Telugu Global
National

బెంగాల్ పంచాయితీ.. పోలింగ్ బూత్ లలో విధ్వంసం

ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైన తర్వాత నిమిషాల వ్యవధిలోనే బూత్ లు రణరంగంగా మారాయి. బీజేపీ, టీఎంసీ నేతలు పోటాపోటీగా పోలింగ్ బూత్ లను ధ్వంసం చేశారు. పోలింగ్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

బెంగాల్ పంచాయితీ.. పోలింగ్ బూత్ లలో విధ్వంసం
X

పశ్చిమబెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. జూన్-8న ఈ ఎన్నికలకు ప్రకటన రాగా.. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో మొత్తం 12మంది మరణించారు. దీన్నిబట్టి ఈ ఎన్నికలు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైన తర్వాత నిమిషాల వ్యవధిలోనే బూత్ లు రణరంగంగా మారాయి. బీజేపీ, టీఎంసీ వర్గాల నేతలు పోటాపోటీగా పోలింగ్ బూత్ లను ధ్వంసం చేశారు. కుర్చీలు, బల్లలు విసిరేశారు. పోలింగ్ మెటీరియల్ ని చిందరవందర చేశారు. పోలింగ్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.


అంతకు మించి..

పశ్చిమబెంగాల్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. వాటిని మించి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు బలప్రదర్శనకు వేదికగా మారాయి. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో.. గ్రామాల్లో పట్టుకోసం టీఎంసీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. దౌర్జన్యంతోనే గద్దనెక్కాలని చూస్తున్నారు ఇరువర్గాల నేతలు. దీంతో ఈ ఎన్నికలు హింసకు దారితీశాయి.

ఎన్నికలకు ముందు హింస జరిగింది సరే, కనీసం పోలింగ్ అయినా ప్రశాంతంగా ముగుస్తుందని అధికారులు అంచనా వేశారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ పోలింగ్ రోజు కూడా హింస పెచ్చమీరింది. పోలింగ్ బూత్ లు ధ్వంసం చేశారు కార్యకర్తలు. మొత్తం 22 జిల్లాల పరిధిలోని 928 స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు పోలింగ్ మొదలైంది. బెంగాల్ పంచాయతీ ఎన్నికలకోసం కేంద్ర బలగాలను రంగంలోకి దించడం ఇది రెండోసారి. కేంద్ర బలగాలు వచ్చినా పరిస్థితి ఏమాత్రం అదుపులో లేకపోవడం విచారకరం.

First Published:  8 July 2023 2:16 AM GMT
Next Story