Telugu Global
National

అదాని స్కాం కు, రాహుల్ పై అనర్హత వేటుకు లింకేంటి?... ఒక సారి క్రోనాలజీ చూద్దాం

ఈ క్రోనాలజీ ఆధారలతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడానికి అదానీకి ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించడం చాలా కష్టం. అయితే ఈ క్రోనాలజీని చూస్తే, అదానీ అంశంపై ప్రధాని మోడీ స్పందించకుండా తప్పించుకోవడం పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రజల్లో అటువంటి ప్రశ్నలు తలెత్తడం సహజం.

అదాని స్కాం కు, రాహుల్ పై అనర్హత వేటుకు లింకేంటి?...  ఒక సారి క్రోనాలజీ చూద్దాం
X

గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీపై పరువునష్టం దావా కేసులో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ మర్నాడే పార్లమెంట్ సెక్రటేరియట్ రాహూల్ గాంధీ ఎంపీ గా అనర్హుడంటూ ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ ఎంపీగా ఉన్న వాయినాడ్ సీటు ఖాళీ అయ్యిందని ప్రకటించింది.

అయితే 2019 సంవత్సరంలో దాఖలైన కేసులో ఇప్పుడు తీర్పు రావడం యాదృచ్చికమా ? కానే కాదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పైగా ఆ కేసు క్రోనాలజీని వివరించారు ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్.

జైరాం రమేష్ ప్రకారం...

''దొంగలందరి ఇంటి పేరు మోడీ నే ఎందుకుంటుంది'' అని రాహుల్ గాంధీ కర్నాటకలో చేసిన వ్యాఖ్యపై గుజరాత్‌ మాజీ మంత్రి 'పూర్ణేశ్‌ మోడీ' రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు ఏప్రిల్ 16, 2019 న దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సూరత్ కోర్టుకు హాజరయ్యారు.మార్చి 2022లో, రాహుల్ గాంధీని మళ్లీ పిలిపించాలన్న ఫిర్యాదుదారుడి అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఛీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM )తిరస్కరించి, వెంటనే వాదనలు ప్రారంభించాలని పట్టుబట్టడంతో, ఫిర్యాదుదారు పూర్ణేశ్‌ మోడీ హైకోర్టుకు పరుగెత్తారు. విచారణ ప్రక్రియపై స్టే కోరారు. మార్చి 7, 2022న హైకోర్టు స్టే మంజూరు చేసింది.

ఆ తర్వాతి అంకం:

అదానీపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ప్రపంచ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలంటూ విపక్షాలు ప్రతి రోజూ పార్లమెంటును స్తంభింపచేశాయి. మరో వైపు రాహుల్ గాంధీ బ్రిటన్ పార్లమెంటులో, మోడీ పాలన పై విరుచుకపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని, పార్లమెంటులో విపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని, మాట్లాడటం మొదలుపెడితే మైక్ లు కట్ అవుతున్నాయని ఆరోపించారు.

ఆ తర్వాత ఫిబ్రవరి 7న రాహుల్ గాంధీ లోక్ స‌భలో ప్రసంగం చేశారు. వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాల గురించి ఆయన‌ నరేంద్ర మోడీపై పదునైన దాడిని ఎక్కుపెట్టారు. గాంధీ ప్రసంగంలోని కొన్ని భాగాలను ఫిబ్రవరి 8న స్పీకర్ ఓం బిర్లా ఆదేశాల మేరకు పార్లమెంటరీ రికార్డుల నుండి తొలగించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే మైక్రోఫోన్‌లు మ్యూట్ చేస్తారని అనడం మానుకోవాలని స్పీకర్ బిర్లా రాహుల్ గాంధీని కోరినప్పుడు, విపక్ష సభ్యులు కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ప్రయత్నించినప్పుడు గతంలో అనేక సార్లు మైక్రోఫోన్లు మ్యూట్ చేయడం వాస్తవమేనని రాహుల్ గాంధీ అన్నారు.

తనను సభలో మాట్లాడేందుకు అస్సలు అనుమతించడం లేదని, పార్లమెంటు సభ్యుడిగా తనకున్న హక్కును కాలరాస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌కు రెండుసార్లు రాహుల్ గాంధీ లేఖ రాశారు.మరో వైపు విపక్షాలన్ని కలిసి అదానీ అంశంపై పోరాటాన్ని ఉదృతం చేశాయి. జేపీసీ వేయాలనే డిమాండ్ తో పార్లమెంటులో బైట నిరసనలు చేపట్టాయి.

ఆ తర్వాతి అంకం:

సూరత్ కేసుపై హైకోర్టు స్టే విధించిన‌ 11 నెలల విరామం తర్వాత, ఫిర్యాదుదారు పూర్ణేశ్‌ మోడీ ఆ కేసు విచారణపై స్టేను రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16, 2023న హైకోర్టును ఆశ్రయించారు. , “ట్రయల్ కోర్టులో తగిన సాక్ష్యాధారాలు వచ్చాయని, ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల విచారణ ఆలస్యం అవుతుందని విజ్ఞప్తి చేశారు. ” దాంతో హైకోర్టు స్టే ఎత్తి వేసింది. 'పూర్ణేశ్‌ మోడీ స్టేను ఉపసంహరించుకున్న వెంటనే రాహుల్ పై పరువు నష్టం కేసు వేగంగా నడిచింది. ఫిబ్రవరి 16. ఫిబ్రవరి 27న వాదనలు పునఃప్రారంభమయ్యాయి. మార్చి 17న‌ తీర్పు రిజర్వ్ చేయబడింది. మార్చ్ 23న రాహుల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఆ మర్నాడే పార్లమెంట్ సెక్రటేరియట్ రాహూల్ గాంధీ ఎంపీ గా అనర్హుడంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రోనాలజీ ఒక్క సారి గమనించండి ఇది యాదృచ్చికం కాదనేది అర్దమవుతుంది అని జై రాం రమేష్ చెప్పాడు.

అయితే జైరాం రమేష్ చెప్పిన ఈ క్రోనాలజీ ఆధారలతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడానికి అదానీకి ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించడం చాలా కష్టం. అయితే ఈ క్రోనాలజీని చూస్తే, అదానీ అంశంపై ప్రధాని మోడీ స్పందించకుండా తప్పించుకోవడం పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రజల్లో అటువంటి ప్రశ్నలు తలెత్తడం సహజం.

First Published:  25 March 2023 3:57 AM GMT
Next Story