Telugu Global
National

బడ్జెట్ పై విపక్షాలు ఏమన్నాయి ?

ఇది కార్పోరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా పలు పార్టీలు ఆరోపించగా ఇది ఎన్నికల బడ్జెట్ అని మరి కొన్ని పార్టీలు విమర్శించాయి.

బడ్జెట్ పై విపక్షాలు ఏమన్నాయి ?
X

కేంద్రం ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విపక్షాలు పెదవి విరిచాయి. ఇది కార్పోరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా పలు పార్టీలు ఆరోపించగా ఇది ఎన్నికల బడ్జెట్ అని మరి కొన్ని పార్టీలు విమర్శించాయి.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ, బడ్జెట్‌లో ఎంఎన్‌ఆర్‌ఈజీఏ, పేద గ్రామీణ కార్మికులు, ఉపాధి, ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించలేదన్నారు. కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి పరిష్కారం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ . పేదలకు ఇందులో ఒరిగేదేమీలేదని ఆయన పేర్కొన్నారు. "బడ్జెట్ ప్రయోజనాలు కేవలం బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే రూ. 7 లక్షల వరకు పన్ను రాయితీ చాలా తక్కువ; ఇది మధ్యతరగతి వారికి ఏ మాత్రం ఉపయోగపడనిది" అని అన్నారాయన‌

కాంగ్రెస్ నాయకుడు కె సురేష్ దీనిని "కార్పొరేట్ అనుకూల బడ్జెట్" అని అన్నారు. ఈ బడ్జెట్‌లో అదానీ ప్రయోజనాలను నెరవేర్చారు, కాని సామాన్యులను విస్మరించారు. ఈ బడ్జెట్ కేవలం అదానీ, అంబానీ, గుజరాత్‌ కోసం మాత్రమే’ అని ఆయన పేర్కొన్నారు.

భారత రాష్ట్ర సమితి కూడా బడ్జెట్ పై మండి పడింది. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇది ఏ రంగానికీ మేలు చేయని బడ్జెట్ అని ప్రణాళికా బోర్డు చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ హయాంలో ఇప్పటికే రికార్డు స్థాయి అప్పులు చేశారని, ఈ ఏడాది దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూడడం దురదృష్టకరమన్నారు హరీశ్ రావు.

గతఏడాది 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఈ సారి బడ్జెట్ లో 157 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం వివక్షకు పరాకాష్ట అని వినోద్ రావు అన్నారు.

2023-24 బడ్జెట్ దేశ ప్రజలకు ఆశ బదులుగా నిరాశ మిగిల్చిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. "బీజేపీ దశాబ్ద కాలంగా పార్లమెంటులో బడ్జెట్ లు పెడుతోంది. ఇంతకుముందు బడ్జెట్లలో ప్రజలకు ఏమీ ఇవ్వనప్పుడు, ఇప్పుడు మాత్రం ఏమి ఇస్తుందని ఆశిస్తాం?" అని అఖిలేష్ ట్వీట్ చేశారు. "బిజెపి బడ్జెట్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని మరింత పెంచుతుంది. ఇది రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, వృత్తిదారులు, వ్యాపార వర్గాలను నిరాశపర్చింది . ఈ బడ్జెట్ కొద్దిమంది ధనవంతుల ప్రయోజనాల కోసం మాత్రమే" అని అఖిలేష్ అన్నారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్‌ను సమర్పించారని ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ ఆరోపించారు. "మధ్యతరగతి వారికి కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ, రైతులు, ఉపాధి, యువత, MSP గురించి ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఈ బడ్జెట్‌లో రైల్వేలను కూడా విస్మరించారు. ఇది అత్యంత నిరుత్సాహకర బడ్జెట్" అని ఆమె అన్నారు.

పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. గత సంవత్సరాల్లో బడ్జెట్‌ మాదిరిగానే ఈ బడ్జెట్‌ కూడా ఉందన్నారు. "పన్నులు పెంచారు; సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు డబ్బు ఖర్చు చేయడం లేదు. కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు, బడా వ్యాపారుల కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నుల నుండి ప్రజలు ప్రయోజనం పొందాలి, కానీ అది వారి వెన్ను విరిచింది," అని ఆమె అన్నారు.

"బడ్జెట్‌లో ఏమీ లేదు. ఇది 'సప్నో కా సౌదాగర్' (కలల వ్యాపారం)లాంటిది - మీరు కలలు కన్న తర్వాత నిద్రలేచినప్పుడు ఏదీ నిజం కాదు. అలాగే, ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని ఎలా నియంత్రించాలనే దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు" అని జెడి(యు) ఎంపి రాజీవ్ రంజన్ అన్నారు.

ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఆదాయపు పన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవ్వరికీ లాభం లేదని ఆమె అన్నారు. ఈ బడ్జెట్ సమాకంలోని ఒక వర్గానికి ఉపయోగపడే విధంగా మాత్రమే ఉందని, పేదలను మరింత పేదలుగా మారుస్తుందని ఆమె అన్నారు. దేశంలో అత్యంత కీలకమైన నిరుద్యోగం పై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని ఆమె ఆరోపించారు.

ఈ బడ్జెట్ తో ద్రవ్యోల్భణం మరింత పెరుగుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ బడ్జెట్ ఢిల్లీ పట్ల సవతి తల్లి ప్రేమను చూపించదని ఆయన మండిపడ్డారు.

ఈ సారి కూడా ఎప్పటి లాగే దేశంలోని 100కోట్ల మంది పేదల ఆశ‌ల పై ఈ బడ్జెట్ నీళ్ళు చల్లిందని బహిజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. దేశంలో 130 కోట్లు ఉన్న రైతులు, కార్మికులు, అణ్గారిన వర్గాలు, పేదలను ఈ బడ్జెట్ మర్చిపోయిందన్నారామె.

First Published:  1 Feb 2023 1:39 PM GMT
Next Story