Telugu Global
National

మోదీని పట్టించుకోని ఆరెస్సెస్

'హర్ ఘర్ తిరంగా' అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ఆరెస్సెస్ లైట్ తీసుకుంది. సోషల్ మీడియాలో ఫ్రొఫైల్ పిక్ మార్చాలన్న మోదీ సూచనను ఆరెస్సెస్ నాయకులెవ్వరూ పట్టించుకోలేదు.

మోదీని పట్టించుకోని ఆరెస్సెస్
X

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. హర్ ఘర్ తిరంగా (ఇంటింటికీ మూడు రంగుల జెండా) పేరిట ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకుప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని, సోషల్ మీడియాలో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా, డీపీ గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు అనేక మంది సోషల్ మీడియాలో ప్రిఫైల్ పిక్ లను మార్చేశారు. అయితే మోదీని నడిపించే , బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ మాత్రం మోడీ పిలుపును లైట్ గా తీసుకుంది.

ఆరెస్సెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్,దత్తాత్రేయ హోసబాలేతో సహా అనేక మంది సీనియర్ సంఘ్ నాయకులు ట్విట్టర్ లో జెండాను మార్చలేదు. RSS యొక్క ఫేస్ బుక్ పేజీ కూడా ప్రొఫైల్ పిక్ ను మార్చ‌లేదు. ఆరెస్సెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రొఫైల్ పిక్ గా కాషాయ జెండా ఎగురుతూనే ఉంది.


దీనిపై సోషల్ మీడియాలో నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మోదీ చెప్పిన మాట ఆరెస్సెస్ కూడా వినకుంటే ఇంకా ఎవరు వింటారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. నీతులు చెప్పడానికే తప్ప పాటించడానికి కాదా అని మరో నెటిజన్ విమర్శించారు.

విపక్షాలు కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తూ విమర్శలు చేస్తున్నాయి. మొదటి నుంచీ ఆరెస్సెస్ కు మన జాతీయ జెండా అంటే ఇష్టం లేదని జాతీయ జెండాగా కాషాయజెండాను ఉంచాలని దాని ప్రణాళిక అని విపక్షాలు విమర్శ‌లు చేశాయి. జాతీయ జెండాగా కాషాయ జెండాను ఉంచాలని 1947 లోనే ఆరెస్సెస్ డిమాండ్ చేసిన విషయాన్ని ఎమ్ ఐ ఎమ్ నేత అసదుద్దీన్ ఓవైసీ గుర్తు చేయగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 52 ఏళ్ళపాటు ఆరెస్సెస్ తన నాగ్ పూర్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేయలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.


అయితే ఈ విమర్షలను ఆరెస్సెస్ కొట్టి పడేసింది. సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ లను మార్చకపోవడాన్ని కావాలనే ఒక సమస్యలా చేస్తున్నారని ఆరెస్సెస్ సీనియర్ నేత అంబేకర్ మండిపడ్డారు.

"సంఘ్ ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారానికి తన మద్దతును ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని స్వయం సేవకులందరికీ విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ఎవరూ రాజకీయాలు చేయవద్దు.మహోత్సవాన్ని జరుపుకోవడంపై దృష్టి పెట్టండి.'' అని అంబేకర్ అన్నారు.

ఒక వైపు సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాలను పెట్టుకోని వాళ్ళను దేశద్రోహులుగా ప్రచారం చేస్తున్న బీజేపీ ఐటీ సెల్ ఆరెస్సెస్ విషయంలో స్పందించకపోవడం గమనార్హం.

First Published:  5 Aug 2022 7:21 AM GMT
Next Story