Telugu Global
National

పోలింగే కాదు, కౌంటింగ్ కూడా కష్టమే.. బెంగాల్ లో బాంబ్ పేలుడు

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 339 కేంద్రాల వద్ద కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించారు.

పోలింగే కాదు, కౌంటింగ్ కూడా కష్టమే.. బెంగాల్ లో బాంబ్ పేలుడు
X

పోలింగ్ అంటే కొన్నిచోట్ల కరెన్సీ నోట్లు, మందు. మరికొన్ని ప్రాంతాల్లో కత్తులు, బాంబులు, రిగ్గింగ్ లు. పశ్చిమబెంగాల్ లో ఎన్నికల ప్రక్రియ మరీ దారుణంగా తయారైపోయింది. పోలింగ్ రోజు జరిగిన హింసకంటే ఈరోజు కౌంటింగ్ సందర్భంగా అంతకంటే ఎక్కువ హింస జరిగేలా ఉంది. కౌంటింగ్ మొదలైన కాసేపటికే డైమండ్ హార్బర్ లోని ఓ కౌంటింగ్ కేంద్రంపై దుండగులు బాంబులు విసిరారు. ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెబుతున్నారు. ఆందోళనకారులపై లాఠీ చార్జి చేసి అక్కడినుంచి తరిమేశారు.

హింస, రక్తపాతం..

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీఎంసీ మధ్య గొడవలు ముదిరాయి. దీంతో పోలింగ్ అధికారులు, ఓటర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 74వేల పంచాయతీ స్థానాలకు గత శనివారం పోలింగ్ జరిగింది. అల్లర్లలో 15మంది ప్రాణాలు కోల్పోగా.. కొన్నిచోట్ల రీపోలింగ్ చేపట్టారు. సోమవారం జరిగిన రీపోలింగ్ కూడా గందరగోళంగా మారింది. చివరకు ఈరోజు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం కాగానే ఆయా కేంద్రాల వద్ద అలజడి మొదలైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినా ఫలితం కనపడటం లేదు.

రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 339 కేంద్రాల వద్ద కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించారు. రాష్ట్ర, కేంద్రబలగాలను రంగంలోకి దింపారు. ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు ప్రకటించేందుకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సాయంత్రానికి ఫలితాల సరళిపై ఓ స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో టీఎంసీ లీడింగ్ లో ఉంది.

First Published:  11 July 2023 5:37 AM GMT
Next Story