Telugu Global
National

అగ్నికి ఆజ్యం పోస్తున్న వీహెచ్‌పీ, భజరంగద్ దళ్.. ఆయుధాలు పట్టండంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

కేవలం 500 మంది పాల్గొనడానికే పోలీసులు అనుమతి ఇచ్చినా.. 5వేల మంది ఈ మహాపంచాయత్‌కు హాజరయ్యారు. ఇందులో ఎక్కువగా వీహెచ్‌పీ, భజరంగద్ దళ్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

అగ్నికి ఆజ్యం పోస్తున్న వీహెచ్‌పీ, భజరంగద్ దళ్.. ఆయుధాలు పట్టండంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
X

ఆయుధాలు పట్టండి.. వేలెత్తి చూపిస్తే చేయి నరికేస్తాం.. అందరికీ తగిన సమాధానం ఇస్తాం.. ఇలా సాగాయి ఆదివారం హర్యానాలోని పవాల్‌లో నిర్వహించిన మహాపంచాయత్‌లో పాల్గొన్న సభికుల మాటలు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకులు వచ్చిన వారిని రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రసంగాలు చేశారు. హర్యానాలోని నుహ్‌లో గత నెల 31న మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నుహ్‌లో ప్రారంభమైన ఈ అల్లర్లు క్రమంగా హర్యానాలోని ఇతర జిల్లాలకు కూడా పాకుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం ఆందోళనలను అణిచి వేయడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు గత నెలలో ఆగిపోయిన మత సంబంధిత యాత్రను తిరిగి ఈ నెల 28 నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నుహ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని పవాల్‌లో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న మత సంబంధిత ర్యాలీ గురించి చర్చించడానికి మహాపంచాయత్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. కేవలం 500 మంది పాల్గొనడానికే పోలీసులు అనుమతి ఇచ్చినా.. 5వేల మంది ఈ మహాపంచాయత్‌కు హాజరయ్యారు. ఇందులో ఎక్కువగా వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సభలో ఎలాంటి రెచ్చగొట్టే మాటలు, విద్వేష ప్రసంగాలు చేయవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయినా, నిబంధనలు తుంగలో తొక్కి.. ముస్లింలపై నేరుగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం పవాల్‌లో జరిగిన మహాపంచాయిత్‌కు నిబంధనలకు మించి ఎక్కువ మంది పాల్గొనడమే కాకుండా.. అందులో చాలా మంది ఆయుధాలతో రావడం ఆందోళన కలిగించింది. సభలో పాల్గొన్న ఒకరు ముస్లింలను టార్గెట్ చేసి మాట్లాడుతూ.. మీరు వేలు చూపిస్తే.. మేం చెయ్యి నరికేస్తాం అని హెచ్చరించారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారు. ప్రతీ ఒక్కరు ఆయుధాలు పట్టాలి. అవసరం అయితే తుపాకీల లైసెన్సులు కూడా తీసుకుంటాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

భజరంగ్ దళ్‌కు చెందిన కుల్‌భూషణ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. నుహ్‌లో నివశిస్తున్న హిందువులకు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ నెల 28న అనుకున్నట్లుగానే మత సంబంధిత ర్యాలీ నిర్వహిస్తాము. అధికారులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా తప్పకుండా ఈ యాత్ర సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మాకు ఆర్మ్ లైసెన్సులు ఇవ్వాలి. నుహ్ జిల్లాలోని హిందువుల భద్రత కోసం ప్రతీ ఒక్కరు లైసెన్సుకు అప్లైయ్ చేయండి అని పిలుపునిచ్చారు. గత నెల జరిగిన అల్లర్ల కారణంగా ఎంతో మంది హిందూ కుటుంబాలు నష్టపోయాయి. మేం అనుమానితుల ఆస్తులను అమ్మి లేదా వాటిని స్వాధీనం చేసుకొని హిందూ సోదరులకు పరిహారం చెల్లిస్తామని కుల్‌భూషణ్ వ్యాఖ్యానించారు.

వీహెచ్‌పీకి చెందిన అజిత్ సింగ్ మాట్లాడుతూ నుహ్‌ జిల్లాలో గోవధను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నమోదైన కేసులను వెంటనే గురుగ్రామ్ పోలీసులు బదిలీ చేయాలని, మాకు నుహ్ పోలీసులపై నమ్మకం లేదని చెప్పారు. మహాపంచాయత్‌తో హర్యానా గోసంరక్షక్ దళ్ సభ్యుడు ఆజాద్ శాస్త్రి మాట్లాడుతూ.. ఇది మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. యువకులు ఆయుధాలు పట్టాల్సిన అవసరం ఉంది. మాకు వెంటనే 100 ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరం అయితే చట్టాన్ని అతిక్రమించి ఆయుధాలు సమకూర్చుకోవాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇలా మాట్లాడినందుకు నాపై చాలా మంది కోపం పెంచుకుంటారు. కానీ నేను ఆ విషయాన్ని పట్టించుకోనని శాస్త్రి చెప్పారు.

కాగా, ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయకూడదని ముందుగానే హెచ్చరించామని, విద్వేష ప్రసంగాలు ఎట్టి పరిస్థితిలోనూ చేయవద్దని చెప్పినట్లు పవాల్ ఎస్పీ లోకేందర్ సింగ్ చెప్పారు. మహాపంచాయత్ నిర్వహణకు చాలా నిబంధనలు పెట్టామని.. శాంతి, సామరస్యాని పాటించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. భారీగా పోలీస్ బందోబస్తు పెట్టడమే కాకుండా.. సభా ప్రాంగణానికి వెళ్లే దారిలో తనిఖీలు కూడా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

First Published:  14 Aug 2023 3:55 AM GMT
Next Story