Telugu Global
National

అది ఎన్డీఏ కాదు, అమీబా..

ఎన్‌డీఏ లోని చాలా పార్టీల్లో దేశద్రోహులు, ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసి బీజేపీతో మిత్రపక్షంగా చేరిన వారు ఉన్నారని విమర్శించారు. పరోక్షంగా శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్డీయే అమీబా లాంటిదని, దానికి కచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని విమర్శించారు ఉద్ధవ్ ఠాక్రే.

అది ఎన్డీఏ కాదు, అమీబా..
X

ఇండియా కూటమిపై ఇటీవల కాలంలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఇప్పుడు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇండియా కూటమిని చూసి ప్రధాని వణికిపోతున్నారని అందుకే విమర్శలు చేస్తున్నారని అన్నారు.

మోదీ ఏమన్నారు..?

'ఇండియా' అనే పేరున్నంత మాత్రాన ఆ కూటమికి దేశంపై ప్రేమ ఉన్నట్టు కాదని గతంలో విమర్శంచారు మోదీ. ఆ మాటకొస్తే ఇండియన్ ముజాహిదిన్ అనే తీవ్ర వాద సంస్థ పేరులో కూడా ఇండియా అనే పదం ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమిని 'ఘమండియా'(అహంకారంతో గుర్తించబడింది) అని కూడా అన్నారు మోదీ. మోదీ వ్యాఖ్యలకు ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా బదులిచ్చారు. ఎన్‌డీఏను 'ఘమండియే'(అహంకారం) అన్నారు. ఎన్డీఏ కూటమికే అహంకారం ఉందని, ఈ ఎన్నికలతో అదంతా దిగిపోతుందని చెప్పారు.

అది అమీబా..

ఎన్డీఏ కూటమికి ఓ పరిమాణం, ఆకారం అంటూ లేదని ఎద్దేవా చేశారు ఉద్దవ్ ఠాక్రే. అది అమీబాలాంటిదని అన్నారు. ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎవరు దూరమవుతారో తెలియదన్నారు. ఇండియా కూటమిలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే జాతీయవాద పార్టీలు ఉన్నాయని చెప్పారు. ఎన్‌డీఏ లోని చాలా పార్టీల్లో దేశద్రోహులు, ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసి బీజేపీతో మిత్రపక్షంగా చేరిన వారు ఉన్నారని విమర్శించారు. పరోక్షంగా శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్డీయే అమీబా లాంటిదని, దానికి కచ్చితమైన ఆకారం, పరిమాణం లేదని విమర్శించారు. ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష కూటమి దేశం కోసమే ఒక్కటైందని, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాదని గుర్తు చేశారు ఉద్దవ్.


First Published:  28 Aug 2023 4:15 AM GMT
Next Story