Telugu Global
National

ఈ సారి ఆవును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్

శుక్రవారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆవును రైలు ఢీకొట్టిన సమయంలో నెమ్మదిగా వెళ్తోందని.. ఇది చిన్న ప్రమాదమేనని అధికారులు వెల్లడించారు.

ఈ సారి ఆవును ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్
X

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 24 గంటల్లో మరోసారి పశువులను ఢీకొని ప్రమాదానికి గురైంది. గురువారం అహ్మదాబాద్ సమీపంలో పట్టాలకు అడ్డుగా వచ్చిన గేదెలను ఢీకొట్టడంతో ముందు భాగం ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు హడావిడిగా రైలు ముందు భాగానికి రిపేర్లు చేసి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా.. గేదెల యజమానులపై కేసు కూడా నమోదు చేశారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. శుక్రవారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ముంబై - గాంధీనగర్ సెక్షన్‌లో ఆనంద్ స్టేషన్‌కు సమీపంలో ఓ ఆవును ఢీకొట్టింది. కంజారి-బోరియావి-ఆనంద్ రూట్లో.. వడోదర రైల్వే డివిజన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

శుక్రవారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఆవును రైలు ఢీకొట్టిన సమయంలో నెమ్మదిగా వెళ్తోందని.. ఇది చిన్న ప్రమాదమేనని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, ఆవుకు కూడా ఎలాంటి మేజర్ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదం కారణంగా రైలు ముందు భాగం మాత్రం కొంచెం సొట్ట పడినట్లు తెలిపారు. కాగా, రైలు 10 నిమిషాలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిలిచిపోయిందని, లోకో పైలెట్లు పూర్తిగా పరిశీలించి ప్రమాదం ఏమీ లేదని నిర్దారించుకున్న తర్వాత ప్రయాణాన్ని కొనసాగించినట్లు వడోదర డివిజన్ పీఆర్వో తెలిపారు.

వరుసగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదాలు జరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమ‌య్యారు. పశువులను పట్టాలపైకి తోలేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే చట్టం ప్రకారం పట్టాలపైకి పశువులను తీసుకురాకుడ‌ద‌ని పేర్కొన్నారు. ప్రమాణికుల భద్రతకు రైల్వే పెద్ద పీట వేస్తుందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. కాగా, సెప్టెంబర్ 30నే ముంబై-అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ప్రతీ రోజు ఒకటి అప్‌లైన్‌లో, మరొకటి డౌన్‌లైన్లో తిరుగుతుంది. ఈ రెండు రైళ్లు 24 గంటల వ్యవధిలో పశువులను ఢీకొట్టి ప్రమాదాలకు గురి కావడం గమనార్హం.

First Published:  7 Oct 2022 3:06 PM GMT
Next Story