Telugu Global
National

అవును మాది కమిషన్ల ప్రభుత్వమే.. తప్పు ఒప్పుకున్న బీజేపీ నేత

ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తిరత్ సింగ్ రావత్ తమది కమీషన్ల ప్రభుత్వమేనంటూ కుండబద్దలు కొట్టారు. ఉత్తరాఖండ్ తోపాటు, ఉత్తర ప్రదేశ్ ని కూడా ఆయన ఇరుకున పెట్టారు.

అవును మాది కమిషన్ల ప్రభుత్వమే.. తప్పు ఒప్పుకున్న బీజేపీ నేత
X

ఇప్పటికే కర్నాటకలో కమీషన్ల ప్రభుత్వం అంటూ బీజేపీపై పెద్ద అపవాదు ఉంది. అది అపవాదు కాదు, నిజమేనంటూ అధికార పార్టీ నేతలే చాలాసార్లు బయటపడ్డారు. తాజాగా ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తిరత్ సింగ్ రావత్ కూడా తమది కమీషన్ల ప్రభుత్వమేనంటూ కుండబద్దలు కొట్టారు. ఉత్తరాఖండ్ తోపాటు, ఉత్తర ప్రదేశ్ ని కూడా ఆయన ఇరుకున పెట్టారు. తమ రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏ పనీ జరగదంటూ ఆయన మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరాఖండ్ లో కమీషన్ల వ్యవహారం ఉందనేది వాస్తవం అని అన్నారు తిరత్ సింగ్ రావత్. తమ రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ నుంచి విడిపోయే సమయంలో పనులు జరగాలంటే 20శాతం కమీషన్ గా చెల్లించాలనే నీఛ సంస్కృతి ఉండేదని, ఉత్తరాఖండ్ విడిపోయాక కూడా అది కొనసాగుతోందన్నారు. ఇప్పుడది 20శాతం నుంచి ప్రారంభమవుతోందని, దాదపుగా రెట్టింపైందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ లేనిదే ప్రజల పనులైనా, కాంట్రాక్టర్ల పనులైనా జరగవని ఆయన స్పష్టం చేశారు. సొంత ప్రభుత్వం గురించి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఇంతేనా..?

బీజేపీ పాలిత కర్నాటకలో కమీషన్ల కంపు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. పేసీఎం అంటూ అక్కడి ముఖ్యమంత్రిని ప్రతిపక్షాలు ఓ ఆట ఆడేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా ఈ అవినీతి జబ్బు ఉందని తేలిపోయింది. అందులోనూ ఉత్తరాఖండ్ మాజీ సీఎం నేరుగా ఈ మాటలు చెప్పడం విశేషం. అయితే ఇవి తాజా వ్యాఖ్యలా లేక గతంలో చేసినవా అనేది తేలాల్సి ఉంది. వీడియో ఎప్పటిదైనా ఆయన చెప్పిన మాట మాత్రం వాస్తవమే అంటున్నారు విపక్ష నేతలు. బీజేపీ పరువు ఎవరూ తీయాల్సిన పనిలేదని, ఆ పార్టీ సొంత నేతలే వారి బండారం బయటపెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

First Published:  14 Nov 2022 8:35 AM GMT
Next Story