Telugu Global
National

బీజేపీ పతనం ఏదో ఒకరోజు ఖాయం.. కానీ ఎలా..?

అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎవరికీ శాశ్వతం కాదు, కానీ బీజేపీ అలాంటి పరిస్థితిని అస్సలు ఊహించట్లేదు. కాలం మారుతున్నట్టే, అధికారానికి బీజేపీ కూడా దూరం కావడం సహజం. ఈ సహజ పరిణామానికి సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందనేదే తేలాల్సి ఉంది.

బీజేపీ పతనం ఏదో ఒకరోజు ఖాయం.. కానీ ఎలా..?
X

త్వరలో బీజేపీ పదేళ్ల పాలన పూర్తవుతుంది. పదేళ్లుగా బీజేపీని భరిస్తున్న భారత ప్రజలు తిరిగి ఆ పార్టీకే పట్టం కడతారా, లేక ఇండియా కూటమికి జై కొడతారా అనేది చెప్పలేం. 2024లో కాకపోయినా ఏదో ఒకరోజు బీజేపీ పతనం కావడం ఖాయం. కానీ ఎలా..? బీజేపీ పతనానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆ కారణాలన్నిటికీ బలం చేకూరిన రోజున మోదీ అయినా, మరో మేధావి అయినా బీజేపీని కాపాడలేరు అనేది కాదనలేని వాస్తవం.

మోదీ తర్వాత ఎవరు..?

బీజేపీలో మోదీ తర్వాత ఎవరు..? ఆ ప్రశ్నకు సమాధానం లేదు. రెండో స్థానం కోసం పోటీపడుతున్న అందరూ సమానులే అని చెప్పాలి. కానీ ఆ సమానుల సంఖ్య చాలా ఎక్కువ. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ నాయకత్వ లేమితో ఎలా చిన్నాభిన్నం అయిందో చూశాం. మరి మోదీ తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి..? అంటే ఆ పార్టీ నాయకులే చెప్పలేని పరిస్థితి. యోగిలాంటి వాళ్లు చాలామందే ఉన్నారనే సమాధానం వినిపిస్తున్నా.. చాలామంది అనడంలోనే అంతులేని పోటీ నెలకొని ఉంది. మోదీకి సీనియర్లు దారిచ్చి తప్పుకున్నట్టు, ఆయన తర్వాత ఆ స్థానానికి ఎగబాకాలనుకుంటున్న వ్యక్తికి ఇప్పుడున్నవారెవరూ అంత సహనంతో సహకరించరు. అదే చివరకు పార్టీకి ముప్పుగా మారే అవకాశం ఉంది.

మెజార్టీలో మైనార్టీ..

దేశాన్ని ఇన్నాళ్లూ బీజేపీ ఓ భ్రమలో ఉంచింది, ఇంకా ఉంచాలని చూస్తోంది. భారత్ లో హిందువుల సంఖ్య ఎక్కువ. అంటే హిందువులే మెజార్టీ ప్రజలు. కానీ బీజేపీ దృష్టిలో హిందువులు గాయపడిన మైనార్టీలు. హిందువులపై దాడులు, హిందువుల ఆస్తుల ధ్వంసం, హిందువుల్లో అభద్రతా భావం.. ఇలా ప్రజల్ని ఓ మైకంలో ఉంచి అసలు దేశంలో హిందువుల్ని బతకనివ్వరా అనే ప్రశ్నలు వినపడే స్థాయికి తీసుకొచ్చారు. దూరం నుంచి ఈ విషయం చూసేవారికి ఆశ్చర్యం కలగక మానదు. మెజార్టీ ప్రజలు అయిఉండి కూడా హిందువుల్లో ఎందుకీ మైనార్టీ భావం. అది కేవలం బీజేపీ రాజకీయ స్వలాభం మాత్రమే. ఇప్పటికీ ఫలానా మసీదు కింద ఆలయం ఉంది, ఫలానా మత స్థలం గతంలో హిందవుల ప్రార్థనా మందిరం, ఫలానా మతంవారికి చెందిన స్థలంలో హిందూ ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయనే ప్రచారం నిరంతరం జరుగుతూనే ఉంది. దానిక కారణం ఎవరు..? అలాంటి ప్రచారం వల్ల వారికి కలిగే రాజకీయ ప్రయోజనం ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే..?

అంతులేని ధీమా..

బీజేపీ నేతల్లో అంతులేని ధీమా కనపడటం కూడా అత్యంత ప్రమాదకరంగా మారిన పరిస్థితి. వచ్చే 30, 40 ఏళ్లపాటు మనమే అధికారంలో ఉంటామనేది వారి నమ్మకం. ఈ నమ్మకంతోనే వారు రాజకీయ ప్రతీకారాలకు వెనకాడ్డంలేదు. ప్రతిపక్ష నేతల్ని జైలులో వేయించేందుకు ఏమాత్రం మొహమాటపడటంలేదు. నాయకుల జైలు జీవితం అనేది ఇప్పటి ఆనవాయితీ కాదు. గతంలో కూడా తప్పు చేసినవారు, ఆరోపణలు ఎదుర్కొన్నవారు జైలుకెళ్లి వచ్చేవారు. అందులో కొన్ని రాజకీయ కక్షసాధింపులు కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుల్ని అధికారంలో ఉన్నవారు కాపాడేవారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ వ్యవహారాలు జరిగేవి. అంతిమంగా అందరూ కలసి న్యాయవ్యవస్థతో దోబూచులాడేవారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంప్రదాయాలకు తిలోదకాలిచ్చింది. వైరివర్గంలో ఎవరూ లేకుండా చేయడమే వారి అంతిమ లక్ష్యం. కేసులు, ప్రతీకార దాడులతో ఎన్డీఏ కూటమిని బలంగా చేసుకోవాలని చూస్తున్నారు. ఈ అతి విశ్వాసం ఏదో ఒకరోజు దెబ్బతినక తప్పదు. అప్పుడు బీజేపీ నేతల పరిస్థితి ఏంటనేది వారి ఆలోచనకే వదిలేయాలి.

ఏదో ఒకరోజు..

అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఎవరికీ శాశ్వతం కాదు, కానీ బీజేపీ అలాంటి పరిస్థితిని అస్సలు ఊహించట్లేదు. కాలం మారుతున్నట్టే, అధికారానికి బీజేపీ కూడా దూరం కావడం సహజం. ఈ సహజ పరిణామానికి సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందనేదే తేలాల్సి ఉంది.

First Published:  25 Sep 2023 7:14 AM GMT
Next Story