Telugu Global
National

మేమంతా ఏక‌మ‌వుతున్నాం.. బిజెపి గ‌ద్దె దిగ‌డం ఖాయం : మ‌మ‌తా బెన‌ర్జీ

బీజేపీ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలోని పార్టీలన్నీ ఏకమవుతున్నాయని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆమె అన్నారు.

మేమంతా ఏక‌మ‌వుతున్నాం.. బిజెపి గ‌ద్దె దిగ‌డం ఖాయం : మ‌మ‌తా బెన‌ర్జీ
X

రానున్న ఎన్నిక‌ల్లో బిజెపి ప్ర‌జాగ్ర‌హాన్ని ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని, అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తున్న కాషాయ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామ‌ని బిజెపిని గ‌ద్దె దింప‌డం ఖాయ‌మ‌ని అన్నారు.

2024లో బీజేపీని ఓడించేందుకు పొరుగు రాష్ట్రాల్లోని ఇతర ముఖ్యమంత్రులతో తాను కలిసి న‌డుస్తాన‌ని మమతా బెనర్జీ చెప్పారు. గురువారంనాడు ఆమె పార్టీ సమావేశంలో మాట్లాడుతూ , ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుప‌డ్డారు. " మీ మన్ కీ బాత్ త్వరలో మన్ కీ బయాతా (నొప్పి) అవుతుంది.' అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

"ప్రతి ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారు. నేను వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. మేము జార్ఖండ్‌ను రక్షించాము. పంచాయితీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తాము, ఆపై - 2024 ఎన్నికలకు మేము ఎలా పోరాడు(ఆడ‌)తామో చూడండి,' అన్నారు.

బెంగాల్‌లో గేమ్‌ సెట్‌ అవుతుంది. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. నితీష్‌ కుమార్‌, అఖిలేష్‌ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌ ఉన్నారు. నేను వారితో క‌లుస్తాను. ఇంకా మా స్నేహితులు కూడా ఉన్నారు. అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి. 280-300 సీట్లు అంటూ అహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో రాజీవ్‌గాంధీకి 400సీట్లు ఉండేవి అయినా నిల‌బ‌డ‌లేద‌ని గుర్తుంచుకోండి '' అని మమతా బెనర్జీ అన్నారు.

సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల‌తో మమ్మల్ని బెదిరించవచ్చని బిజెపి భావిస్తోందని, అలాంటి ట్రిక్స్ ఎంత ఎక్కువగా అనుసరిస్తే, వచ్చే ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓట‌మికి మరింత దగ్గరవుతుందని ఆమె అన్నారు. టీఎంసీలో 99 శాతం మంది స్వచ్ఛంగా, నిజాయితీగా, సామాజిక సేవకు అంకితమయ్యారని, ఒకరిద్దరు తప్పు చేస్తే వారిపై చ‌ర్య‌ల‌కు చట్టాలు ఉన్నాయని, పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు.

తాను ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి 100 సీట్లు తగ్గుతాయ‌ని అప్పుడు వారు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఆమె ప్ర‌శ్నించారు.

First Published:  8 Sep 2022 3:21 PM GMT
Next Story