Telugu Global
National

జనాభా గణనను 'మిథ్య' గా మార్చిన మోడీ ప్రభుత్వం .. ఎందుకీ విపరీత జాప్యం ..?

150 ఏళ్ళలో మొట్టమొదటిసారిగా జనాభా గణన తెరవెనక్కి వెళ్ళింది. గత ఏడాదే పూర్తి కావలసి ఉన్నజనాభా గణన ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అనేక కారణాలు చెప్తూ మోడీ సర్కార్ ఈ డేటా సేకరణను ఆలస్యం చేయడం వెనక అసలు కారణమేంటి ?

జనాభా గణనను మిథ్య గా మార్చిన మోడీ ప్రభుత్వం .. ఎందుకీ విపరీత జాప్యం ..?
X

ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అధ్యయనాలు 'సెన్సస్' తో ముడి పడి ఉన్నాయి. కానీ ఇప్పుడు దేశంలో సెన్సస్ కి 'బూజు' పట్టినట్టు కనిపిస్తోంది. ఇది జస్ట్.. 'మిథ్య' గా మారిపోయింది. సెన్సస్ అన్నది సెన్సిటివ్ ఇష్యు కాకుండా మిగిలిపోయింది. 150 ఏళ్ళలో మొట్టమొదటిసారిగా జనాభా గణన తెరవెనక్కి వెళ్ళింది. ఇప్పట్లో ఈ ప్రక్రియ జరిగేలా కనిపించడం లేదు. ఇండియా గురించి, భారతీయుల గురించి అధికారిక డేటా అంటూ లేని పరిస్థితికి ఇది దారి తీసేవిధంగా ఉంది.. జాప్యంమీద జాప్యం జరుగుతోంది. ముఖ్యమైన ఈ ప్రక్రియ ఇలా నీరుగారిపోవడానికి.. ఎన్నో కారణాలు ఉన్నాయి.. . కొర్రీల మీద కొర్రీలు పడుతూనే ఉన్నాయి. నిజానికి ఈ ప్రక్రియ గత ఏడాదే పూర్తి కావలసి ఉన్నా.. అలా జరగలేదు. 1881 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. లోగడ యుద్దాలు జరిగినప్పుడు కూడా ఇది వాయిదా పడలేదు.

భారత జనాభా ఎక్కువ.. దీంతో సహజంగానే డేటా సేకరణ అన్నది అతి పెద్ద బృహత్ కార్యక్రమమవుతుంది. అసలు సెన్సస్ అంటే? ఇది కేవలం ప్రజల సంఖ్యను గుర్తించడమే కాదు.. వారి విద్య, ఆరోగ్యం, గృహ సౌకర్యాలు, వారి ఉపాధి, ఉద్యోగాలు.. ఇలా అన్నింటికీ ఇది ముడిపడి ఉంది. జాప్యం జరుగుతోందంటే.. అది ఒకప్పటి మాట.. 2020 లో కోవిడ్ కారణంగా సెన్సస్ విషయంలో ఆలస్యం జరిగిందని మోడీ ప్రభుత్వం చెప్పుకుంది. . కానీ తమ దేశాల్లో అంతటి మహమ్మారి ప్రబలంగా ఉన్నప్పుడు సైతం అమెరికా, చైనా, బ్రిటన్ వంటి దేశాలు సెన్సస్ నిర్వహించాయి. బహుశా ఈ అంశంపై తాము దృష్టి పెట్టామని చెప్పడానికి కాబోలు.. నెక్స్ట్ సెన్సస్ సర్వే ఈ-సర్వే గా ఉంటుందని.. 2024 నాటికి క్యారీ అవుతుందని హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇది మన దేశ తొలి డిజిటల్ సెన్సస్ అవుతుందన్నారు. కానీ ఇన్నేళ్లూ జరిగిందేమిటి ?

దేశంలో 150 ఏళ్ళ సెన్సస్ చరిత్రలో మొదటిసారిగా ఈ ప్రక్రియను మోడీ ప్రభుత్వం వాయిదా వేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియా సామ్రాజ్యవాద పాలనలో నలుగుతున్నప్పుడు . . 1941 లో సెన్సస్ నిర్వహించారు. ఆ తరువాత డేటా సేకరణ జరిగినా దాని ట్యాబ్యులేషన్ అంతంత మాత్రమే ! 1961లో చైనా ఆక్రమణ సమయంలోను.. 1971 లో బంగ్లాదేశ్ లిబరేషన్ తరుణంలో సైతం సెన్సస్ ప్రక్రియ ఆగలేదు. 2020 లో కోవిడ్ ప్రబలంగా ఉన్నప్పుడు దీన్ని చేపట్టలేకపోయామని కేంద్రం చెప్పినప్పటికీ ఈ ప్రక్రియకు సుమారు 9 వేలకోట్లను కేటాయించారట. కానీ ఇది చెప్పుకోవడానికే ! జనాభా గణనకు సంబంధించి లోగడ రెండు సర్వేలు చేపట్టినా అవి ఈ సర్కార్ తో చిక్కులను ఎదుర్కొన్నాయి. ఫుడ్, ఇతర నిత్యావసరాలపై ప్రజలు ఎంత ఖర్చు పెడుతున్నారన్నది ఓ ప్రధాన సర్వే .. 2012 తో పోలిస్తే 2018 లో ఈ వ్యయం తగ్గిపోయినట్టు ఈ సర్వేలో తేలింది. 2019 లో ఈ సర్వేకి సంబంధించిన వివరాలను ఓ డైలీ ప్రచురించింది. దీంతో అధికారికంగా డేటా విడుదల చేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రతి అయిదేళ్లకొకసారి నిర్వహించే జనాభా గణన నిర్వహణపై ఆర్ధిక శాఖలోని మాజీ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ పెదవి విరిచారు. సర్వేల డేటాను విడుదల చేయాలని ఆయన కోరినా కేంద్రం నుంచి రెస్పాన్స్ లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. దీనికి సంబంధించి 2019 లో నిర్వహించిన ఓ సర్వే షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందట. 2018 నాటికి ఇది 6 శాతం పైగా పెరిగినట్టు ఈ సర్వేలో తేలింది. దీని వివరాలను కూడా అదే డైలీ ప్రచురించినా .. మళ్ళీ మోడీ ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. అసలు డేటా అంతా తప్పుడు డేటా అని నీతి ఆయోగ్ ప్రకటించినా.. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి మార్పు లేకుండా దీన్ని విడుదల చేశారు. కానీ నిరుద్యోగ భూతం వెన్నాడుతూనే ఉంది.

