Telugu Global
National

ఎమ్మెల్యేలకు చెవిలో పూలు.. ఎందుకంటే..?

బీజేపీ ప్రభుత్వం నిజంగానే ప్రజల చెవిలో పూలు పెడుతోందని, దానికి సింబాలిక్ గా తాము పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చామని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

ఎమ్మెల్యేలకు చెవిలో పూలు.. ఎందుకంటే..?
X

పసలేని బడ్జెట్ తో ఇటీవల కేంద్రం దేశ ప్రజలందరి చెవిలో పూలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రాల వంతు వచ్చింది. కర్నాటకలో అధికార బీజేపీ కూడా బడ్జెట్ తో మరోసారి ప్రజల్ని మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గతేడాది బడ్జెట్ హామీల్లో కేవలం 10శాతం మాత్రమే అమలు చేశారని, కేటాయింపులే ఇంకా పూర్తి కాలేదని, ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ తో మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిలో పూలతో బడ్జెట్ సెషన్లో నవ్వులు పూయించారు.

మాజీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధరామయ్య చెవిలో పువ్వు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ను ఫాలో అయ్యారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన కాసేపటికే బడ్జెట్ ప్రసంగం వినపడుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెవిలో పూలు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా సభ ఘొల్లుమంది. బీజేపీ ప్రభుత్వం నిజంగానే ప్రజల చెవిలో పూలు పెడుతోందని, దానికి సింబాలిక్ గా తాము పూలు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చామని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

చివరి బడ్జెట్ ఇదే..

ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని కూల్చి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ మరో దఫా కర్నాటకలో అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని అంటున్నారు. వంతుల వారీ కుర్చీలాటలో చివరిగా సీఎం సీట్లోకి వచ్చిన బసవరాజ్ బొమ్మై, ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనే తాజా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేతలు చెవిలో పూలు అంటూ విమర్శలు గుప్పించారు. కమీషన్ రాజ్ వ్యవస్థ నడుస్తోన్న కర్నాటకలో ఈసారి బీజేపీకి గడ్డుకాలమేననే సంకేతాలు కనపడుతున్నాయి.

First Published:  17 Feb 2023 8:17 AM GMT
Next Story