Telugu Global
National

మోదీ హ్యాండ్ మామూలుగా లేదు.. వందే భారత్‌కి మూడో విఘ్నం

గత రెండు రోజుల్లో ముంబై-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోగా, తాజాగా సాంకేతిక సమస్యతో మరో రైలు మధ్యలోనే ఆగిపోయింది.

మోదీ హ్యాండ్ మామూలుగా లేదు.. వందే భారత్‌కి మూడో విఘ్నం
X

మొన్న గేదెలు ఢీకొనడంతో రైలింజన్ బాక్స్ ఊడిపోయింది..

నిన్న ఆవుని ఢీకొట్టి ఇంజిన్ ముందుభాగం సొట్టపోయింది..

మూడో రోజు ఏ జంతువూ అడ్డురాలేదు, కానీ రైలు దానంతట అదే ఆగిపోయింది..

ఇదీ భారత రైల్వే ప్రతిష్టాత్మక వందే భారత్ రైలు దుస్థితి. అట్టహాసంగా దీన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ హ్యాండ్ మహిమ.

భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల్లో ముంబై-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోగా, తాజాగా సాంకేతిక సమస్యతో మరో రైలు మధ్యలోనే ఆగిపోయింది. ఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రాక్షన్‌ మోటార్‌ జామ్‌ అవడంతో మధ్యలోనే ఆగిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌ షహర్‌ సమీపంలో దన్‌ కౌర్‌ - వేర్‌ స్టేషన్ల మధ్య రైలు ఆగిపోయింది. సహజంగా రైలులో ఉన్నవారంతా ఏదో అడ్డు వచ్చిందని అనుకున్నారు. ఇటీవల ఆవులు, గేదెలు సరాసరి వందే భారత్‌కే అడ్డు వస్తుండటంతో ప్రయాణికులు కూడా కారణం అదే అనుకున్నారు. కానీ ఈసారి రైలులోనే సమస్య ఉంది. C-8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్‌ మోటార్‌లో బేరింగ్‌ పనిచేయలేదు. అయితే రైలులో ఉన్న సాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి, రైలుని తక్కువ వేగంతో తీసుకెళ్లారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆపారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం. దీంతో అందులోని ప్రయాణికుల్ని శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

వందే భారత్ రైలుని ప్రారంభించిన రెండో వారంలోనే.. వరుసగా మూడు సార్లు ప్రమాదాలు జరగడం సంచలనంగా మారింది. భారతీయ రైల్వే ట్రాక్ లపై హైస్పీడ్ రైళ్లు ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ మొదలైంది. రెండు సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రైలులోనే వేచి చూశారు. చివరకు ఆలస్యంగా గమ్యస్థానాలు చేరుకున్నారు. మూడోసారి ఏకంగా మరో రైలు ఎక్కాల్సి వచ్చింది. అంటే హైస్పీడ్ రైలులో త్వరగా గమ్య స్థానాలకు వెళ్లాలనుకున్న ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వందే భారత్ రైళ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

First Published:  8 Oct 2022 3:04 PM GMT
Next Story