Telugu Global
National

వెంటిలేట‌ర్‌పై మాజీ సీఎం బుద్ధ‌దేవ్‌.. - విష‌మంగా ఆరోగ్య ప‌రిస్థితి

బుద్ధ‌దేవ్ ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిలు గ‌త కొన్ని రోజులుగా అనూహ్యంగా ప‌డిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. బీపీ కూడా నియంత్ర‌ణ‌లో లేద‌ని వైద్యులు చెబుతున్నారు.

వెంటిలేట‌ర్‌పై మాజీ సీఎం బుద్ధ‌దేవ్‌.. - విష‌మంగా ఆరోగ్య ప‌రిస్థితి
X

ప‌శ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయ‌నకు శ‌నివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆలీపోర్‌లోని ఉడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని ఓ అధికారి తెలిపారు. 79 సంవ‌త్స‌రాల వ‌య‌సుతో ఉన్న బుద్ధ‌దేవ్‌కు ఊపిరి ఆడాలంటే నెబులైజ‌ర్ స‌పోర్టు త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు వాడుతున్న నెబులైజ‌ర్ ఉప‌యోగించినా ఆయ‌న‌కు ఊపిరి ఆడ‌టం చాలా క‌ష్టంగా మారిన‌ట్టు స‌మాచారం.

బుద్ధ‌దేవ్ ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయిలు గ‌త కొన్ని రోజులుగా అనూహ్యంగా ప‌డిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. బీపీ కూడా నియంత్ర‌ణ‌లో లేద‌ని వైద్యులు చెబుతున్నారు. శ‌నివారం ఉదయం ఆయన్ని ఇంటి వద్ద పరీక్షించిన వైద్యులు నెబులైజ‌ర్‌తో ఊప‌రి అంద‌డం క‌ష్ట‌మ‌వుతోంద‌ని గుర్తించారు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారని, కొన్ని గంటలు గడిచే వరకు ఎలాంటి ప్రకటనా చేయలేమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు భట్టాచార్య ఆరోగ్యంపై ప‌శ్చిమ‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆనంద్ బోస్ నేరుగా ఆస్పత్రికి వెళ్లి భట్టాచార్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుద్ధ‌దేవ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.

First Published:  30 July 2023 2:02 AM GMT
Next Story