Telugu Global
National

ఆరు నెలల్లో కొత్త టీఎంసీ.. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం..

ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ స్కామ్ లో పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీ అరెస్ట్ తర్వాత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన అనుబ్రత మోండల్ ని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయనేది సువేందు వాదన.

ఆరు నెలల్లో కొత్త టీఎంసీ.. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం..
X

సీబీఐ సోదాలు, ఈడీ దాడులు, అరెస్ట్ లు, విచారణల నేపథ్యంలో ఇటీవల బెంగాల్ ప్రభుత్వం కాస్త డిఫెన్స్ లో పడింది. రాజకీయ కక్షసాధింపు అనడానికి వీల్లేకుండా కట్టల కట్టల డబ్బులు తమకు సంబంధించినవారి ఇళ్లనుంచి బయటకు రావడంతో పార్టీని ప్రక్షాళన‌ చేసే దిశగా దీదీ అడుగులు వేసింది. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసింది. ఆరు నెలల్లో మరిన్ని మార్పులుంటాయని తెలుస్తోంది. ఈమేరకు టీఎంసీ పార్టీ కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేసింది. 'కొత్త టీఎంసీ, సంస్కరించిన టీఎంసీ.. ఇంకా 6నెలలే టైమ్ ఉంది' అంటూ ఓ ప్రచారం మొదలు పెట్టింది. దీనికి బీజేపీ కూడా కౌంటర్లివ్వడం స్టార్ట్ చేసింది.

ఆరు నెలల్లో ప్రభుత్వం ఖాళీ..

ఆరు నెలల్లో బెంగాల్ ప్రభుత్వం ఖాళీ అవుతుందంటూ బెంగాల్ లో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ధీమాగా చెబుతున్నారు. దీదీకి మరో ఆరు నెలలు మాత్రమే సీఎంగా ఉండే యోగం ఉందని, ఆ తర్వాత ఎన్నికలొస్తాయని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. పరోక్షంగా ఈడీ, సీబీఐ విచారణలు మరింత ముమ్మరం అవుతాయని హెచ్చరించారు సువేందు అధికారి.

ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ స్కామ్ లో పార్థ చటర్జీ, అర్పితా ముఖర్జీ అరెస్ట్ తర్వాత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన అనుబ్రత మోండల్ ని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్ట్ లు ఉంటాయనేది సువేందు వాదన. నాయకులంతా జైలుపాలైన తర్వాత మమత ఎలాగూ ప్రభుత్వాన్ని నడపలేరని అంటున్నారు.

బీజేపీలో జోష్..

బెంగాల్ పరిణామాలతో టీఎంసీ సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతోంది. ఇటీవల జాతీయ రాజకీయాల్లో కూడా మమత యాక్టివిటీ తగ్గిపోయింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ముందుగా హడావిడి చేసినా, ఆ తర్వాత మాత్రం మమత వెనకపడ్డారు. సొంత పార్టీ నేతలే కేసుల్లో ఇరుక్కుపోతుండేసరికి ముందు రాష్ట్రంపై దృష్టిపెట్టాలనుకుంటున్నారు. ఈలోగా మరిన్ని స్కామ్ లు వెలికితీసి టీఎంసీని మరింత దెబ్బకొట్టాలనేది బీజేపీ ఆలోచన.

First Published:  19 Aug 2022 3:37 AM GMT
Next Story