Telugu Global
National

మళ్లీ రాజస్థాన్ సీఎం కుర్చీపై రగడ.. అధిష్టానం మొగ్గు ఎటువైపు?

అశోక్ గెహ్లాట్ తీరును సచిన్ పైలెట్ తప్పుపడుతున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన పైలెట్.. సీఎం పదవి విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.

మళ్లీ రాజస్థాన్ సీఎం కుర్చీపై రగడ.. అధిష్టానం మొగ్గు ఎటువైపు?
X

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ 'చింతన్ శిబిర్' పేరుతో మూడు రోజుల సమావేశాలు నిర్వహించింది. ఆ సందర్భంగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. 'ఒక వ్యక్తి.. ఒకే పదవి' అనే తీర్మానం కూడా ఆ సమావేశాల్లో ఆమోదించారు. కానీ, ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన సీఎం అశోక్ గెహ్లాట్ సదరు తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టడానికి రాహుల్ గాంధీ సిద్ధంగా లేని సందర్భంలో.. అధిష్టానం అశోక్ గెహ్లాట్ వైపు మొగ్గు చూపిస్తోంది. ఆయన కూడా జాతీయ అధ్యక్ష పదవికి ఓకే చెబుతున్నారు. కానీ, రాజస్థాన్ సీఎం కుర్చీని మాత్రం వీడే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. బుధవారం ఢిల్లీలో సోనియాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అవసరం అయితే మూడు పదవులైనా చేపట్టే సత్తా తనకు ఉందని చెప్పుకొచ్చారు. రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు ఆయన ప్రత్యర్థి సచిన్ పైలెట్‌కు ఆగ్రహం తెప్పించాయి.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి సచిన్ పైలెట్ తీవ్రంగా కష్టపడ్డారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆయనకే సీఎం పదవి అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ అధిష్టానం మాత్రం సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. 2020లో సచిన్ పైలెట్ తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీని వీడాలని భావించారు. అశోక్ గెహ్లాట్‌తో పొసగక వేరు కుంపటి పెట్టుకోవాలని అనుకున్నారు. కానీ స్వయంగా రాహుల్ గాంధీ పిలిపించుకొని సచిన్ పైలెట్‌తో మాట్లాడారు. దీంతో అప్పటికి వివాదం సద్దుమణిగి.. అశోక్ గెహ్లాట్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ వెళ్తుండటంతో రాజస్థాన్ సీఎంగా తనకు అవకాశం వస్తుందని సచిన్ పైలెట్ భావించారు. ఉదయ్‌పూర్ రిజల్యూషన్ ప్రకారం జోడు పదవుల్లో ఉండకూడదు కాబట్టి.. సీఎం కుర్చీ గ్యారెంటీ అని సచిన్ అంచనా వేసుకున్నారు. కానీ అశోక్ గెహ్లాట్ మాత్రం రెండింటిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే వివాదానికి దారి తీసింది.

సోనియా గాంధీని కలిసి వచ్చిన తర్వాత కూడా గెహ్లాట్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక వ్యక్తి మంత్రిగా, కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. పార్టీకి మంచి జరిగే పని ఏదైనా తాను చేస్తాను. రెండేమీటి మూడు పదవులు కూడా చేపడతాను అని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సుముఖంగా లేరు. ఇదే అదనుగా భావించిన అశోక్ గెహ్లాట్ రెండు పదవుల్లో ఉంటాననే కండిషన్ పెట్టారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అశోక్ గెహ్లాట్ తీరును సచిన్ పైలెట్ తప్పుపడుతున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన పైలెట్.. సీఎం పదవి విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, అటువైపు నుంచి స్పష్టమైన హామీ ఏదీ లభించలేదు. సచిన్ పైలెట్ మాత్రం అధిష్టానం ఏం నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. పైకి అలా అంటున్నా.. తన వర్గ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలని సచిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సోనియా గాంధీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో కలుగజేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు పార్టీ నేత వేణుగోపాల్ చెప్పారు. గెహ్లాట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.. శశిథరూర్‌ను కూడా ప్రోత్సహించింది సోనియానే అని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 17న జరిగే ఎన్నికలో సోనియా తటస్థంగా ఉంటారని స్పష్టం చేశారు. అయితే పోటీలో ఎవరెవరు ఉంటారనే విషయం మాత్రం తనకు తెలియదని వేణుగోపాల్ అన్నారు.

ఇక అశోక్ గెహ్లాట్ రెండు పదవుల్లో ఉంటానని చెప్పడంపై పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆయన ధోరణిని తప్పుబట్టారు. పార్టీ ఓ తీర్మానం చేసినప్పుడు సీనియర్లే దాన్ని పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. కాగా, ఉదయ్‌పూర్‌లో కేవలం తీర్మానం ప్రవేశపెట్టారని, దాన్ని పార్టీ రాజ్యాంగంలో రాసుకోలేదని అశోక్ గెహ్లాట్ వర్గం చెప్తోంది. ఏదేమైనా జాతీయ అధ్యక్ష ఎన్నిక కంటే రాజస్థాన్ సీఎం కుర్చీనే అధిష్టానానికి తల నొప్పులు తెచ్చి పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Next Story