Telugu Global
National

ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం..

ఢిల్లీలో బైక్ ట్యాక్సీలు నడిపితే తొలిసారి 5వేల రూపాయలు ఫైన్ విధిస్తామని, రెండోసారి 10వేల రూపాయల ఫైన్ అని ప్రకటించింది. ఏడాదిపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశముంది.

ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం..
X

పట్టణాల్లో కార్ ట్యాక్సీలతోపాటు, బైక్ ట్యాక్సీలకి కూడా ఆదరణ బాగా పెరుగుతోంది. ట్రాఫిక్ జంఝాటం లేకుండా బైక్ ట్యాక్సీల్లో తక్కువ ధరకే ప్రయాణించొచ్చని ప్రముఖ హీరోలు సైతం అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు బైక్ ట్యాక్సీల విషయంలో ఉన్న రవాణా నిబంధనలు అందరికీ గుర్తొచ్చాయి. దీంతో ఒక్కో రాష్ట్రం ఈ బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ వస్తోంది. ఆమధ్య ముంబైలో బైక్ ట్యాక్సీలు తిరగకూడదన్నారు, కోర్టులు ఆ విషయంలో జోక్యం చేసుకోలేకపోయాయి. ఇప్పుడు ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది.

మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం ద్విచక్ర వాహనాలను రవాణాకు ఉపయోగించడం నిషేధం. దీన్ని మరోసారి నొక్కి వక్కాణిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో బైక్ ట్యాక్సీలు నడిపితే తొలిసారి 5వేల రూపాయలు ఫైన్ విధిస్తామని, రెండోసారి 10వేల రూపాయల ఫైన్ అని ప్రకటించింది. ఏడాదిపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశముంది. ఇక బైక్ ట్యాక్సీ నడిపినవారు మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కోల్పోతారు. నిర్వహణ సంస్థలకు కూడా భారీ జరిమానా విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలు విరుద్దంగా ఆన్ లైన్ లో బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించినా, యాప్ లో నమోదు చేసినా లక్ష రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

నిషేధం అమలులో ఉన్నా కొంతమంది ప్రభుత్వానికి మస్కా కొడుతూ బైక్ ట్యాక్సీలను నడుపుతున్నారని ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. తెలిసినవారు అనో, లేదా లిఫ్ట్ అడిగారనో కొంతమంది అపరిచితుల్ని ఎక్కించుకుని ట్యాక్సీ సర్వీస్ లాగా బైక్ పై తీసుకెళ్తుంటారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలు కూడా కుదరవని ఢిల్లీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏ రూపంలో అయినా బైక్ ట్యాక్సీలను నడపొద్దని హెచ్చరించింది. దీన్ని ఓ వ్యాపారంగా చేసుకోవద్దని స్పష్టం చేసింది.

First Published:  20 Feb 2023 9:26 AM GMT
Next Story