Telugu Global
National

సోమవారం బీజేపీ ట్రోలింగ్ టీం ఎందుకు నిద్ర నటించింది?

హైదరాబాద్ లో భారీ వర్షాలు పడి నగరంలో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ట్రోల్ చేసిన బీజేపీ ఐటీ సైన్యం నిన్న బెంగుళూరు నగరం అంత కన్నా ఎక్కువగా అతలాకుతలమైనా కనీసం స్పందించక పోవడానికి కారణమేంటి ?

సోమవారం బీజేపీ ట్రోలింగ్ టీం ఎందుకు నిద్ర నటించింది?
X

ఓ 15 రోజుల క్రితం హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా కొన్ని సార్లు ఇదే విధమైన వర్షాలతో హైదరాబాద్ జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్టోబర్ 13, 2020న ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ లో 324 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆయా సమయాల్లో సోషల్ మీడియాలో బీజేపీ ట్రోలర్స్ సాగించిన అరాచకం ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి. రాష్ట్ర బీజేపీ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై గుప్పించిన ఆరోపణలు గుర్తు తెచ్చుకోండి. అంత పెద్ద వర్షం తెలంగాణ ప్ర‌భుత్వమే కురిపించిందన్నట్టుగా విమర్శలు చేశారు.

ఇక ఇప్పటి విషయానికొద్దాం నిన్న కర్నాటక లో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని బెంగుళూరులో దాదాపు జన జీవనం ఆగిపోయింది. వాహనాలు నీళ్ళలో తేలియాడాయి. కంపెనీల్లోకి నీరు దూసుకెళ్ళింది. రోడ్ల మీద వాహనాలు నడిచే పరిస్థితే లేకుండా పోయింది. తమకు ఈ వర్షాల వల్ల దాదాపు 225 కోట్ల నష్టం వచ్చినట్టు ఓఆర్ ఆర్ కంపెనీస్ అసోసియేషన్ ప్రకటించింది. నగరానికి మంచి నీళ్ళు సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ నీట మునిగిపోయి రెండు రోజుల పాటు మంచినీటి సరఫారాను ఆపేసింది ప్రభుత్వం. దీన్ని బట్టి బెంగుళూరు సోమ వారం ఎంత అతలాకుఅతలం అయ్యిందో అర్దమవుతోంది. సోమవారం ఒక్క రోజు అక్కడ 24 గంటల్లో 131.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయ్యింది. ఒక్క సారి అక్టోబర్ 13, 2020న హైదరాబాద్ లో కురిసిన 324 మిల్లీమీటర్ల వర్షపాతంతో దీన్ని పోల్చండి. ఇప్పుడు మరో సారి అప్పడు బీజేపీ నేతలు, వారి ఐటీ టీంలు చేసిన హడావుడి గుర్తు తెచ్చుకోండి.

నిన్నంతా సోషల్ మీడియాలో బెంగుళూరు నెటిజనులు, నీటిలో మునిగిపోయిన నివాస ప్రాంతాల యొక్క కొన్ని షాకింగ్ వీడియోలను పోస్ట్ చేశారు. ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. అయితే బెంగుళూరులో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే, కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో, ఇళ్ళలోంచి బైటికి రాలేని దుస్తితిలో ఉంటే మరెందుకో బీజేపీ ఐటీ సెల్ గానీ, బీజేపీ నాయకులు నిశ్శబ్ధంగా ఉన్నారు. నిద్ర నటించారు.

హైదరాబాద్‌లో వర్షాలు ముంచుకొచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చ చేసే ఈ ట్రోలింగ్ సైన్యాలు, 2015 నుండి బిజెపి అధికారంలో ఉన్న బెంగళూరులో ఉన్న దారుణమైన పరిస్థితిపై నెటిజనులు పోస్టులు పెడుతున్నప్పటికీ, వీడియోలు షేర్ చేస్తున్నప్పటికీ కనీసం స్పంది‍ంచలేదెందుకు ?

బిజెపి ట్రోల్ ఆర్మీలు హైదరాబాద్ లో అప్పటి పరిస్థితిని పదేపదే హేళన‌ చేయడానికి ప్రయత్నిస్తూ, ఇతర ప్రాంతాలు , దేశాల వీడియోలను ఇక్కడివిగా చూపి అబద్దపు ప్రచారం చేశారు. 2020 అక్టోబర్ లో హైదరాబాద్ లో అంత పెద్ద వర్షం కురిసి ఎంతో నష్టం సంభవిస్తే ఇక్కడి బీజేపీ నాయకులు, ఎంపీలు కనీసం కేంద్ర బీజేపీ సర్కార్ ను ఒప్పించి కొద్ది మొత్తం కూడా రాష్ట్రానికి సహాయం చేసేట్టుగా చేయలేదు. ఆ విపత్తు జరిగి రెండేళ్ళైనా ఇప్పటికీ కేంద్రం నయాపైసా సహాయం కూడా చేయలేదు. పైగా బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పై మాత్రం ముప్పేట దాడి చేశారు. మరి ఇప్పుడేమయ్యింది. అంత కన్నా ఎక్కువగా ఈ రోజు బెంగుళూరు పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఒక్క బీజేపీ నాయకుడు గానీ, ఐటీ సెల్ సైన్యం కానీ బెంగుళూరు వరద‌ పరిస్థితి గురించి ఒక్క మాట మాట్లాడలేదు.

మరో వైపు ఈ బీజేపీ నాయకులు, ట్రోలింగ్ సైన్యం ప్రవర్తనకు విరుద్దంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రవర్తన ఉంది. పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా నగరాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య ను మరింత సమర్దవంతంగా ఎదుర్కోవడానికి అందరం సమిష్టిగా కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బెంగుళూరు పరిస్థితిపై అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కమాట అనలేదు. విమర్శలు చేయలేదు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో మెజారిటీ నెటిజనులు మెచ్చుకుంటున్నారు. ఇది చూసైనా బీజేపీ నేర్చుకుంటుందని ఆశించవచ్చా ?

First Published:  6 Sep 2022 6:24 AM GMT
Next Story