Telugu Global
National

ఉత్తర భారతీయులపై దాడులంటూ ఫేక్ ప్రచారం వెనక ఉన్నదెవరు ? బీజేపీ రెండు నాల్కల ధోరణికి కారణమేంటి?

మొదట ఈ వార్త‌ 'దైనిక్ భాస్కర్' పత్రికలో అచ్చయ్యింది. అయితే మొదట హిందుస్థాన్ అనే పత్రికలో అచ్చయ్యిందని దైనిక్ భాస్కర్ చెబుతోంది. ఆ తర్వాత మరికొన్ని పత్రికలు అదేవార్తలు ప్రచారం చేశాయి. ముఖ్యంగా బీహార్ లో ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

ఉత్తర భారతీయులపై దాడులంటూ ఫేక్ ప్రచారం వెనక ఉన్నదెవరు ? బీజేపీ రెండు నాల్కల ధోరణికి కారణమేంటి?
X

తమిళనాడులో హిందీ మాట్లాడే వారిని హత్యలు చేస్తున్నారని, వారిపై దాడులు జరుగుతున్నాయని కొన్ని ప్రధాన స్రవంతి పత్రికల్లో, వెబ్ సైట్ లలో , సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు కొన్ని వీడియోలను కూడా ఉదహరణలుగా చూపించారు.

మొదట ఈ వార్త‌ 'దైనిక్ భాస్కర్' పత్రికలో అచ్చయ్యింది. అయితే మొదట హిందుస్థాన్ అనే పత్రికలో అచ్చయ్యిందని దైనిక్ భాస్కర్ చెబుతోంది. ఆ తర్వాత మరికొన్ని పత్రికలు అదేవార్తలు ప్రచారం చేశాయి. ముఖ్యంగా బీహార్ లో ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

Advertisement

ఈ అంశంపై బీజేపీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యుటీ సీఎం తేజస్వి యాదవ్ లపై, తమిళనాడు సీఎం స్టాలిన్ పై దుమ్మెత్తి పోసింది. ఉత్తరభారతీయులపై స్టాలిన్ దాడులు చేయిస్తున్నాడని, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ లు ఆయనకు మద్దతుగా నిలబడ్డారని ప్రచారం మొదలుపెట్టింది.

అసలు కథ ఎలా మొదలయ్యింది?

తమిళనాడులోని తిరుపూర్‌లో, రైలు పట్టాలపై బీహార్ కు చెందిన ఒక వలస కార్మికుడి మృతదేహం లభించింది. ఇది హత్య అంటూ వందలాది మంది కార్మికులు నిరసనలకు దిగారు. అయితే పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ లు రిలీజ్ చేసి అది హత్య కాదని, ప్రమాదమని నిరూపించారు. ఆ వ్యక్తి పట్టాల వెంట నడుస్తూ వెళ్తుండగా రైలు ఢికోని చనిపోయాడు. ఆ దృశ్యం సీసీ టీవీలో క్లియర్ గా కనిపించింది. దాంతో కార్మికులు తమ నిరసనను విరమించారు.

Advertisement

అయితే కథ అక్కడితో ఆగలేదు.

సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. తమిళనాడులో ఉత్తరాదివారిని చంపుతున్నారంటూ కొందరు వీడియోలు షేర్ చేశారు. ఆ వీడియోల్లో ఒకటి రాజస్థాన్‌లో ఇద్దరు వ్యక్తులు న్యాయవాదిని కత్తితో పొడిచి చంపుతున్నది. మరొకటి తెలంగాణలో ఒక వ్యక్తిని హత్య చేస్తున్న వీడియో. మూడోది కర్ణాటకలో జరిగిన హత్య కాగా, నాలుగో వీడియో తమిళ వ్యక్తిని కోయంబత్తూరులో నరికి చంపినది. ఈ వీడియోలను షేర్ చేస్తూ కొందరు కావాలనే ఉత్తరాదివారిపై దాడులంటూ ప్రచారాన్ని మొదలు పెట్టారు.

ఈ ప్రచారం సోషల్ మీడియాతో ఆగలేదు. తమిళ‌నాడులో 12 మంది ఉత్తరభారతీయులను హత్య చేశారంటూ 'దైనిక్ భాస్కర్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక 'OpIndia' వంటి ఆరెస్సెస్ అభిమానుల వెబ్ సైట్లు 'తమిళనాడులో తాలిబన్ తరహా దాడులు' అంటూ వార్తలను పోస్ట్ చేశాయి.

దీనిపై బీజేపీ రాజకీయాలు ప్రారంభించింది.

'తమిళనాడులో బీహార్ కార్మికులను హత్య చేశారు' అని బీజేపీ పార్టీ ట్వీట్ చేసింది. ఈ హత్యలపై చర్యలు తీసుకోనందుకు బీహార్ RJD-JDU ప్రభుత్వంపై దాడి చేసింది. అసెంబ్లీలో, బిజెపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ బీహారీ సోదరులు చనిపోతూ ఉంటే ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేక్ తింటూ ఎంజాయ్ చేశారు అని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా మార్చి 1వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమానికి తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. అప్పుడు కేక్ కట్ చేసిన ఫోటోలను పోస్ట్ చేసిన బీజేపీ నాయకులు తేజస్వీపై దుమ్మెత్తి పోశారు.

దీనికి విరుద్దంగా తమిళనాడు బీజేపీ నాయకులు స్పందించారు. ఇదంతా ఫేక్ ప్రచారమని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ మాట్లాడుతూ, కొన్ని సంస్థలు ద్వేషాన్నిరెచ్చగొడుతున్నాయని, అలాంటి వారందరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు బుక్ చేయాలని డిఎంకె ప్రభుత్వాన్ని కోరారు.

బిజెపి చీఫ్ కె అన్నామలై కూడా ఈ వార్తలను ఫేక్ అని కొట్టి పడేస్తూనే దీనికి కారణం డీఎంకే ప్ర‌భుత్వమే అని ఆరోపించారు.విభజన సృష్టించడానికి డిఎంకె నే ప్రయత్నించిదని ఆయన అన్నారు. హిందీకి వ్యతిరేకంగా డీఎంకే నాయకులు చేసిన ప్రచారమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు.

ఆ తర్వాత బీహార్, జార్ఖండ్‌ల నుండి నిజనిర్ధారణ బృందాలు తమిళనాడుకు వెళ్లి అధికారులు, కార్మికులతో సమావేశమయ్యి నిజానిజాలు బైటపెట్టాయి. అయితే దాడులకు సంబంధించిన ఫేక్ న్యూస్ ప్రచారమైనంతగా నిజనిర్ధారణ బృందాల నివేదిక మాత్రం ప్రచారం కాలేదు.

ఇదంతా సరే కానీ, ఈ మొత్తం వ్యవహారంలో బీహార్ బీజేపీ ఒకరకంగా, తమిళనాడు బీజేపీ అందుకు పూర్తిగా విరుద్దంగా ఎందుకు వ్యవహరించినట్టు ?

అసలు ప్రణాళికబద్దంగా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్ ప్రచారం కావడానికి కారణమెవరు ?

Next Story