Telugu Global
National

ఒక రీసెర్చ్‌ పేపర్‌పై అంత అసహనమెందుకు?

బిజెపి ప్రేలాపనలు భరించలేకనే అశోకా యూనివర్సిటీ యాజమాన్యం దిగివచ్చి ఆ పత్రం ఇంకా ఆమోదం పొందలేదని, పరిశీలనలో ఉందని వివరణ ఇవ్వాల్సి రావడం శోచనీయం.

ఒక రీసెర్చ్‌ పేపర్‌పై అంత అసహనమెందుకు?
X

ఎన్నికల్లో గెలవడానికి బిజెపి ఎలాంటి అక్రమాల‌కైనా పాల్పడుతుందని అశోకా యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సవ్యసాచి దాస్‌ పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 303 సీట్లు గెలుచుకుంది. అందులో దాదాపు వంద సీట్లలో స్వల్ప మెజారిటీ సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలపై అప్పట్లోనే విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు. నాటి ఫలితాలపై శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తూ సవ్యసాచిదాస్‌ రాసిన పరిశోధనా పత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలోనే పరిశోధకునికి దురుద్దేశాలను అంటగడుతూ బిజెపి శ్రేణులు ఎదురుదాడికి దిగాయి.

ప్రతిష్టాత్మకమైన అశోకా యూనివర్సిటీ ఎకనామిక్స్‌ విభాగంలో పనిచేసే సవ్యసాచి దాస్‌ చక్కటి అకాడమిక్‌ చరిత్ర కలిగిన వ్యక్తి. అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేశారు. అకడమిక్‌ ప్రమాణాలని పాటిస్తూ బిజెపి గెలిచిన విధం ఎలాంటిదో తన పరిశోధనా పత్రంలో నిర్ధారించారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పోటాపోటీగా ఎన్నిక జరిగిన స్థానాలలోనే పోలింగ్‌ బూత్‌ లెవల్‌లో బిజెపి అక్రమాలకు పాల్పడిరదని, దీనికి ఎన్నికల కమిషన్‌ కూడా సహకరించిందని ఆయన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. తన పరిశోధనకు సంబంధించిన వివరాలను, భూమికను అందించారు. ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో అక్కడి రాష్ట్ర అధికారులనే ఎన్నికల ప్రక్రియలో నియమించారు. ఇది అక్రమాలకు పాల్పడేందుకు మార్గం సుగమం చేసింది.

ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండి గెలుపు సంక్లిష్టమవుతుందనుకున్న స్థానాల్లో పోలింగ్ ప్ర‌క్రియ‌లో అవకతవకలు జరిగాయి. ముస్లిం ఓటర్లు తక్కువగా ఉన్న స్థానాలలోనూ కొంతమేరకు పోలింగ్‌ కేంద్రాలలో జరిగిన ఓటింగ్‌కు, కౌంటింగ్‌లో కనిపించిన ఓట్ల సంఖ్యకు మధ్య తేడాలని ఈ పత్రంలో చూపారు. ఈ కారణంగానే వంద స్థానాలను స్వల్ప ఆధిక్యతతో బిజెపి కైవసం చేసుకోగలిగిందని సవ్యసాచిదాస్‌ పరిశోధనా పత్రం విశ్లేషణలు చెబుతున్నాయి. దీనితో కనీసం ఆ పరిశోధనా పత్రం చదవకుండానే కాషాయ పరివారం విరుచుకుపడుతుంది.

ఒక సీనియర్‌ స్కాలర్‌ నిర్దారించిన అంశాలు నిజం కాదనుకుంటే ఆధారాలతో సహా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై, బిజెపి ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ ఎం.పి. శశిథరూర్‌ అంటున్న మాటలకు బిజెపి నుంచి సరైన స్పందన లేదు. ఇది అరకొర పరిశోధనల పేరుతో మన ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతని దెబ్బతీయడమేనని, దీనిని ఒక యూనివర్సిటీ ఎలా అనుమతించిందని జార్ఖండ్‌ బిజెపి ఎం.పి. నిశికాంత్‌ దూబే ట్విట్‌ చేశారు. పరిశోధన చేసే హక్కునే ఆయన ప్రశ్నిస్తున్నారు. కాగా, పరిశోధకుడు ఎలాంటి ఆధారం లేకుండా మన ఎన్నికల వ్యవస్థ లోప భూయిష్టమైందని చెబుతున్నాడని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసే దేశ వ్యతిరేక శక్తుల కుట్రలని గమనించాలని ఢిల్లీ బిజెపి ఎం.పి. ప్రవీశ్‌సింగ్‌ ఆరోపిస్తున్నారు. నిజాలు మాట్లాడితే జాతివ్యతిరేక కుట్రల పేరుతో దబాయించే కాషాయ శ్రేణుల ధోరణిని ఇది సూచిస్తోంది.

ఒక యూనివర్సిటీ పరిశోధకుని పత్రంపై కాషాయ పరివారానికి ఇంత అసహనమెందుకు? తమని ఎవరూ ప్రశ్నించరాదనే దురంహకారమెందుకు? ఆ పత్రంలో ఉన్న నిర్ధారణలు సరి కాదనుకుంటే ఆధారాలతో సహా జనం ముందు పెట్టవచ్చు. కానీ తమని, తమ పాలనను, ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలను ఎవరూ ప్రశ్నించరాదనే ధూర్తత్వమెందుకు? ప్రశ్నించినంత మాత్రాన‌ దేశ వ్యతిరేక ముద్రలు వేయడమెందుకు? బిజెపి ప్రేలాపనలు భరించలేకనే అశోకా యూనివర్సిటీ యాజమాన్యం దిగివచ్చి ఆ పత్రం ఇంకా ఆమోదం పొందలేదని, పరిశీలనలో ఉందని వివరణ ఇవ్వాల్సి రావడం శోచనీయం. మూడోసారి మోదీ విజయం ఖాయమని, 36 పార్టీలు ఎన్‌డిఏ కూటమిలో ఉన్నాయని బీరాలు పలికే కాషాయ పరివారం ఒక చిన్న పరిశోధనా పత్రం మీద అంతగా పెట్రేగిపోవడం అవసరమా? ప్రశ్నించడం, తమ అభిప్రాయాలని వ్యక్తీకరించడం ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ఈ మౌలిక సూత్రంపై సంఘ్‌ పరివార్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నదో సవ్యసాచిదాస్‌ పత్రంపై చేస్తున్న రగడ చెప్పకనే చెబుతోంది.

First Published:  2 Aug 2023 12:15 PM GMT
Next Story