Telugu Global
National

వరస బీజేపీ ఓటములను పక్కనపెట్టి గుజరాత్ లో గెలుపునే మీడియా ఎందుకు హైలైట్ చేస్తున్నది ?

మంగళ వారం వరకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఒక్క గుజరాత్ తప్ప మిగతా రెండింటిని బీజేపీ కోల్పోయింది. ఇక దేశంలో 7 స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 5 స్థానాల్లో ఓడిపోయింది. ఈ ఓటములేవీ ఈ దేశ మీడియా కంటపడలేదెందుకని ?

వరస బీజేపీ ఓటములను పక్కనపెట్టి గుజరాత్ లో గెలుపునే మీడియా ఎందుకు హైలైట్ చేస్తున్నది ?
X

ఈ రోజు మెజార్టీ ప్రముఖ జాతీయ, ప్రాంతీయ పత్రికలు, ఛానళ్ళు... బీజేపీ, ఇంకా చెప్పాలంటే మోడీ భజనలో మునిగితేలాయి. నిన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా ఏడు ఉపఎన్నికల ఫలితాలు వచ్చాయి. మూడు రోజుల క్రితం ఢిల్లీమున్సి పల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఒక్క గుజరాత్ తప్ప అన్ని చోట్లా బీజేపీ ఓడి పోయింది. అయినా మీడియా గుజరాత్ లో బీజేపీ గెలుపుకు ఇచ్చిన ప్రాధాన్యత మరే పార్టీ గెలుపుకు ఇవ్వకపోవడం గమనార్హం. అందులోనూ గుజరాత్ గెలుపులో ప్రధాని నరేంద్ర మోడీ పాత్రనే హైలైట్ చేసింది మీడియా.

మంగళ వారం వరకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఒక్క గుజరాత్ తప్ప మిగతా రెండింటిని బీజేపీ కోల్పోయింది. ఇక దేశంలో 7 స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ 5 స్థానాల్లో ఓడిపోయింది. ఈ ఓటములేవీ ఈ దేశ మీడియా కంటపడలేదెందుకని ?

హిమాచల్ లో 68 శాసనసభా స్థానాల్లో 40 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ మంచి విజయమే ద‌క్కించుకుంది. 15 ఏళ్ల బిజెపి పాలనను బద్దలు కొట్టి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగురవేసింది.

అయితే గుజరాత్ బీజేపీ గెలుపును తక్కువ చేయాల్సిన వసరం లేదు. అక్కడ 20 ఏళ్ళకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం గొప్ప విషయమే అయితే మిగతా చోట్ల ఇతర పార్టీల విజయాన్ని ఎందుకు మీడియా గుర్తించలేక పోతోంది. మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అని ప్రచారం చేసే బీజేపీ అదే మోడీ నాయకత్వంలో హిమాచల్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సి పల్ కార్పోరేషన్, ఉప ఎన్నికలు జరిగిన ఏడింట్లో ఐదు స్థానాల్లో ఓడిపోయింది. దీన్ని తక్కువగా చూస్తే ఎలా ?

మెజార్టీ పత్రికల బ్యానర్, మొదటి పేజీల్లో గుజరాత్ మాత్రమే కనిపించింది. 'మోడీ మ్యాజిక్' అంటూ, 'బీజేపీ రికార్డ్' అంటూ ప్రచార హోరుతో ముంచెత్తాయి. చానళ్ళయితే మోడీ ...మోడీ ...అంటు బీజేపీ కార్యకర్తల వలే నినదించాయి.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన మొదటి పేజీలో గుజరాత్‌లో బిజెపికి ఇది "స్వీప్, రికార్డ్" అని పేర్కొంది. 156 సీట్లు గెల్చుకొని బీజేపీ ఎంత గొప్ప రికార్డు సృష్టించిందో ఆ పత్రిక వివరించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీలో "మోడీస్ గుజరాత్, కాంగ్రెస్, AAP లను చితక్కొట్టింది" అని రాసింది. "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరేంద్ర మోడీ" అని ఈ పత్రిక పేర్కొంది.

ఈ పత్రికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ విజయానికి పెద్దగా ప్లేస్ కేటాయించలేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రభుత్వాలను మార్చే సాంప్రదాయంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గెల్చినట్టు చెప్పాయి.

