Telugu Global
National

హెచ్చరిక.. బూస్టర్ డోస్ లేట్ చేస్తే ఫలితం ఉండదు..

భారత్ లో కరోనా వైరస్ కేసులు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదని, వీలైనంత త్వరగా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్.కె. అరోరా.

హెచ్చరిక.. బూస్టర్ డోస్ లేట్ చేస్తే ఫలితం ఉండదు..
X

కేసులు పెరుగుతున్న దశలో కరోనా వ్యాక్సిన్ కోసం అందరూ పోటీపడ్డారు. వ్యాక్సిన్ల నిల్వ తగినంత లేదని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంగారు పడ్డాయి. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీ దాదాపుగా పూర్తయింది, ప్రస్తుతం భారత్ లో బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నారు. కానీ చాలామంది బూస్టర్ డోస్ పట్ల విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే బూస్టర్ డోస్ ఆలస్యం చేసేకొద్దీ దాని ప్రభావం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. భారత్ లో కరోనా వైరస్ కేసులు పూర్తి స్థాయిలో తగ్గిపోలేదని, వీలైనంత త్వరగా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని చెబుతున్నారు నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్.కె. అరోరా.

యాంటీబాడీల ప్రభావం తగ్గిపోతుంది..

రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ ద్వారా మన శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అయితే రోజులు గడిచేకొద్దీ ఆ యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందని అంటున్నారు నిపుణులు. 6నుంచి 8నెలల్లో యాంటీబాడీల సంఖ్య తగ్గిపోవడం మొదలవుతుందని అందుకే వీలైనంత త్వరగా బూస్టర్ డోస్ వేసుకోవాలని చెబుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే అది ఫస్ట్ డోస్ గా మారిపోతుందని, బూస్టర్ ప్రభావాన్ని చూపలేదని అంటున్నారు.

బూస్టర్ తీసుకోకపోతే ఆస్పత్రిపాలే..

గడచిన 8 నెలల్లో కరోనా వల్ల ఆస్పత్రిపాలైన రోగుల వివరాలు పరిశీలిస్తే వారిలో 90శాతం మంది బూస్టర్ డోస్ లు తీసుకోనివారేనని తేలింది. ప్రస్తుతం క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉందని, అయితే అది మనకు తెలియకుండానే విస్తరిస్తోందని, ఆస్పత్రికి వెళ్లే అవసరం రాకపోవడంతో సాధారణ జలుబులాగే అందరూ దాన్ని పట్టించుకోవడంలేదని అంటున్నారు అరోరా. అయితే బూస్టర్ ఆలస్యం చేసినవారు మాత్రం ఆస్పత్రిపాలవుతున్నారని వివరిస్తున్నారు. అందుకే బూస్టర్ ని నిర్లక్ష్యం చేయొద్దని అంటున్నారు.

సమృద్ధిగా వ్యాక్సిన్లు..

గతంలో భారత్ లో డిమాండ్ కి తగినట్టుగా వ్యాక్సిన్ల ఉత్పత్తి, సప్ల‌య్‌ లేదు. ఓ దశలో రాష్ట్రాలనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో కేంద్రం కూడా నిపుణులను సంప్రదించి.. రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచింది. అలా కొంతకాలం నెట్టుకొచ్చింది. ఆ తర్వాత బూస్టర్ విషయంలో కూడా గ్యాప్ ఉండాలని చెప్పింది. ఇప్పుడు వ్యాక్సిన్లు సమృద్ధిగా ఉన్నా.. ప్రజల్లో భయం తగ్గిపోయే సరికి బూస్టర్ విషయంలో బతిమిలాడుకోవాల్సి వస్తోంది.

First Published:  1 Sep 2022 1:21 AM GMT
Next Story