Telugu Global
National

ఆ ద‌గ్గు మందు ప్ర‌మాద‌క‌రం.. - భార‌త్‌లో త‌యారైన మందుపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌

డ‌బ్ల్యూహెచ్‌వో తాజాగా గుర్తించిన‌ క‌లుషిత ద‌గ్గు మందును పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్ లిమిటెడ్ త‌యారు చేసింది. ఈ మందులో ప‌రిమితికి మించి డైథిలిన్ గ్లైకాల్‌, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఆ ద‌గ్గు మందు ప్ర‌మాద‌క‌రం.. - భార‌త్‌లో త‌యారైన మందుపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌
X

భార‌త్‌లో త‌యారైన ఓ ద‌గ్గు మందు తీసుకుంటే ప్ర‌మాద‌మ‌ని, మ‌ర‌ణానికి కూడా దారితీయొచ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రించింది. ఈ ద‌గ్గు మందు క‌లుషిత‌మైన‌ట్టు తాము గుర్తించామ‌ని తెలిపింది. ప‌శ్చిమ ప‌సిఫిక్ దేశాలైన మార్ష‌ల్ దీవులు, మైక్రోనేషియాలో వీటిని గుర్తించిన‌ట్టు వెల్ల‌డించింది.

2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో భార‌త్‌లో త‌యారైన క‌లుషిత ద‌గ్గుమందు తీసుకోవ‌డం వ‌ల్ల దాదాపు 300 మంది చిన్నారులు మృతిచెందారు. అప్ప‌ట్లో డ‌బ్ల్యూహెచ్‌వో అప్ర‌మ‌త్త‌మై స‌త్వ‌ర చ‌ర్య‌లకు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఆదేశించింది. దీనిపై భార‌త్ కూడా చ‌ర్య‌లు తీసుకుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మ‌రో ఉదంతం బ‌య‌ట‌ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది.

డ‌బ్ల్యూహెచ్‌వో తాజాగా గుర్తించిన‌ క‌లుషిత ద‌గ్గు మందును పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్ లిమిటెడ్ త‌యారు చేసింది. ఈ మందులో ప‌రిమితికి మించి డైథిలిన్ గ్లైకాల్‌, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ ద‌గ్గు మందును హ‌ర్యానాకు చెందిన థ్రిల్లియం ఫార్మా మార్కెటింగ్ చేస్తోందని వెల్ల‌డించింది. దిగుమ‌తి అయిన ద‌గ్గు మందుల్లో ఓ బ్యాచ్‌లోని న‌మూనాల‌ను ఏప్రిల్ 6వ తేదీన ప‌రిశీలించ‌గా, ఈ క‌లుషిత ఆన‌వాళ్లు గుర్తించిన‌ట్టు తెలిపింది. ఈ మందుకు సంబంధించి క్యూపీ ఫార్మా గానీ, థ్రిల్లియం గానీ భ‌ద్ర‌త‌, నాణ్య‌త‌కు సంబంధించి త‌మ‌కు ఎలాంటి గ్యారెంటీ స‌మ‌ర్పించ‌లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో క్యూపీ ఫార్మా ఎండీ మంగ‌ళ‌వారం స్పందిస్తూ.. భార‌త ప్ర‌భుత్వ అనుమ‌తితో 18 వేల సిర‌ప్ బాటిళ్ల‌ను తాము కాంబోడియాకు ఎగుమ‌తి చేసిన‌ట్టు చెప్పారు. భార‌త్‌లోనూ ఆ సిర‌ప్‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు వాటిపై ఎలాంటి ఫిర్యాదులూ రాలేద‌ని వివ‌రించారు. దీనిపై థ్రిల్లియం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. మ‌రోప‌క్క ద‌గ్గు మందు క‌లుషిత‌మైంద‌ని ప్ర‌క‌టించిన డ‌బ్ల్యూహెచ్‌వో దీని కార‌ణంగా ఎవ‌రైనా చిన్నారులు అనారోగ్యం బారిన ప‌డ్డారా లేదా అనే విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు.

First Published:  26 April 2023 2:06 AM GMT
Next Story