Telugu Global
National

నామినేటేడ్‌ సంస్కృతికి స్వస్తి చెప్పడమే కాంగ్రెస్‌కు ముక్తిమార్గం

దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబ వారసులే ఉన్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎంపికవుతున్నారు.

నామినేటేడ్‌ సంస్కృతికి స్వస్తి చెప్పడమే కాంగ్రెస్‌కు ముక్తిమార్గం
X

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి కోసం శశిథరూర్‌ పోటీ చేస్తారా? మరెవరైనా పోటీ చేస్తారా అన్న ఊహాగానాలకు అంత ప్రాధాన్యమెందుకు? ఎందుకంటే అధ్యక్ష ఎన్నిక లాంఛనప్రాయమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరల గాంధీ వారసులే ఆ పీఠాన్ని అధిష్టిస్తారన్న భావం అంతగా పాతుకుపోయింది. నామినేటేడ్‌ సంస్కృతికి అలవాటు పడిన పార్టీలలో పోటీ చేయడానికి ఎవరూ సాహసించరనే మాట స్థిరపడిపోయింది. చివరకు రాహుల్‌గాంధీనే ఆ పార్టీ అధ్యక్షుడవుతాడని, ఎన్నికల తంతు నామమాత్రమేనని ముందస్తు నిర్ణయాలకు తావు నిచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నది వాస్తవం. దశాబ్దాలుగా ఆ పార్టీలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. కింది నుంచి పైస్థాయి వరకు నామినేటేడ్‌ సంస్కృతి ప్రబలిపోయింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబ వారసులే ఉన్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఎంపికవుతున్నారు. పిసిసిలు నామమాత్రంగా ఉన్నాయే తప్ప పిసిసి అధ్యక్షులు ఎవరన్నది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తున్నది. అధిష్టానం నామినేట్‌ చేసిన వారు ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులవుతున్నారు. దీని వల్ల అసంతృప్తులు, అంతర్గత కుమ్ములాటలు షరా మామూలయ్యాయి. కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ పిసిపి అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని నామినేట్‌ చేసినప్పట్నించి రాద్ధాంతం జరుగుతున్నది. పార్టీ వర్గాల నుంచే ప్రతికూలతను ఎదుర్కొంటున్నారాయన. అసంతృప్తుల, బుజ్జగింపుల పర్వం ఇంకా కొనసాగుతున్నది.

ప్రతిష్టని దెబ్బతీసిన అపసంస్కృతి

తెలంగాణలోనే కాదు, అనేక రాష్ట్రాలలో ఈరకమైన నామినేట్‌డ్‌ సంస్కృతి ఆ పార్టీ ప్రతిష్టని దెబ్బతీసింది. అంతిమంగా కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు అసంతృప్తితో పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. లేదా నిష్క్రియాపరంగా మిగిలిపోతున్నారు. నామినేటేడ్‌ సంస్కృతి కారణంగానే మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. కర్నాటకలోనూ అసంతృప్తి అక్కడ పార్టీని మరింతగా బలహీనపరిచింది.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిన ఫలితమే ఈ దుస్థితి. దీన్నించి పాఠాలు నేర్చుకోకపోతే ఆ పార్టీ నామమాత్రంగా మిగిలిపోతుంది. వందేళ్ళ చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీలో గత అయిదు దశాబ్దాలుగా నామినేటేడ్‌ సంస్కృతి రాజ్యమేలుతున్నది. పార్టీలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయింది. 1969లో పార్టీలో చీలిక వచ్చింది. ఇందిరాగాంధీనే నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ 1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావడం ద్వారా పుంజుకుంది. ఆ తరువాతి పరిస్థితులు ఏకపార్టీ నియంతృత్వం దిశగా పరిణమించాయి. ఆ పార్టీలో ఇందిర చెప్పిందే వేదమైంది. ఆమె మాట శిరోధార్యంగా భావించే ధోరణి పెరిగింది. ఒక దశలో నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె.బారువా ''ఇందిరే ఇండియా ఇండియానే ఇందిర'' అని నినాదం ఇచ్చే స్థాయికి చేరింది. ఏకవ్యక్తి పూజ చెలరేగింది. దీనితో అంతటా నామినేటేడ్‌ సంస్కృతి వ్యాపించింది. పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, ఎన్నికలలో లోక్‌సభ, అసెంబ్లీ టికెట్ల పంపిణీ అంతా అధిష్టానం కనుసన్నలలో, అధినేత్రి ఆమోదముద్రతో సాగుతూ వచ్చింది. ఇది పార్టీలో ఎన్నికల ప్రక్రియని స్తంభింపజేసింది. అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడింది. అధిష్టానం ఆశీస్సులున్నవారే ఆయా రాష్ట్రాలలో పెత్తనం చేస్తూ వచ్చారు.

