Telugu Global
National

ఆ హిందుత్వ సంస్థ బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయబోతో‍ంది ?

హిందుత్వ కోసం పోరాడే నాలాంటి వారికి బీజేపీ మద్దతు ఇవ్వదు. కాబట్టి, మేము స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము అని శ్రీరాంసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అన్నారు.

ఆ హిందుత్వ సంస్థ బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయబోతో‍ంది ?
X

కర్నాటకలో చురుకుగా పని చేసే శ్రీరాం సేన వచ్చే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా ఆ సంస్థ తమకు మద్దతు ఇవ్వవలసిందిగా బీజేపీని కోరింది అయితే బీజేపీ నిరాకరించడంతో, 25 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దమైంది.

శ్రీరామ్‌సేన 2014 నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటోందని, అయితే అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమకు మద్దతు ఇవ్వకపోవడంతో వెనక్కి తగ్గామని శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అన్నారు. హిందుత్వ కోసం పోరాడే నాలాంటి వారికి బీజేపీ మద్దతు ఇవ్వదు. కాబట్టి, మేము స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము అని ఆయన తెలిపారు.

కర్నాటకకు చెందిన ఈ హిందుత్వ నాయకుడు గతంలో చాలా సార్లు బిజెపిని విమర్శించారు. "బీజేపీ హిందుత్వను పక్కదారి పట్టిస్తోందని" ఆరోపించారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీకి 224 స్థానాలకు గానూ 25 స్థానాల్లో పోటీ చేస్తామని సేన ప్రకటించగా, ఇప్పటికే 10 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే హిందూ ఓటు బ్యాంక్ చీలకుండా తాము నిలబడే స్థానాల్లో బీజేపీ పోటీలో దిగకుంటే బావుంటుందని భావిస్తున్నామని అయితే అందుకు బీజెపి ఒప్పుకోవడం లేదని ముతాలిక్ అన్నారు.

ముతాలిక్ స్వయంగా ఉడిపిలోని కర్కల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు, అక్కడ సేన క్రియాశీలంగా ఉంది. తరచుగా హిందుత్వకు మద్దతుగా కార్యకలాపాలు చేపడుతుంది.

నిజాయతీగా పని చేయడం, హిందూత్వను ముందుకు తీసుకెళ్ళడ‌మే శ్రీరామ్ సేన ప్రధాన ఎజెండా అని పేర్కొన్న ముతాలిక్ , "మొత్తం వ్యవస్థ అవినీతితో కుళ్ళిపోయింది", "హిందూత్వను పక్కదారి పట్టించారు" అని అన్నారు.

అయితే శ్రీరాం సేన పోటీ చేయడం వల్ల తమకు నష్టం కలుగుతుందని బీజేపీ భావించడం లేదు.

“ఈ ఎన్నికల్లో, మా బలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజయాలతోనే ముందుకు పోతాం. ముఖ్యంగా మెజారిటీ వర్గాల హృదయాలకు దగ్గరగా ఉన్నాం. ఆ వర్గాల ఆధారంతోనే మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్నాం’’ అని కర్ణాటక బీజేపీ అధికార ప్రతినిధి గణేష్ కార్నిక్ అన్నారు.

''శ్రీరామ్ సేనకు చెందిన కొంతమంది నిబద్ధత కలిగిన కార్యకర్తలు మాత్రమే ఈ సంస్థకు ఓటు వేసే అవకాశం ఉంది. మెజారిటీ హిందువులు బిజెపికే మద్దతిస్తారు. ఓటర్లు తెలివైనవారు. బిజెపి మాత్రమే హిందువులకు రాజకీయ ప్రతినిధిగా ఉండగలదని వారికి తెలుసు'' అని గణేష్ కార్నిక్ అన్నారు.

మరో వైపు ముస్లింల మద్దతున్న‌ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ ఓట్లకు గండికొట్టి బిజెపికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది అనే వాదన వినిపిస్తోంది.

First Published:  10 Jan 2023 12:25 PM GMT
Next Story