Telugu Global
National

గుజరాత్, యూపీల్లో జరిగినవి 'భయోత్పాత సంస్మరణ దినాలు' కావా ?

ప్రధాని మోదీ, ఆగస్టు 14 న 'దేశ విభజన భయోత్పాత సంస్మరణ దినం' గా పాటించాలని పిలుపునివ్వడంలో అసలు వ్యూహం ఏంటి ? దేశ విభజన కాలంలో జరిగినట్టే స్వాతంత్య్ర భారతంలో గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన మత దాడులు మోదీకి ఎందుకు గుర్తుకు రావు ?

గుజరాత్, యూపీల్లో జరిగినవి భయోత్పాత సంస్మరణ దినాలు కావా ?
X

ఆగస్టు 14 వ తేదీని 'దేశ విభజన భయోత్పాత సంస్మరణ దినం' గా జరపడంలో బీజేపీ ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏంటి ? నిజంగా 1947 ఆగస్టు 14 దేశప్రజలందరికీ విషాదమే. అయితే అది ఏదో ఒమతానికి సంబంధించిన విషాదం కాదు. అలాంటి విషాదాలు స్వాతంత్య్ర భారతంలో అనేకం జరిగాయి. వాటి గురించి కనీసం మాట్లాడని బీజేపీ ఆగస్టు 14 గురించే ఎందుకు ప్రచారం చేస్తున్నది ?

మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో గుజరాత్ లో జరిగిన మత మారణ హోమం గురించి మోదీగానీ బీజేపీ గానీ ఒక్క సారైనా మాట్లాడిందా ? పైగా ఆ మారణ హోమంలో మోదీ పాత్ర ఉందని కోర్టులో పోరాడుతున్న వాళ్ళ మీదనే తిరిగి కేసులు బనాయిస్తున్న పరిస్థితి. మోదీ, అమిత్ షాలకు కోర్టులే క్లీన్ చిట్ ఇచ్చేసి, వాళ్ళపై ఆరోపణలు చేసినవాళ్ళనే శిక్షించేట్టు మాట్లాడంతో ఇక ఆ విషయంపై గొంతు విప్పి మాట్లాడే ధైర్యం ఎవరికుంటుంది? గుజరాత్ మారణ హోమంలో ఎంత మందికి శిక్షలు పడ్డాయి ? అసలు ఎంత మంది మీద కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా బలిపశువులయ్యింది. మైనార్టీలు, దళితులే కదా! అప్పుటి మారణ హోమంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,044 మంది మరణించారు, అందులో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు.ఇక‌ 223 మంది గల్లంతయ్యారు, 2,500 మంది గాయపడ్డారు. గల్లంతయిన వాళ్ళలో మెజార్టీ ప్రజల ఆచూకి ఇప్పటికీ తెలియలేదు. అయితే ది కన్సర్న్డ్ సిటిజన్స్ ట్రిబ్యునల్ రిపోర్ట్ 1,926 మంది మరణించి ఉండవచ్చని అంచనా వేసింది. కానీ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం 2,000 మంది కంటే ఎక్కువగానే చనిపోయారు. మరి ఈ విషాదాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు తల్చుకోదు ?

ఇక ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో 2013 లో జరిగిన‌మత దాడుల‌ గురించి అక్కడ పారిన నెత్తిటి ఏరుల గురించి, పారిపోయి, ఉండటానికి ఇళ్ళు లేక, తినడానికి తిండి లేక రోడ్లపాలైన వేలాది జనం గురించి ఏనాడైనా మాట్లాడారా ? ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 42 మంది ముస్లింలు, 20 మంది హిందువులు మొత్తం కనీసం 62 మంది మరణించారు. 93మంది గాయపడ్డారు. 50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు కోల్పోయి ప్రాణ భయంతో పారిపోయారు. ఈ విషాదం గురించి ఎన్నడైనా మోడీ ప్రభుత్వ గానీ స్థానిక యోగీ ప్రభుత్వం గానీ తల్చుకుందా ? నిరాశ్రయులై వలస వెళ్ళిపోయిన 50వేల మందిలో ఎంత మంది తిరిగి వచ్చారు ? ఇప్పటికీ ఇంకెంతమంది రోడ్ల మీద బతుకులీడుస్తున్నారన్న విషయాన్ని ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆలోచించాయా ?

''దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మన చరిత్రలో విషాదకర సమయంలో కష్టనష్టాలకు గురై, పట్టుదల, తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి కోసం పాటుపడుతున్నవారందరినీ అభినందిస్తున్నాను'' అని మోదీ చెప్పిన మాటలు గుజరాత్ కు, ఉత్తరప్రదేశ్ కు వర్తించవా ?

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగిన మత దాడుల్లో చనిపోయినవారి గురించి, ఆ విషాదాల గురించి కనీసం మాట్లాడని బీజేపీ 1947 లో జరిగిన దేశ విభజన గాయాన్ని పదే పదే ఈ దేశ ప్రజలకు గుర్తు చేయాలని ఎందుకు అనుకుంటోంది ?

ఎమర్జెన్సీ గురించి, ఇందిరా గాంధీ హత్య జరిగినప్పుడు జరిగిన సిక్కుల ఊచకోత గురి‍ంచి ప్రతిరోజూ మాట్లాడే బీజేపీ నాయకులకు వాళ్ళ హయాంలో పారిన నెత్తుటి ఏరులు ఎందుకు పట్టవు ?

ఎందుకంటే మతన్మోదం రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు సంపాదించే ప్రణాళికలో కాంగ్రెస్ హయాంలో జరిగినవి మాత్రమే చక్కగా సరిపోతాయి. ఈ దేశానికి ముస్లింలనే అసలు శత్రువులుగా చూపించడం, వాళ్ళు అలా అవడానికి నెహ్రూనే కారణంగా చూపించడం ద్వారా వాళ్ళు కోరుకునే కాంగ్రెస్ ముక్త భారత్ తోపాటే హిందూ ఓట్లను సాధించుకోగలరు. అంతే కాదు మైనార్టీల మీద విషం చిమ్మడం ద్వారా గంగా జమునా తహజీబ్ గా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా విద్వేషాలు రెచ్చగొట్టి , నెత్తుర్లు పారించి అధికారంలో పాగా వేయడానికి ఇదో ప్లాన్. ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనే వాళ్ళ ప్రణాళికకు అడ్డుగా ఉన్న కేసీఆర్ వంటి ప్రాంతీయ శక్తులను కూడా దెబ్బకొట్టడానికి ఆగస్టు 14 వాళ్ళకు దొరికిన ఒక ఆయుదం.

నిజానికి దేశ విభజన ఎవరి పాపం ? అందులో అప్పటి జన్ సంఘ్ నేతల హస్తం లేదా ? బీజేపీ వాళ్ళు ప్రతీ రోజూ భక్తితో పూజించే సావర్కరే కదా ముందుగా రెండు దేశాల‌ సిద్ధాంతాన్ని రూపొందించింది. దాన్నే జిన్నా తన ఆయుధంగా మల్చుకున్నాడన్నది చారిత్రక సత్యం కాదా ?

దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ , సావర్కర్ రెండు దేశాల‌ సిద్ధాంతాన్ని రూపొందించాడు, జిన్నా దానిని పరిపూర్ణం చేశాడని ట్వీట్ చేశారు. అంతే కాదు ''విభజనను అంగీకరించకపోతే భారతదేశం అనేక ముక్కలుగా విడిపోయి పూర్తిగా నాశనమైపోతుందని నేను భావించాను...'' అని సర్దార్ పటేల్ చెప్పిన మాటలను జైరాం రమేష్ కోట్ చేశారు.

జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ, శరత్ చంద్రబోస్ కోరికకు వ్యతిరేకంగా బెంగాల్ విభజనను సమర్థించారని, విభజన యొక్క విషాద పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలోనే స్వతంత్ర భారత తొలి మంత్రివర్గంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ మంత్రిగా ఉన్న‌ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకోవాలని జైరాం రమేష్ అన్నారు.

"ఇప్పటికీ ఆధునిక సావర్కర్లు మరియు జిన్నాలు దేశాన్ని విభజించడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.'' అని జైరాం ఆరోపించారు.

ఇప్పటికే ఈ ఎనిమిదేళ్ళలో కావాల్సినంత విషం ప్రజల హృదయాల్లో నిండింది. అది సరిపోక మరింత విషం, మరింత విద్వేషం, మరింత హింస‌ నింపడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఆగస్టు 14 'దేశ విభజన భయోత్పాత సంస్మరణ దినం' .

First Published:  16 Aug 2022 2:38 AM GMT
Next Story