Telugu Global
National

బెంగాల్ పై కుట్ర.. మమత సంచలన ఆరోపణలు

ఈ ఘటనలో ఢిల్లీ ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు మమత. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారామె.

బెంగాల్ పై కుట్ర.. మమత సంచలన ఆరోపణలు
X

పశ్చిమ బెంగాల్ పై కుట్ర జరుగుతోందని, దీని వెనక ఢిల్లీ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారామె.

ఎందుకీ ఆరోపణలు..?

పశ్చిమబెంగాల్‌ లోని మాల్దా పట్టణంలో ఓ వ్యక్తి తుపాకీతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి చొరబడ్డాడు. విద్యార్థులను చంపుతానంటూ బెదిరించాడు. తుపాకీ పట్టుకుని స్కూల్ మొత్తం కలియదిరిగాడు. అడ్డొచ్చినవారిని చంపేస్తానంటూ హల్‌ చల్‌ చేశాడు. ఎలాంటి ప్రమాదం జరగకముందే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సరైన సమయంలో స్పందించడంతో ఆ ఉన్మాది పోలీసులకు చిక్కాడు. అయితే దీన్ని కేవలం ఉన్మాద చర్యగా భావించలేమన్నారు సీఎం మమతా బెనర్జీ. బెంగాల్‌ పై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సామాన్యులెవరూ పాఠశాలలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించేందుకు ప్రయత్నం చేయరని చెప్పారు. విద్యార్థులను బందీలుగా చేయాలనే ఆలోచన అతడికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ, ఈ ఘటనలో ఢిల్లీ ప్రమేయం మాత్రం ఉందని అనుమానం వ్యక్తం చేశారు మమత.

బీజేపీ రియాక్షన్..

మమతా బెనర్జీ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్ ని మమత లండన్‌ గా మారుస్తానని వాగ్దానం చేశారని, అయితే ఇప్పుడు అమెరికాలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అమెరికాలో స్కూల్ లో చొరబడి పిల్లల్ని కాల్చేసే ఘటనలు చాలా జరుగుతుంటాయని, ప్రస్తుతం బెంగాల్ లో కూడా ఇలాంటి సంఘటనలు మొదలయ్యాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయన్నారు. తృణమూల్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.

First Published:  27 April 2023 1:41 PM GMT
Next Story