Telugu Global
National

ఖాలిస్తాన్ గురించి మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు, హిందూ దేశంకావాలన్న‌ వారిపై చర్యలెందుకు తీసుకోరు ? -అకల్ తఖ్త్ ఆగ్రహం

ఒకవైపు సిక్కు కార్యకర్తలను అరెస్టు చేయడం, మైనారిటీలను బెదిరిస్తూ హిందూ రాష్ట్రానికి పిలుపునిచ్చే హిందుత్వ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ‌ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని అని జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ అన్నారు.

ఖాలిస్తాన్ గురించి మాట్లాడితే అరెస్టు చేస్తున్నారు, హిందూ దేశంకావాలన్న‌ వారిపై చర్యలెందుకు తీసుకోరు ? -అకల్ తఖ్త్ ఆగ్రహం
X

పంజాబ్ లో సిక్కు సమాజం మీద కొనసాగుతున్న అణిచివేతపై సిక్కు సమాజపు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ మండిపడింది. వారిస్ పంజాబ్ దే ,దాని నాయకుడు అమృతపాల్ సింగ్‌పై అణిచివేతలో భాగంగా అరెస్టు చేసిన 'అమాయక' ప్రజలందరినీ విడుదల చేయాలని అకాల్ తఖ్త్ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.

మార్చి 27న అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ అద్వర్యంలో జరిగిన‌ సిక్కు సంస్థలు, మేధావులు, కార్యకర్తలు, జర్నలిస్టుల ఉన్నత స్థాయి సమావేశంలో అకల్ తఖ్త్ ఈ ప్రకటన చేసింది.

డ్రగ్స్, సిక్కు వ్యతిరేక జీవనశైలి, విధానాల‌కు వ్యతిరేకంగా ఖల్సా వహీర్‌ను ప్రారంభించనున్నట్లు అకాల్ తఖ్త్ ప్రకటించింది. ఖల్సా వహీర్ అనేది సిక్కు మతాన్ని ప్రచారం చేసే పాత పద్ధతి. అయితే ఇటీవల ఖల్సా వహీర్ అమృతపాల్ సింగ్ నేతృత్వంలో జరిగింది.

ఒకవైపు సిక్కు కార్యకర్తలను అరెస్టు చేయడం, మైనారిటీలను బెదిరిస్తూ హిందూ రాష్ట్రానికి పిలుపునిచ్చే హిందుత్వ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ‌ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని అని జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ అన్నారు.

అకల్ తఖ్త్, శిరోమణి గురుద్వారా ప్ర‌రబంధక్ కమిటీ (SGPC) చేస్తున్న‌ ప్రధాన డిమాండ్లు:

24 గంటల్లో... ఇటీవలి అణిచివేతలో భాగంగా అనేక మందిపై విధించిన జాతీయ భద్రతా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. అరెస్టు చేసిన 'అమాయక యువకులను' విడుదల చేయాలి

హరికే వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సిక్కుల సీజ్ చేసిన వాహనాలను వెంటనే యజమానులకు అప్పగించాలి.

నిషేధించిన వెబ్ ఛానెళ్ళు, సోషల్ మీడియా ఖాతాలను వెంటనే యాక్టివేట్ చేయాలి.

ఖల్సా చిహ్నాన్ని, జెండాను ఖలిస్తాన్ చిహ్నంగా ప్రచారం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

'సిక్కు జెండాలు, చిహ్నాలపై తప్పుడు ప్రచారానికి' నిరసనగా, జతేదార్ అకల్ తఖ్త్ సిక్కులు తమ వాహనాలు, ఇళ్లపై ఖల్సా జెండాలను ప్రదర్శించాలి.

"సిక్కులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా మోసపూరితంగా, హింసాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి." అని అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్ డిమాండ్ చేశారు.

“ఒకవైపు, ఈ ప్రజాస్వామ్య, మతపరంగా వైవిధ్యభరితమైన భారతదేశంలో, మైనారిటీలను అణచివేసి హిందూ రాష్ట్రాన్ని సృష్టించడానికి రెచ్చగొట్టే బహిరంగంగా ప్రకటనలు చేసే వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు, ప్రజాస్వామ్య చట్రంలో తమ అభిప్రాయాలను తెలిపే సిక్కులపై ప్రభుత్వాలు క్రూరమైన చట్టాలను విధిస్తున్నాయి.''

''అక్రమంగా అరెస్టు చేసిన యువతను 24 గంటల్లో విడుదల చేసి శాంతియుత‌ వాతావరణాన్ని సృష్టించకపోతే , భారతదేశంలోనే కాక‌ విదేశాలలో కూడా దౌత్యపరంగా ప్రచారం ప్రారంభించబడుతుంది.'' అని హర్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు.

జాతీయ భద్రతా చట్టం కింద నమోదైన సిక్కు యువకులకు సహాయం చేయడానికి, ఇతర న్యాయ సహాయం అందించడానికి SGPC ప్రెసిడెంట్ అడ్వకేట్ హర్జిందర్ సింగ్ ధామీ న్యాయవాదుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

First Published:  28 March 2023 1:14 AM GMT
Next Story