Telugu Global
National

మోడీపైకి ఫోన్ ను విసిరిందెవరు..?

ఈ సంఘటనతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మోడీ లక్ష్యంగా ఆయనపైకి దీన్ని విసిరారని, ర్యాలీలో భద్రతా ఉల్లంఘన జరిగిందని భావించారు. ఎస్పీజీ భద్రత మధ్య ఉండే ప్రధాని వాహనంపైకి సెల్ ఫోన్ విస‌ర‌డం సర్వత్రా ఆందోళన రేకెత్తించింది.

మోడీపైకి ఫోన్ ను విసిరిందెవరు..?
X

కర్నాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కర్నాటక లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మైసూరులో జరిగిన ఓ సభలో మోడీ ఓ ప్రత్యేక వాహనంపై నిలబడి ప్రసంగిస్తుండగా ఆయనపైకి అభిమానులు పూలు విసిరారు. అంతలోనే ఆయనపైకి ఒక మొబైల్ ఫోన్ దూసుకొచ్చింది.

ఈ సంఘటనతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మోడీ లక్ష్యంగా ఆయనపైకి దీన్ని విసిరారని, ర్యాలీలో భద్రతా ఉల్లంఘన జరిగిందని భావించారు. ఎస్పీజీ భద్రత మధ్య ఉండే ప్రధాని వాహనంపైకి సెల్ ఫోన్ విస‌ర‌డం సర్వత్రా ఆందోళన రేకెత్తించింది.

పోలీసులు వెంటనే విచారణ చేపట్టగా ఆ మొబైల్ ఫోన్ ఓ మహిళ విసిరినట్టు తెలుసుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బ‌య‌ట‌పడింది.

ప్రధాని మోడీ అంటే ఆ మహిళకు విపరీతమైన అభిమానం, ఆమె బీజేపీ కార్యకర్త. ఆ సభలో మోడీని చూసిన ఆనందంలో ఉద్వేగం పట్టలేక ఆ మహిళ మోడీపైకి తన చేతిలో ఉన్న ఫోన్ విసిరేసిందట. ఆ మహిళకు ఎటువంటి దురుద్దేశం లేదని పోలీసులు తేల్చారు.

"బీజేపీ కార్యకర్త అయిన‌ ఆ మహిళ తన ఫోన్ విసిరింది. SPG సిబ్బంది ఆ ఫోన్ ను ఆమెకు తిరిగి ఇచ్చారు" అని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అలోక్ కుమార్ చెప్పారు.

"ఉద్వేగంపట్టలేక ఆమె ఫోన్ విసిరింది. ఆమెకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, అయితే మేము ఈ విషయంలో వాంగ్మూలం నమోదు చేసేందుకు ఆమెకు సమన్లు పంపించాం." అన్నారాయన.

First Published:  1 May 2023 7:00 AM GMT
Next Story