ఉన్న సమస్య చాలదన్నట్టు పౌరసత్వ చట్ట సవరణ అంటూ ఒకటి తెచ్చారు. దీని మాట ఎలా ఉన్నా.. అనేక రాష్టాల్లోని ప్రజలు దీనిపట్ల విముఖత ప్రకటించారు. ఎన్యుమరేటర్లకు సహకరించేందుకు వారు తిరస్కరించారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మొదట నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (జాతీయ జనాభా గణన)ను సెన్సస్ ప్రక్రియకు ప్రభుత్వం జోడించింది. దీనివల్ల తాము అనుమానితులమని, విదేశియులని భావించిన ప్రజలను నిర్బంధ శిబిరాలకు చేర్చే అధికారాలు దిగువ స్థాయి అధికారులకు కూడా లభించాయి. దీని ఫలితంగా కుటుంబాలు కుటుంబాలు వేరైపోతాయి. భర్తల నుంచి భార్యలు వేరైపోతారు.పిల్లల గతి ఎటూ తేలకుండా పోతుంది. అసోం రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని మనం చూశాం. ప్రభుత్వ సెన్సస్ సరిగా జరగనట్టు కనిపిస్తోందని, ఇలాగే నత్తనడకన సాగితే మరో 10 ఏళ్ళ వరకు కూడా ఏ ఇంటింటి సర్వే కూడా విశ్వసనీయం కాబోదని ప్రణబ్ సేన్ అనే గణాంక నిపుణుడు చెప్పారు.

సెన్సస్ ను తాము అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు అప్పుడే చెప్పాయి. దీన్ని అమలు పరిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కేరళ ఇదివరకే వెల్లడించింది. పైగా పౌరసత్వ చట్ట సవరణపై సుప్రీంకోర్టుకెక్కింది కూడా.. దీని కారణంగా తమ ప్రజలను తాము జైలుకెళ్లనివ్వబోమని, వారి బదులు మొదట తామే వెళ్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. బెంగాల్ వంటి రాష్ట్రాలైతే .. ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించరాదని తమ ప్రజలను కోరాయి. ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రాలు పాక్షికంగా దీన్ని అమలు చేస్తామన్నాయి. ఈ నేపథ్యంలో.. ఆదరాబాదరాగా సెన్సస్ జోలికి పోతే అది పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీయవచ్చునన్నది ప్రభుత్వ భయమట .. కానీ ఇదే సమయంలో తన ఎన్సీ పీ ఆర్, ఎన్నార్సీ నినాదాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. జనాభా గణనలో క్లిష్టమైన ప్రశ్నలేవీ ఉండబోవ‌ని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసిన పక్షంలోనే ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. ఏమైనా... పదేళ్లుగా సిసలైన డేటా అంటూ లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. పైగా ఎకానమీకి సంబంధించి ఎలాంటి డేటా సైతం సర్కార్ దగ్గర లేదు. మన సంప్రదాయాలను మనమే తుంగలో తొక్కుతున్నామంటే అతిశయోక్తి కాదు.

నాటికి..నేటికీ తేడా

లోగడ అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో కూడా బీజేపీ.. కులగణన యోచన పట్ల విముఖత చూపింది. కానీ 2019 ఎన్నికలను దృష్టిలో నుంచుకొని మోడీ సర్కార్ .. ఓబీసీ సెన్సస్ ని చేపడతామని 2018 లో హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు దాని పంథా మారింది. కుల గణన సాధ్యం కాదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన అఫిడవిట్ లో తెలిపింది. సెన్సస్ లో ఈ ఎన్యుమరేషన్ ని పక్కన బెట్టామని, ఇది 1951 నాటి పాలసీ ప్రకారమని పేర్కొంది. ఎస్సీలు, ఎస్టీలు కానివారి కులాలను 1951 నుంచి ఇప్పటివరకు ఏ సెన్సస్ లోనూ ఎన్యుమరేట్ చేయలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని పార్లమెంటులో మంత్రి నిత్యానంద రాయ్ పునరుద్ఘాటించారు. సెన్సస్ లో కులాన్ని కూడా చేర్చాలని కోరుతూ ఏపీ, మహారాష్ట్ర, బీహార్ వంటి పలు రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో తీర్మానాలను ఆమోదించాయి. . అయితే ఓబీసీ వర్గాల నుంచి నిరసనలు రావచ్చునని ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. కారణం ఏదైనా జనాభా గణన ప్రక్రియను వాయిదా వేయడం వల్లో, రద్దు చేయడంవల్లో ప్రభుత్వ పాలసీలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిర్వివాదాంశం. వాస్తవాలు, డేటా లేకుండా పాలసీలను రూపొందిస్తే అది ప్రమాదానికి దారి తీసి డిజాస్టర్ అయినా కావచ్చు..




First Published:  21 Aug 2022 2:12 PM GMT
Next Story