Telugu Global
National

ప్రజ్ఞాన్, విక్రమ్ మేల్కొనకపోతే? ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏం చెప్పారంటే..

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కొలపడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాము. కానీ అటు నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందడం లేదని సోమనాథ్ చెప్పారు.

ప్రజ్ఞాన్, విక్రమ్ మేల్కొనకపోతే? ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఏం చెప్పారంటే..
X

చంద్రయాన్-3 మిషన్ ద్వారా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన విక్రమ్ ల్యాండర్.. ఆ తర్వాత చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేపట్టిన ప్రజ్ఞాన్ రోవర్‌పై ఇస్రోకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటితో కాంటాక్ట్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రజ్ఞాన్, విక్రమ్‌ల పరిస్థితి ఏంటని దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ కీలక విషయాలు వెల్లడించారు.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కొలపడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాము. కానీ అటు నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందడం లేదని సోమనాథ్ చెప్పారు. అయినా సరే ఎలాంటి బాధ లేదని అన్నారు. విక్రమ్, ప్రజ్ఞాన్‌లను ఎందుకు చంద్రుడిపైకి పంపామో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరింది. ఇప్పుడు తాజాగా మళ్లీ యాక్టివేట్ అయితే అది ఇస్రోకు బోనసే తప్ప మరేం లేదని అన్నారు. చంద్రుడిపై చీకటి పడితే అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అంతటి అత్యంత శీతల వాతావరణంలో విక్రమ్, ల్యాండర్‌లలోని సర్క్యూట్స్ పాడయిపోయే అవకాశం ఉన్నదని సోమనాథ్ చెప్పారు.

అత్యంత చల్లగా ఉండే వాతావరణంలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ పని చేయడం అసాధ్యం. ఇప్పుడు పగలు అయినా సరే ఒక్కసారిగా వచ్చే వాతావరణ మార్పుల వల్ల సర్క్యూట్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అవి సిగ్నల్స్ పంపించడంలో విఫలమయ్యాయని భావిస్తున్నాము. అయితే చంద్రుడిపై మరోసారి రాత్రి అయ్యే వరకు మేం మా ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు.

కాగా, డిసెంబర్‌లో ఇస్రో మరో కీలక ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. వాతావరణాన్ని క్షణ్ణంగా అధ్యయనం చేయడానికి ఇన్‌శాట్-3డీఎస్ అనే శాటిలైట్‌ను భూకక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు సోమనాథ్ పేర్కొన్నారు.

First Published:  28 Sep 2023 3:21 PM GMT
Next Story