ప్రవాస భారతీయుల డిపాజిట్ల ద్వారా గానీ విదేశీ మారక ద్రవ్య నిల్వలను స్థిరీకరించాలని నిర్ణయించారు. కానీ ఇందుకు కొంత వ్యవధి పడుతుందని సమావేశం అభిప్రాయపడింది.

బహుశా రష్యా-ఉక్రెయిన్ వార్ ప్రభావం కూడా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గిందని భావిస్తున్నా.. పరిస్థితిని మళ్ళీ గాడిన పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదానిపై స్పష్టత లేదు. యూరప్ లో మాంద్యం కూడా దీనికి తోడైనట్టు ఓ అంచనా.. 20 ఏళ్లలో మొదటిసారిగా యూరో కరెన్సీవిలువ దారుణంగా పడిపోయింది. ఇక ఇండియాలో ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి వాల్యూ 6.6 శాతం పడిపోయిందని బ్లూమెర్జ్ డేటా పేర్కొంటోంది.


ద్రవ్యోల్బణం మాట చెప్పనలవి కాదు. . రూపాయి పతనమవుతున్న కొద్దీ నిత్యాసవసరాల ధరలు కొండెక్కుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న సరుకులకు డాలర్లలోనే బిల్లు చెల్లించాల్సి ఉంటున్నదన్నది తెలిసిందే. ఎగుమతులకు డాలర్లే ప్రధాన 'వనరు' అయినా.. రూపాయికి, డాలర్ కి మధ్య బోలెడంత 'అగాధం' ఏర్పడిందంటే అది ఎకానమీ మీద మోడీ సర్కార్ సరైన ఫోకస్ పెట్టకపోవడం వల్లే !

First Published:  15 July 2022 10:16 AM GMT
Next Story