Telugu Global
National

ప్రభుత్వ బస్సు డ్రైవర్లుగా మహిళలు.. 26 మందిని నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

యోగి ప్రభుత్వం రెండేళ్ల కిందట నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి డ్రైవింగ్ పరీక్షలు చేప‌ట్టింది.

ప్రభుత్వ బస్సు డ్రైవర్లుగా మహిళలు.. 26 మందిని నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
X

మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో, వృత్తుల్లో రాణిస్తున్నారు. ఆకాశంలో విహరించే విమానాలకు పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే గతంలో ఇవి మహిళలు చేయలేరు అన్న పనుల్లో కూడా ప్రస్తుతం మహిళలను నియమిస్తున్నారు. మహిళల్లో సాధికారత కల్పించేందుకు, వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు రాష్ట్ర రవాణా సంస్థల్లో అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు మహిళలను ప్రభుత్వ బస్సులకు డ్రైవర్లుగా నియమించగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ బస్సులకు మహిళా డ్రైవర్లను నియమించింది.

మహిళలను కూడా ప్రభుత్వ బస్సులకు డ్రైవర్లుగా నియమించాలని నిర్ణయం తీసుకున్న యోగి ప్రభుత్వం రెండేళ్ల కిందట నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి డ్రైవింగ్ పరీక్షలు చేప‌ట్టింది. అందులో ఎంపికైన వారికి తాజాగా పోస్టింగ్ లు ఇచ్చింది. మొత్తం 26 మంది మహిళలకు మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ బస్సులకు డ్రైవర్లుగా అవకాశం కల్పించింది.

ప్రియాంక శర్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే మొదటి మ‌హిళా ప్రభుత్వ బస్సు డ్రైవర్ గా నిలిచారు. ప్రియాంక శర్మ భర్త తాగుడుకు బానిసై చనిపోగా.. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడం కోసం కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్న ప్రియాంక.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తొలి మహిళా డ్రైవర్ గా ఎంపికైంది. కాగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ బస్సులకు మహిళలను డ్రైవర్లుగా నియమించేందుకు తగు చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది.

First Published:  23 Dec 2022 11:43 AM GMT
Next Story