Telugu Global
National

స్కూల్లో పిల్లలను దెయ్యం ఆవహించిందట.. తాంత్రిక పూజలు చేయించిన ఉపాధ్యాయులు

పాఠశాలకు ఒక మాంత్రికుడిని పిలిపించి అక్కడ ఉన్న దెయ్యాలు వదిలి వెళ్లేలా తాంత్రిక పూజలు చేయించారు. మూఢ నమ్మకాలను పారదోలాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలో దెయ్యాలు ఉన్నాయని పూజలు చేయించడం సంచలనం సృష్టిస్తోంది.

స్కూల్లో పిల్లలను దెయ్యం ఆవహించిందట.. తాంత్రిక పూజలు చేయించిన ఉపాధ్యాయులు
X

పాఠశాల అంటే పిల్లలకు చదువు నేర్పించే కేంద్రమే కాదు. సమాజం గురించి తెలుసుకునే గొప్ప దేవాల‌యం. సమాజంలో ఎలా మెలగాలో పిల్లలకు బోధిస్తుంటారు. అలా బాధ్యతగా పిల్లలకు ఇది మంచి.. ఇది చెడు.. అని చెప్పాల్సిన ఉపాధ్యాయులు పిల్లలపై మూఢ నమ్మకాలను రుద్దుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లా కన్య ప్రాథమిక పాఠశాలలో భోజనం తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. పాఠశాలలో ఉన్న దెయ్యమే ఇందుకు కారణమని ఉపాధ్యాయులు తాంత్రిక పూజలు చేయించడం సంచలనం సృష్టిస్తోంది.

సోమవారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పిల్లలు భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురి అయ్యారు కాబట్టి.. భోజనం ఏమైనా పాడైందా..? అందులో ఏమైనా పడిందా..? అని ఆరా తీయాల్సిన ఉపాధ్యాయులు అవన్నీ పట్టించుకోకుండా.. స్కూల్లో ఉన్న దెయ్యమే ఇందుకు కారణమని.. అవి బాలికలను ఆవహించడంతోనే ఇలా జరిగిందని వారు గుడ్డిగా నమ్మారు.

అంతేకాదు పాఠశాలకు ఒక మాంత్రికుడిని పిలిపించి అక్కడ ఉన్న దెయ్యాలు వదిలి వెళ్లేలా తాంత్రిక పూజలు చేయించారు. మూఢ నమ్మకాలను పారదోలాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలో దెయ్యాలు ఉన్నాయని పూజలు చేయించడం సంచలనం సృష్టిస్తోంది. పాఠశాలకు మాంత్రికుడిని పిలిపించి పూజలు చేయించినట్లు ఉన్నతాధికారులకు తెలియడంతో విషయం సబ్ కలెక్టర్ అరుణ్ దీక్షిత్ వరకు వెళ్ళింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. మధ్యాహ్నం భోజనం నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపినట్లు తెలిపారు.

First Published:  22 Dec 2022 6:14 AM GMT
Next Story