ఈ క్రమాన అగ్రవర్ణాలు, డబ్బున్న మారాజులు పార్టీలో కీలక స్థానాల్ని ఆక్రమించారు. సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా భిన్న వర్గాలకు దక్కాల్సిన అధికారం కొందరికే పరిమితమైంది. ఈ కారణంగానే దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ పదవులలో దక్కాల్సినంత వాటా దక్కలేదు. దీనితో ఆయా వర్గాలలో అసంతృప్తి ప్రబలింది. ఈ పూర్వరంగంలోనే ప్రాంతీయ పార్టీలు, సామాజిక న్యాయం ప్రవచించే పార్టీల వైపు అణచివేతకు లోనయ్యే బలహీన వర్గాల వారు చూపు సారించారు. ఈ క్రమంలోనే తెలుగునాట తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఏడాదిలోపే బలోపేతమైంది. ఎన్‌.టి. రామారావు బి.సి.లకు తగినంత స్థానం కల్పించినందునే ఆ పార్టీ పునాదులు ఇక్కడ బలపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాలలో దళిత, బహుజనుల నాయకత్వం వైపు ఆయా వర్గాలు మొగ్గు చూపుతూ రావడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడింది.

దేశానికి స్వాతంత్య్రం లభించిన నాటి పరిస్థితులతో పోల్చుకుంటే దళిత బహుజనుల పరిస్థితి మెరుగవుతూ వచ్చింది. అధికారంలో తమకు తగినంత భాగం దక్కాలని ఆకాంక్షించే వర్గాలు సమీకృతమవుతూ వచ్చాయి. ఈ ఆకాంక్షలే కాన్షీరామ్‌ బహుజన పార్టీకి స్థానం కల్పించాయి. ఈ పరిణామాల పరంపరని గుర్తించడానికి కాంగ్రెస్‌ నాయకత్వం సిద్ధంగా లేదు. ఎల్లెడలా నామినేటేడ్‌ సంస్కృతిని అనుసరిస్తూ వచ్చింది. ప్రాతినిధ్యం కల్పించాల్సిన వర్గాల్ని విస్మరించింది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే విభిన్న సామాజిక వర్గాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం వమ్మయింది.

నామినేటేడ్‌ సంస్కృతి సామాజిక న్యాయానికి చేటు

కులబలం, ధనబలం ఉన్న వర్గాల వారిని నామినేట్‌ చేసే సంస్కృతి కారణంగా అణచివేతకు గురయ్యే వర్గాల పునాదిని కోల్పోయింది కాంగ్రెస్‌ పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యం శూన్యమైంది. ఈ అంశాన్ని పదేపదే ప్రతిపక్షాలు ఎత్తి చూపినప్పటికీ ఆ పార్టీ తీరు మారలేదు. దళితుడైన బంగారు లక్ష్మణ్‌ బిజెపి అధ్యక్షుడు కాగలిగారు. కానీ ఇవాళ కాంగ్రెస్‌లో బలమైన వాణిగా ఉన్న మల్లికార్జున ఖర్గే లాంటి వారు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి పోటీ పడే అవకాశం, అందుకు మద్దతు తెలిపే స్థితి కనిపించడం లేదు. ఇది నామినేటేడ్‌ సంస్కృతి వల్ల నెలకొన్న దుస్థితి.

ఆయా రాష్ట్రాలలో లెక్కిస్తే దళిత బహుజన వర్గాల వారు ఎంతమంది పిసిసి అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నారో తెలియంది కాదు. పంజాబ్‌ ఎన్నికలలో చివరి నిమిషంలో దళిత ముఖ్యమంత్రి అనే నినాదం ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితం లభించలేదు. అదొక ఎన్నికల స్టంట్‌గా ముద్రపడి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రతి స్థాయిలో భిన్న సామాజిక వర్గాలకు స్థానం కల్పిస్తూ అంతర్గత ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ స్థాయి పదవికైనా చేరుకోవచ్చనే వాతావరణం, సంస్కృతి నెలకొనాలి.

