Telugu Global
National

వందే భారత్.. నాలుగోసారి..

మరోసారి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వార్తల్లోకెక్కింది. ముంబై నుంచి గాంధీ నగర్ వెళ్తున్న ఎక్స్ ప్రెస్.. ఎద్దుని ఢీకొని ఆగిపోయింది. రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతిన్నది.

వందే భారత్.. నాలుగోసారి..
X

వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని మోదీ ఏ మహూర్తాన ప్రారంభించారో కానీ, మూడు బ్రేకులు, ఆరు ప్రమాదాలు అన్నట్టుగా ఉంది వాటి పరిస్థితి. ఈ నెల 6న గాంధీనగర్ వెళ్తున్న రైలు ఓ గేదెను ఢీకొట్టడంతో రైలు ఇంజిన్ డొప్ప ఊడిపోయింది, ఆ తర్వాతి రోజే ఆవుని ఢీకొట్టడంతో ఇంజిన్ సొట్టపోయింది. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్‌లో ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్‌లో ట్రాక్షన్ మోటర్ జామ్ కావడంతో రైలు ఆగిపోయింది. ఆ రైలులోని ప్రయాణికుల్ని మరో రైల్లో ఎక్కించి గమ్య స్థానాలకు చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడితో ఈ ప్రమాదాలు, అపశకునాలు ఆగిపోలేదు. తాజాగా మరోసారి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వార్తల్లోకెక్కింది. ముంబై నుంచి గాంధీ నగర్ వెళ్తున్నఎక్స్‌ప్రెస్.. ఎద్దుని ఢీకొని ఆగిపోయింది. రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతిన్నది. 15 నిముషాల పాటు రైలు ఆగిపోయింది. ఆ తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లతో భారతీయ రైల్వేలో నూతన శకం ప్రారంభమైందని. ఇక బుల్లెట్ ట్రైన్లు పరుగులు తీయడమే తరువాయి అంటూ డబ్బా కొట్టారు. అయితే ఈ సెమీ స్పీడ్‌కే మన రైల్వే ట్రాక్‌లు తట్టుకోలేకపోతున్నాయి. ట్రాక్‌ల పైకి పశువులు అడ్డు రావడంతో వరుసగా వందే భారత్ రైలు మూడు సార్లు ప్రమాదాలకు గురి కావడం విశేషం. నెల రోజల వ్యవధిలో మూడు సార్లు ప్రమాదాలంటే తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు.

పునరాలోచిస్తారా..?

వందే భారత్‌లో ప్రయాణం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ఇప్పటికే ప్రయాణికులు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఎప్పుడు ఎక్కడ ఏ జంతువుని ఢీకొడుతుందోననే ఆందోళనలో ఉన్నారు ప్రయాణికులు. ట్రాక్ సరిగ్గా ఉన్నా ఇంజిన్‌లో సమస్య తలెత్తితే ఏకంగా రైలు మారిపోవాల్సిందే. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్‌తో ఈ రైళ్లని కొనసాగిస్తారా, లేక వాటి వేగం విషయంలో మార్పులు తీసుకొస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ రైళ్ల వేగాన్ని నియంత్రించకపోయినా.. ఫలానా స్టేషన్ల మధ్య మాత్రం రైలు సాధారణ వేగంతోనే వెళ్లాలి అనే నిబంధన తీసుకురావచ్చని అంటున్నారు.

First Published:  29 Oct 2022 11:56 AM GMT
Next Story