Telugu Global
National

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఉద్రిక్తత.. అఖిలేష్ పై వేలు చూపుతూ యోగి ఆగ్రహం

ఈ సందర్భంగా అఖిలేష్ వైపు యోగి వేలు చూపిస్తూ మాఫియాను మట్టిలో కలిపేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే హత్య ఘటనలో దోషులను వదిలిపెట్టేదిలేదన్నారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఉద్రిక్తత.. అఖిలేష్ పై వేలు చూపుతూ యోగి ఆగ్రహం
X

ఇవాళ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఉగ్రరూపం దాల్చారు. ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ పై వేలు చూపుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్, అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది లో ఒకరిని శుక్రవారం ప్రయాగ్ రాజ్ లో కాల్చి చంపడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ ఎమ్మెల్యే హత్య కేసుకు సంబంధించి బాధిత కుటుంబం అతిక్ అహ్మద్ పై ఆరోపణలు చేసిందని, అతడిని పార్టీలో చేర్చుకొని మాఫియాను పెంచి పోషించేది సమాజ్ వాదీ పార్టీయే అని మండిపడ్డారు. అతిక్ అహ్మద్ ను ఎంపీని కూడా చేసిందని విమర్శించారు. ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు అఖిలేష్ గాడ్ ఫాదర్ అని అన్నారు.

ఈ సందర్భంగా అఖిలేష్ వైపు యోగి వేలు చూపిస్తూ మాఫియాను మట్టిలో కలిపేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే హత్య ఘటనలో దోషులను వదిలిపెట్టేదిలేదన్నారు. ' నీ తండ్రిని కూడా నువ్వు గౌరవించవు.. సిగ్గుపడాలి.. అంటూ.. అఖిలేష్ ను తీవ్రంగా విమర్శించారు.

యోగి వ్యాఖ్యల పట్ల అఖిలేష్ కూడా తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేను హత్య చేసింది తమ పార్టీకి చెందిన వారు కాదని బీజేపీకి చెందిన వారే హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది రామరాజ్యం అంటూ.. డబుల్ ఇంజన్.. అని అన్నారు.. మరి పట్ట పగలే రాష్ట్రంలో కాల్పులు జరిపి, బాంబులు విసిరి హత్య కేసులో ప్రధాన సాక్షిని చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రామరాజ్యంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

First Published:  25 Feb 2023 1:00 PM GMT
Next Story