సకల స్థాయిలలో ఎన్నికల ప్రక్రియ

గ్రామ పంచాయతీ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని రాష్ట్ర, కేంద్ర స్థాయి వరకు పార్టీ అధ్యక్షులను, కార్యవర్గాన్ని ఎన్నుకునే పద్ధతి అమలైనప్పుడే పార్టీలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క, ఈవిధంగా కిందిస్థాయి నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ సభ్యులు నాయకుల్ని ఎన్నుకునేలా విధివిధానాలు రూపొందాలి. పార్టీ ప్రాథమిక సభ్యునికి సైతం ఏ స్థాయిలోనైనా పోటీపడే అవకాశం ఉండేలా నియమావళిలో మార్పులు రావాలి. సామాన్య కార్యకర్తకు కూడా పార్టీలో క్రియాశీలక పాత్ర ఉందన్న విశ్వాసం కల్పించాలి. ఇది పార్టీ బలపడటానికి దారితీస్తుంది. పార్టీ సభ్యులలో క్రియాశీల‌కంగా పనిచేసేవారికి న్యాయం లభించేందుకు వీలు కల్పిస్తుంది. ఎవరు నిజంగా అంకితమై పనిచేస్తారో వారే పార్టీ నాయకత్వ స్థానాల్లోకి వచ్చే వెసులుబాటు కలుగుతుంది.

పోటీ వద్దంటే ఎలా?

పోటీనే వద్దని, ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే పద్ధతి సైతం పార్టీకి చేటు తెస్తుంది. వారసత్వ చరిత్ర ఉన్నందున రాహుల్‌గాంధీనో, ప్రియాంక గాంధీనో పార్టీ అధ్యక్షులు కావాలని కొందరు ఆశిస్తున్నారు. వారి నాయకత్వమే శిరోధార్యమని చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాక కూడా రాహుల్‌కు అనుకూలంగా వస్తున్న ప్రకటనల పరంపర ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలన్నవి ఒక తంతు మాత్రమేనని విమర్శలకు తావిచ్చాయి. అంతేగాక ఆశావహులైన వారు నామినేషన్‌ వేయడానికి సైతం చొరవ చూపలేని స్థితికి దారితీస్తున్నది.

పార్టీలో ప్రజాస్వామ్యం మనగలగాలంటే అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరగాలి. దేశ స్వాతంత్య్రానికి ముందు పార్టీ అధ్యక్ష పదవికి పోటాపోటీగా ఎన్నికలు జరిగింది 1939లోనే. ఆనాటి ఎన్నికలలో మహాత్మాగాంధీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్‌ చంద్రబోస్‌ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానంతరం ఎన్నికలు జరిగినప్పటికీ ఏకగ్రీవ పరంపరనే నడిచింది. అంతేగాక మొత్తం కాంగ్రెస్‌ చరిత్రలోనే అత్యధిక కాలం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగిన నేతగా సోనియాగాంధీ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆమె తనయుడే అధ్యక్షుడు కావాలని పట్టుబట్టడం అసమంజసం.

ఇతరులు పోటీ చేసే అవకాశం కల్పించడం, ఎన్నికల ప్రక్రియలో గెలుపొందిన వ్యక్తికి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా అంతర్గత ప్రజాస్వామ్యానికి బాటలు వేసినట్టవుతుంది. ఇదే సూత్రాన్ని పిసిసిలకీ, డిసిసిలకీ వర్తింపజేసి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయడం కాంగ్రెస్‌కు లాభిస్తుంది. పార్టీలో అంకితమై పనిచేసేవారు ఆఫీస్‌బేరర్లుగా ఎన్నికవడానికి ఉపయోగపడుతుంది. పార్టీ బలోపేతమై మనుగడ సాగించడానికి దోహదం చేస్తుంది. పార్టీలో ఉంటూ నిజంగా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేసేవారికి ప్రాధాన్యం లభిస్తుంది. తద్వారా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో నామినేటేడ్‌ సంస్కృతి అంతరించి ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించడం ఇప్పటికే పార్టీ వ్యవహారాల్ని చక్కబెడుతున్న నాయకుల బాధ్యత. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలో రావాలంటే తొలుత ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నెలకొనాలి. నాయకుల కన్నా పార్టీనే మిన్న అనే భావన ప్రతిస్థాయిలో పాదుకోవాలి. ఈ పరిణామం కాంగ్రెస్‌పార్టీకి, దేశానికి శ్రేయోదాయకం.

First Published:  1 Sep 2022 1:30 AM GMT
Next Story