Telugu Global
National

క్లౌడ్ సీడింగ్ కనిపెట్టింది ఎవరు? చైనా క్లౌడ్ బరస్ట్ ప్రయోగం ఎప్పుడు చేసింది?

నిర్ణీత సమయంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదు అవడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.

క్లౌడ్ సీడింగ్ కనిపెట్టింది ఎవరు? చైనా క్లౌడ్ బరస్ట్ ప్రయోగం ఎప్పుడు చేసింది?
X

'తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ చేయడానికి విదేశీయులు కుట్ర చేశారనే అనుమానాలు ఉన్నాయి. పలు చోట్ల కూడా ఇలాంటి కుట్రలు జరిగాయి' అని సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ చేసిన ఈ ఆరోపణలు మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. క్లౌడ్ బరస్ట్ (కుంభ వృష్టి) చేయడం సాధ్యమేనా? విదేశీయులు ఇలాంటి పనికి తెగబడతారా? అసలు క్లౌడ్ సీడింగ్‌కు, క్లౌడ్ బరస్ట్‌కు తేడాలు ఏంటి? అని పలువురు ఆరా తీస్తున్నారు.

వాతావరణ శాఖ ప్రకారం.. నిర్ణీత సమయంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదు అవడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. అంటే ఒకే సారి కుంభవృష్టి కురవడం. అయితే వర్షాలు పడకపోయినా.. మేఘాలను మధనం చేసి వర్షాలు కురిపించడాన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ క్లౌడ్ సీడింగ్ అనే పద్దతి 1940లో ప్రారంభమైంది. జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు సూపర్ కూల్ క్లౌడ్స్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేశారు. అమెరికా న్యూహాంప్‌షైర్ ప్రాంతంలో ఉన్న మౌంట్ వాషింగ్టన్‌పై తొలిసారిగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియకు పునాది పడింది.

ప్రపంచంలోనే అత్యధిక తుపాన్లు వచ్చే పర్వతంగా దీనికి పేరున్నది. ఈ పర్వతం ఎప్పుడూ మేఘావృతమై ఉంటుంది. దీంతో ఈ మౌంటైన్‌ను క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలకు వేదికగా చేసుకున్నారు. సిల్వర్ ఐయోడైడ్ బుల్లెట్స్‌ను ఉపయోగించి మౌంట్ వాషింగ్టన్‌పై చేసిన ప్రయోగాలు సఫలం అయ్యాయి. దీంతో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు ఈ ప్రక్రియపై పేటెంట్ పొందారు. ఆ తర్వాత 1948లో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ ఉపయోగించి న్యూయార్క్‌లో వర్షాలు కురిసేటట్లు చేశారు.

రెండు దశాబ్దాల అనంతరం ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధ‌తిని యూఎస్ మిలటరీ యుద్ధ‌ సమయాల్లో ఉపయోగించడం మొదలుపెట్టింది. 1967 నుంచి 1972 మధ్యకాలంలో వియత్నాం యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా మిలటరీ క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలను కురిపించింది. ప్రత్యర్థి సైనికులు చురుకుగా కదలకుండా.. నేలను బురదమయం చేయడానికి వెదర్ మోడిఫికేషన్ ప్రోగ్రాం పేరుతో వందల వర్షాలు కురిపించింది. అప్పట్లోనే ఇందుకోసం ఏడాదికి 3 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసింది. హో చీ మిన్ ప్రాంతంలో ఏకంగా వరదలు కూడా సృష్టించినట్లు అమెరికా మిలటరీ తమ పత్రాల్లో రాసుకున్నది. శత్రుసైనికులకు సంబంధించిన సప్లయిస్‌ను తరలించకుండా ఇలా చేసినట్లు చెప్పుకున్నది. ఇందుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ కూడా విడుదల చేయడం గమనార్హం.

కాగా, అమెరికన్ మెటరాలజీ సొసైటీ ఈ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియపై 2010లో కీలకమైన ప్రకటన చేసింది. వెదర్ మాడిఫికేషన్ అనేది గత కొన్నేళ్లుగా చాలా అభివృద్ది చెందింది. అయితే వర్షాలు క్లౌడ్ సీడింగ్ వల్లే పడుతున్నాయని మాత్రం కచ్చితంగా చెప్పలేమని అన్నారు. మేఘావృతమై ఉన్నప్పుడు క్లౌడ్ సీడింగ్ చేయకపోయినా వర్షం పడుతుంది. పడిన వర్షం సహజంగా కురిసిందా లేక క్లౌడ్ సీడింగ్ వల్లా అనేది ఇంత వరకు ఎవరూ కచ్చితంగా చెప్పలేరు అని స్పష్టం చేశారు.

2008లో బీజింగ్ వేదికగా ఒలంపిక్స్ జరిగాయి. అందుకోసం భారీ ఖర్చు చేసి చైనా స్టేడియంలు నిర్మించింది. ఒక వేళ క్రీడలు జరిగే సమయంలో భారీ వర్షాలు కురిస్తే స్టేడియంలు తట్టుకుంటాయా లేదా అని చెక్ చేయడానికి క్లౌడ్ సీడింగ్ ఉపయోగించి కృత్రిమ వర్షాలు కురిపించినట్లు అప్పట్లో అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిశాయి. అప్పట్లో చైనానే కుట్రపూరితంగా క్లౌడ్ బరస్ట్‌కు పాల్పడినట్లు అనుమానాలు వచ్చాయి. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో మరోసారి డ్రాగన్ కంట్రీపై అందరి దృష్టిపడింది.

కాగా, చాలా ఎత్తైన పర్వత శ్రేణుల దగ్గర మాత్రమే క్లౌడ్ సీడింగ్ ద్వారా భారీ వర్షాలు కురిపించే అవ‌కాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలో కురిసిన వర్షాలు కుట్ర అని చెప్పడానికి అవకాశాలు లేవని అంటున్నారు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా మధ్యధార సముద్ర తీరం నుంచి వీచే గాలులు పశ్చిమ పాకిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్ మీదుగా ఇండియా వైపు వస్తాయి. అదే సమయంలో అరేబియా నుంచి వచ్చే రుతుపవనాలు తేమను తీసుకొని వస్తాయి. ఈ రెండు ఢీకొన్నప్పుడు ఏర్పడే మేఘాలు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. అప్పుడు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలో ఇలాంటి వర్షాలే పడి ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

First Published:  18 July 2022 4:25 AM GMT
Next Story