Telugu Global
National

'ది కేరళ స్టోరీ' మూవీని బ్యాన్ చేసిన బెంగాల్ సర్కార్

''ద్వేషం, హింసాత్మక సంఘటనలను నివారించడం, రాష్ట్రంలో శాంతిని కాపాడడం కోసం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది.” అని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మీడియాతో అన్నారు. 'ది కేరళ స్టోరీ' సినిమాను వక్రీకరించిన కథగా ఆమె అభివర్ణించారు.

ది కేరళ స్టోరీ మూవీని బ్యాన్ చేసిన బెంగాల్ సర్కార్
X

వివాదాస్పద 'ది కేరళ స్టోరీ' మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు 'ది కేరళ స్టోరీ' సినిమాను నిషేధిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.

''ద్వేషం, హింసాత్మక సంఘటనలను నివారించడం, రాష్ట్రంలో శాంతిని కాపాడడం కోసం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది.” అని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మీడియాతో అన్నారు.

'ది కేరళ స్టోరీ' సినిమాను వక్రీకరించిన కథగా ఆమె అభివర్ణించారు.

మమత సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ఇది బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని, మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

ప్రతిపక్షాల అసలు రంగు బట్టబయలవుతోంది, వారు బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. సినిమా (ది కేరళ స్టోరీ)పై నిషేధం విధించడం ద్వారా పశ్చిమ బెంగాల్‌కు మమత అన్యాయం చేస్తున్నారు. మమతా బెనర్జీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నారా” అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ మూవీని నిషేధించడాన్ని ఆ మూవీ నిర్మాత విపుల్ షా ఖండించారు. తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం తాము చివరి వరకు పోరాడుతామని ఆయన తెలిపారు.

First Published:  8 May 2023 3:20 PM GMT
Next Story