Telugu Global
National

రిషభ్ పంత్ ని కాపాడిన వారికి ఘనంగా సన్మానాలు..

రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ కి చెందిన క్రికెటర్. కారు ప్రమాదం జరిగింది ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో, రక్షించింది హర్యానా రోడ్ వేస్ కి చెందిన బస్ డ్రైవర్, కండక్టర్. వారిద్దర్నీ ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించేందుకు సిద్ధమైంది.

రిషభ్ పంత్ ని కాపాడిన వారికి ఘనంగా సన్మానాలు..
X

కళ్లముందే కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది, ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. అందులో నుంచి కారు డ్రైవర్ బయటకు రావడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు. అలాంటి సమయంలో బతుకు జీవుడా అంటూ దూరంగా పారిపోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ హర్యానా బస్సు డ్రైవర్, కండక్టర్ మాత్రం తమ ప్రాణాలకు తెగించి కారు దగ్గరకు వెళ్లారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయానికి తాము కాపాడింది ఎవరినో వారికి తెలియదు. టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ని కాపాడిన వారిద్దరూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచారు.

బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్ గురుకుల్. వీరిద్దరూ ప్రాణాలకు తెగించి క్రికెటర్ రిషభ్ పంత్ ని మండుతున్న కారునుంచి బయటకు లాగారు. అప్పటికే కారు తగలబడుతోంది. కారులోనుంచి రిషభ్ పంత్ ని వారు బయటకు లాగేసిన తర్వాత పూర్తిగా కాలి బూడిదైంది. ఒక్క నిమిషం వారు ఆలస్యం చేసి ఉన్నా, భయపడి దూరంగానే నిలబడి ఉన్నా పంత్ బతికేవాడు కాదు. కానీ ఆ క్షణంలో వారు చేసిన సాహసం ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. వారిని రియల్ హీరోలుగా మార్చేసింది. ఈ ఘటన జరిగిన రోజునే హర్యానా ప్రభుత్వం వారిద్దరినీ ఘనంగా సన్మానించింది. పురస్కారాలతో అభినందించింది.

ఇప్పుడు ఉత్తరాఖండ్ వంతు..

రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ కి చెందిన క్రికెటర్. కారు ప్రమాదం జరిగింది ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో, రక్షించింది హర్యానా రోడ్ వేస్ కి చెందిన బస్ డ్రైవర్, కండక్టర్. వారిద్దర్నీ ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించేందుకు సిద్ధమైంది. జనవరి-26న రిపబ్లిక్ డే సందర్భంగా వారిద్దరికీ ఘన సన్మానం చేయబోతున్నట్టు ప్రకటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి. రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడేందుకు వారిద్దరూ తమ ప్రాణాలు పణంగా పెట్టారని కొనియాడారు సీఎం థామి. అత్యవసర పరిస్థితుల్లో చురుగ్గా స్పందించడంలో, సమస్యని పరిష్కరించడంలో హర్యానా రోడ్‌ వేస్ సిబ్బంది తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు.

First Published:  1 Jan 2023 1:32 PM GMT
Next Story