Telugu Global
National

స్వంత రాష్ట్ర‍లో కూడా శశి థరూర్ కు మద్దతు ఎందుకులేదు ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న శశి థరూర్ కు ఆయన స్వంత రాష్ట్రమైన కేరళ నుండి కూడా మద్దతు లభించడం లేదు. కేరళ సీనియర్ నాయకులంతా మల్లికార్జున్ ఖర్గేకు సపోర్ట్ గా నిలబడ్డారు.

స్వంత రాష్ట్ర‍లో కూడా శశి థరూర్ కు మద్దతు ఎందుకులేదు ?
X

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక రేసులో కర్నాట‌కకు చెందిన మల్లికార్జున్ ఖర్గే, కేరళకు చెందిన శశి థరూర్ లు పోటీ పడుతున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన దళిత నాయకుడైనా ఖర్గే. మూడు సార్లు తిరువనంతపురం నుంచి ఎంపీగా ఎన్నికైన ఉన్నత వర్గానికి చెందిన థరూర్ ల పోటీ రసవత్త‌రంగా ఏమీ లేదు. వీళ్ళిద్దరిలో ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందనే ప్రచారం (నిజం కూడా కావచ్చు) ఆయన విజయానికి దారులు తెరిచింది.

దాదాపు అన్ని రాష్ట్రాల సీనియర్ నాయకులు, పీసీసీలు ఖర్గే కు మద్దతుగా నిలబడగా థరూర్ కు తన స్వంత రాష్ట్రమైన కేరళలో కూడా ఆదరణ కరువైంది. , కేరళలోని మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఎకె ఆంటోనీ, ఊమెన్ చాందీ, రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్,మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలా వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖర్గేకు మద్దతుగా నిలిచారు.

ఇలా స్వంత రాష్ట్రంలో కూడా థరూర్ కు మద్దతు ఎందుకు లభించడంలేదు? ఆయనకు గాంధీ కుటుంబ మద్దతు లేకపోవడమే కారణమా ? అది ఒక కారణమైనప్పటికీ థరూర్ కు ఉన్న ఇమేజ్ కూడా ఆయనను పార్టీ కార్యకర్తల నుండి దూరం చేస్తోంది.

UN దౌత్యవేత్త నుండి రాజకీయవేత్తగా మారిన థరూర్ పుట్టింది పెరిగింది భూస్వామ్య కుటుంబంలో, అగ్రకులమైన నాయర్ కుటుంబంలో.... అంతే కాదు ఆయన ప్రవర్తన కూడా ప్రజల్లో ఒకడిగా కాక ఉన్నత వర్గాలకు చెందిన మనిషిలా ఉంటుంది. థరూర్, తన మాజీ దౌత్యవేత్త, రచయిత వంటి ఇమేజ్ , అధునాతనమైన కాస్మోపాలిటన్ రాజకీయవేత్తగా ఉన్న ఇమేజ్‌ను మరింత పెంపొందించుకుంటున్నారు, కానీ మాస్ లీడర్‌గా మారడంలో విజయం సాధించలేదు.

ఇక కేరళలో థరూర్ ను వ్యతిరేకిస్తున్న నాయకులంతా మాస్ ఇమేజ్ ఉన్న నాయకులు.మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితలా మాట్లాడుతూ ఖర్గేతో పోలిస్తే థరూర్ లో పార్టీకి అధ్యక్షుడయ్యే క్వాలిటీ ఏమీ లేదని అన్నారు.

కేరళలో థరూర్‌కు కు వ్యతిరేకంగా ఖర్గేకు మద్దతుగా నిలబడ్డవాళ్ళంతా మాస్ లీడర్లుగా ప్రసిద్ధి చెందారు. చాలా మంది కాంగ్రెస్‌లోని విద్యార్థి, యువజన సఘాల కార్యకలాపాల నుంచి పైకి వచ్చిన వారే. కింది స్థాయి రాజకీయాలపై గొప్ప అవగాహన ఉన్నవారు. ఉదాహరణకు కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి పెద్దఎత్తున జనాలను రప్పించగల సామర్ద్యత ఉందని పేరు. అతని అతిపెద్ద ట్రంప్ కార్డు ఏమిటంటే, అతను డజన్ల కొద్దీ సాధారణ ఓటర్లను వారి పేరుతో గుర్తుపెట్టుకోగలడు. ఊమెన్ చాందీ, అతని సమకాలీనులైనఇతర నాయకులు కూడా ఓటర్లతో బాగా కనెక్ట్ అయ్యారు, వారి నియోజకవర్గాల గురించి మాత్రమే కాకుండా ప్రాంతీయ వైవిధ్యాల గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నారు.

అంతే కాదు థరూర్ రాష్ట్ర యూనిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని పదవులు చేపట్టడం వల్ల కూడా స్థానిక నాయకుల్లో థరూర్‌పై వ్యతిరేకత ఉంది. అదానీ-విజింజం పోర్టుకు ఆయన మద్దతు పలకడం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆయన బహిరంగంగా పొగడడం వంటివి కూడా ఆయనను స్థానిక కాంగ్రెస్ నాయకులకు దూరం చేసింది.

మిగతా రాష్ట్రాల్లోనే కాక ఆయన స్వంత రాష్ట్రంలో కూడా థరూర్ కు ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పద్దతులను మార్చుకోవడానికి ఏ మాత్రం సిద్దంగా లేరు. విజయదశమి రోజున కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఓ టీవీ ఛానల్ లో జరిగిన ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. అప్పుడాయన ఉన్నత భూస్వామ్య కులాల వేష‌ధారణతో ఇంటర్వ్యూకు వచ్చారు.

ఎర్రటి కుర్తా పైన బంగారు రంగు అంచుతో శాలువా, నుదుటిపై చందనపు పేస్ట్ (చందనకూరి) ధరించిన శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని సంస్కరించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. కేరళ భూస్వామ్య , ఆధిపత్య కుల పురుషులకు సంబంధించిన ఈ వేషధారణలో కాంగ్రెస్ కేరళ యూనిట్ నుండి ఏ ఇతర నాయకుడు టీవీ ఇంటర్వ్యూకి వస్తారని ఊహించడం కష్టం.

అయితే కేరళలో ఊహించని వ్యక్తి నుండి థరూర్ కు మద్దతు రావడం ఆసక్తి కలిగించే అంశమే. సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ థరూర్ కు మద్దతు ప్రకటించారు. ఆయన లాంటి ఆధునిక వాదిని గెలిపించాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉందని సీపీఎం నేత అన్నారు. ఈ ప్రకటన థరూర్ కు సంతోషం కలిగిస్తుందేమో కానీ ఓట్లు రావడానికి మాత్రం పనికి రాదు కదా 1

Next Story