ది హిందూ మాత్రం తన మొదటి పేజీలో గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి కూడా మాట్లాడింది. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో దాదాపు 13% ఓట్ షేర్ సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పతనానికి కారణమైంది అని రాసింది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయాన్ని కూడా ఈ పత్రిక హైలైట్ చేసింది.

ఇక హిందూస్థాన్ టైమ్స్ తన మొదటి పేజీ బ్యానర్ లో గుజరాత్‌లో బీజేపీ గెలుపును "మోడీ ఏడవ అద్భుతం" గా అని పేర్కొంది.

హిందీ భాషా దినపత్రిక అమర్ ఉజాలా, గుజరాత్‌లో 'చరిత్ర సృష్టించబడింద'ని , హిమాచల్ ప్రదేశ్‌లో "సంప్రదాయం" కొనసాగించబడిందని రాసింది. గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడో విజయం సాధించడానికి ప్రధానమంత్రి "కరిష్మా (వ్యక్తిగత తేజస్సు)" కారణమని ఆ పత్రిక పేర్కొంది.

హిందుస్థాన్ వార్తాపత్రిక "గుజరాత్‌లో మోడీ-మోడీ" అనే శీర్షికతో బ్యానర్ ఐటెమ్ ప్రచురించింది. ఇక హిమాచల్ గురించి "హిమాచల్ మే ఫిర్ సే కాంగ్రెస్ కి హుకుమత్ (హిమాచల్‌లో మరోసారి కాంగ్రెస్ పాలన)" అని రాసింది.

మరో హిందీ వార్తాపత్రిక ప్రభాత్ ఖబర్ గుజరాత్‌లో బిజెపి విజయాన్ని "చారిత్రకం, మాయాజాలం"గా అభివర్ణించింది.

ఇక తెలుగు పత్రికల విషయానికి వస్తే ఈనాడు పత్రిక బ్యానర్ గుజరాత్ ఎన్నికల గురించే రాసింది. 'పశ్చిమ తీరంలో కాషాయ సునామీ' 'గుజరాత్ లో బాజాపా అఖండ విజయం' అని బ్యానర్, దానికి కింద చిన్నగా హిమాచల్ లో హస్తవాసి అని కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావించింది.

సాక్షి పత్రిక 'మోడీ మ్యాజిక్' అని బ్యానర్ ఐటెమ్ రాసి దాని పక్కనే చిన్నగా హిమాచల్ లో హస్తం హవా అని రాసింది.

ఆంధ్రజ్యోతి మాత్రం "గుజరాత్ లో కమాల్, హిమాచల్ లో ఢ‌మాల్ " అని బ్యానర్ ప్రచురించింది.

ఇక న్యూస్ ఛానళ్ళు నిన్న ఉదయం నుండే మోడీ... మోడీ...అంటూ నినాదాలతో తమ ప్రసారాలను ప్రారంభించాయి. తమ చర్చా కార్యక్రమాల్లో బీజేపీ గెలిచిన గుజరాత్ పైనే నిన్నటి రోజంతా దృష్టి కేంద్రీకరించాయి. అప్పుడప్పుడు హిమాచల్ గురించి ఒకటీ అరా మాటలు మాట్లాడినా ఆ టోన్ లో కాంగ్రెస్ ఎందుకు గెల్చింది అనే బాధ స్పష్టంగా కనిపించింది. మొన్నటి వరకు బ్యాలెన్స్ గా ఉండే ఎన్ డీ టీవీ ఈ మధ్య మేనేజ్ మెంట్ మారడంతో నిన్న మోడీకి జై కొట్టిన తీరు స్పష్టంగా కనిపించింది.

నిజం చెప్పాలంటే గుజరాత్ గెలుపు బీజేపీ బలాన్ని ఎంతగానైతే సూచిస్తుందో హిమాచల్ ప్రదేశ్ లో, ఢిల్లీ మున్సి పల్ కార్పోరేషన్ లో, ఉప ఎన్నికల్లో 5 స్థానాల్లో బీజేపీ ఓటమి కూడా ఆ పార్టీ బలహీనతను అంతగానే తెలియజేస్తున్నాయి. మరి మీడియాచర్చ‌ రెండింటి మీద చేయాలి కదా ?

First Published:  9 Dec 2022 12:22 PM GMT
Next Story