Telugu Global
National

హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ నేవీ అధికారి ఏం చేశాడంటే..

పారిపోవటం మాత్రమే సరిపోదు అన్న ఆలోచనతో మరో ప్లాన్ రెడీ చేసుకున్నాడు. జోధ్‌పూర్‌లో తన ట్రాన్స్‌పోర్టు ట్రక్కుకు నిప్పంటించి, తన వద్ద పనిచేసే బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు మనోజ్, ముకేష్‌లను సజీవ దహనం చేశాడు.

హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ నేవీ అధికారి ఏం చేశాడంటే..
X

చేసిన హత్యను కప్పిపుచ్చ‌డానికి, కేసు నుంచి తప్పించుకోవ‌డానికి చనిపోయినట్టు కట్టుకథ అల్లాడు ఓ నౌకాదళ మాజీ ఉద్యోగి. కానీ, తప్పు చేసినవాడు ఎప్పటికీ తప్పించుకోలేడు అన్నట్టుగా 20 ఏళ్ల తర్వాత అడ్డంగా దొరికిపోయాడు. ఊరు, పేరు మార్చుకొని కుటుంబంతో కలిసి ఉంటున్న అతడ్ని చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే…

హరియాణాకు చెందిన బాలేష్‌ కుమార్ 8వ తరగతి వరకూ చదువుకున్నాడు. 1981లో నేవీలో ఉద్యోగిగా చేరి 1996లో ఉద్యోగ విరమణ చేశాడు. తరువాత ఢిల్లీ నజఫ్‌గఢ్‌లోని బవానా ప్రాంతంలో ఉంటూ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 2004లో తన బంధువు రాజేష్‌ అలియాస్‌ కుశీరామ్‌తో డబ్బుల విషయమై జరిగిన గొడవలో అతడ్ని హత్య చేశాడు. హత్య సమయంలో బాలేష్, రాజేష్‌తో పాటు బాలేష్ సోదరుడు సుందర్ లాల్ కూడా ఉన్నాడు. రాజేశ్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలేష్‌.. పథకం ప్రకారం హత్యచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు సుందర్‌లాల్‌ను అరెస్టుచేశారు. అయితే ప్రధాని నిందితుడు బాలేష్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి ఓ ట్రక్కులో రాజస్థాన్‌ పారిపోయాడు.

పారిపోవటం మాత్రమే సరిపోదు అన్న ఆలోచనతో మరో ప్లాన్ రెడీ చేసుకున్నాడు. జోధ్‌పూర్‌లో తన ట్రాన్స్‌పోర్టు ట్రక్కుకు నిప్పంటించి, తన వద్ద పనిచేసే బిహార్‌కు చెందిన ఇద్దరు కూలీలు మనోజ్, ముకేష్‌లను సజీవ దహనం చేశాడు. చనిపోయినవారిలో తానుకూడా ఉన్నట్లు రాజస్థాన్‌ పోలీసులు నమ్మేలా చేశాడు. దీంతో ట్రక్కు దహనం కేసును రాజస్థాన్ పోలీసులు మూసివేశారు. అనంతరం అక్కడ నుంచి పంజాబ్‌‌కు పారిపోయిన బాలేష్‌.. తన పేరును అమన్‌సింగ్‌‌గా మార్చుకున్నాడు. నకిలీ పత్రాలు సృష్టించి అక్కడినుండి ఢిల్లీకి చేరుకుని ఈసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు.

ఇటీవలే బాలేష్‌ కుమార్ గురించి సమాచారం అందడంతో దర్యాప్తు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. అంతేకాదు ట్రక్కు ప్రమాదంలో చనిపోయినట్టు నమ్మించడంతో బాలేష్ భార్యకు నేవీ పెన్షన్, బీమా పరిహారం అందింది. అలాగే, ట్రక్కుకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఆమెకే చేరింది. మొత్తానికి నిందితుడిని అరెస్ట్ చేసిన హ‌రియాణా పోలీసులు.. ట్రక్కు దహనం కేసును మళ్లీ తెరవాలని రాజస్థాన్ పోలీసులను కోరారు.

First Published:  18 Oct 2023 1:02 PM GMT
Next Story