Telugu Global
National

ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న కూలీలు

ఎట్టకేళకు ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాల శ్రమ ఫలించింది.

ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న కూలీలు
X

ఎట్టకేళకు ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాల శ్రమ ఫలించింది. ర్యాట్-హోల్ మైనింగ్ ద్వారా టన్నెల్ లోపలికి మార్గాన్ని ఏర్పాటు చేసి, చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి చేసిన ఆపరేషన్ సత్ఫలితాన్ని ఇచ్చింది.

బయటకు వచ్చిన కూలీలను అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా సురక్షితంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికులను స్వయంగా పలుకరించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హర్షం వ్యక్తం చేశారు. టన్నెల్‌ సమీపంలో నిర్మించిన తాత్కాలిక వైద్య శిబిరంలో కార్మికులందరికీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను కలుపుతూ 4.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. నవంబరు 12న సిల్క్యారా ప్రాంతం వైపు టన్నెల్ కూలిపోయింది. 205వ మీటరు నుంచి 260వ మీటరు వరకు టన్నెల్ మూసుకుపోయింది. అప్పటికే లోపల 41 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారు బయటికి వచ్చే మార్గంలేక అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారికి ఓ పైపు ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు.

వారు నీరసపడిపోకుండా మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ వచ్చారు. డ్రై ఫ్రూట్స్, మల్టీవిటమిన్ మాత్రలు, డిప్రెషన్ కు లోనవ్వకుండా యాంటీడిప్రషన్ ఔషధాలు కూడా పంపించారు. వారు తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి అవసరమైన పదార్ధాలు అందుకునే వెసులుబాటును కల్పించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు అటు సహాయక బృందాలకు, ఇటు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.

ఒకవైపు సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి మరో వైపు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి చివరికి సహాయక సిబ్బంది వారి ప్రాణాలను కాపాడగలిగారు. ఒకానొక సమయంలో భూమికి సమాంతరంగా చేపట్టిన పనులు ఆగిపోవడంతో అక్కడినుంచి నుంచి ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు తవ్వకం చేపట్టి మిగతా దూరం డ్రిల్లింగ్‌ పూర్తి చేశారు. 57 మీటర్ల డ్రిల్లింగ్ తరువాత కూలీలు ఉన్న ప్రాంతానికి గొట్టాలు పెట్టి వారికి బయటకు తీసుకు వచ్చారు.

First Published:  28 Nov 2023 4:49 PM GMT
Next Story