Telugu Global
National

'ఉచితాలు' అంటే ఏంటి? వాటిని మేము అడ్డుకోలేము: సుప్రీంకోర్టు

రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు సంబంధించిన హామీలు ఇవ్వకుండా తాము అడ్డుకోలేమని, అసలు ఉచిత పథకాలు అంటే ఏమిటో నిర్వచించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఉచితాలు అంటే ఏంటి? వాటిని మేము అడ్డుకోలేము: సుప్రీంకోర్టు
X

ప్రధాని మోడీ వాదనలకు సుప్రీం కోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. గత కొన్నాళ్లుగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మోడీ గళం విప్పుతున్నారు. ఉచితాల వల్లే పలు రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని.. వాటికి బీజేపీ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ్ రాజకీయ పార్టీలు ఉచిత పథకాల హామీలను గుప్పించకుండా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ ఉచిత హామీల పిటిషన్‌పై విచారణ జరిపింది. రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు సంబంధించిన హామీలు ఇవ్వకుండా తాము అడ్డుకోలేమని, అసలు ఉచిత పథకాలు అంటే ఏమిటో నిర్వచించాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అశ్విని ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, డీఎంకే పార్టీ సహా పలువురు కౌంటర్లు దాఖలు చేశారు. అందులో పేర్కొన్న కొన్ని విషయాలను సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

ప్రజలకు వైద్యం, తాగునీరు అందించడం, విద్యార్థులకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఇవ్వడం ఉచితాల కిందకు వస్తాయా అని సుప్రీంకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఉచిత హామీలు గుప్పించడం వల్లే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుస్తాయని పేర్కొనడంపై ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్ని పార్టీలు ఉచిత హామీలు ఇచ్చినా సరే.. ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని కోర్టు చెప్పింది. తాము చేసిన వ్యాఖ్యలపై ఈ పిటిషన్ వేసినవాళ్లు, కౌంటర్ దాఖలు చేసిన పార్టీలు తమ అభిప్రాయాలను ఆగస్టు 22లోగా కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే రోజు మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలియజేసింది. కౌంటర్ దాఖలు చేసిన వారందరికీ ఈ కేసుకు సంబంధించిన అప్లికేషన్ కాపీలను ఇస్తామని చెప్పింది.

కాగా, ఉచితాల వలన భారత ఆర్థిక పరిస్థితి దిగజారడం తీవ్రమైన సమస్యగా సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. కానీ, ఈ ఉచితాలు బేస్ చేసుకొని ఏదో ఒక పార్టీని కించపరచడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని పేర్కొంది. కాగా, ఉచితాల మీద నిషేధం విధించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. కొన్ని పథకాల వల్ల ఎంతో మందికి ఆర్థిక భద్రత, సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పింది. వీటి రద్దు వల్ల చాలా మంది నష్టపోతారని స్పష్టం చేసింది. ఉచితంగా విద్యను, కొంత మందికి కొన్ని యూనిట్ల విద్యుత్‌ను అందించడం వల్ల ఎలాంటి నష్టం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 22కు కోర్టు వాయిదా వేసింది.

First Published:  17 Aug 2022 12:09 PM GMT
Next Story