Telugu Global
National

లీకులు ఆపండి...జార్ఖండ్ గవర్నర్ కు యుపిఎ నేతల వినతి

జార్ఖండ్ ముఖ్యమంత్రిపై అనర్హత వేటు పడనుందని, ప్రభుత్వం కూలిపోతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో యూపీఏ నేతలు ఈ రోజు ఆ రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చే లీకులకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

లీకులు ఆపండి...జార్ఖండ్ గవర్నర్ కు యుపిఎ నేతల వినతి
X

జార్ఖండ్ లో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై మ‌రో రెండురోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయి. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ బ‌యాస్ హామీ ఇచ్చార‌ని యుపిఎ కూట‌మి నేత‌లు చెప్పారు.

ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ కొనసాగింపుపై అనిశ్చితి, ప్రభుత్వాన్ని "అస్థిరపరచడానికి" బిజెపి ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోప‌ణ‌ల నేపథ్యంలో జార్ఖండ్‌లోని అధికార జెఎంఎం-కాంగ్రెస్ సంకీర్ణ కూట‌మి నాయకులు ఈ రోజు గవర్నర్ రమేష్ బ‌యాస్ ను కలిశారు. గవర్నర్ కార్యాలయం నుంచి లీకేజీలు రావడంతో గందరగోళం నెలకొందని ఫిర్యాదు చేశారు. ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని ఎమ్మెల్యేలు లేఖలో కోరారు.

" గౌర‌వ‌ప్ర‌ద‌మైన గ‌వ‌ర్న‌ర్ కార్యాలయం నుండి వచ్చిన సెలెక్టివ్ లీక్‌లు గందరగోళం, అనిశ్చితి స్థితిని సృష్టిస్తున్నాయి, ఇది రాష్ట్ర పాలనా యంత్రాంగం లోనూ, ప్ర‌భుత‌పాలనపై తీవ్ర ప్ర‌బావం చూపుతోంది. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర‌ల‌ను ప్రోత్సహిస్తుంది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.

త‌మ సంకీర్ణ కూట‌మికి సంఖ్యాబలం ఉన్నందున, ఒక వేళ ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేసినా తమ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంటూ.. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అభిప్రాయాన్ని (ఏదైనా ఉంటే) గవర్నర్ ప్రకటించాలని" లేఖలో కోరారు.

గవర్నర్ కార్యాలయం నుండి లీకేజీలు వస్తున్నాయన్న వాద‌న‌ను గవర్నర్ ఖండించారని, రెండు రోజుల్లో పరిస్థితిపై స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చార‌ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు టిర్కీ మీడియాతో చెప్పారు. "ముఖ్యమంత్రి రాజీనామా చేయడం లేదు, గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం కోరుతున్నారు. రెండు రోజుల్లో పరిస్థితిని స్పష్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపిక చేసిన సమాచారం మీడియాకు ఎలా లీక్ అవుతుందని మేము ప్రశ్నించాము. తన కార్యాలయం నుంచి లీకులు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు'' అని ట‌ర్కీ చెప్పారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసుకు సంబంధించి బీజేపీ ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసిందని పలు వార్తలు వచ్చిన విష‌యం తెలిసిందే. తనకు తానుగా మైనింగ్ లీజు పొడిగించుకోవ‌డం ద్వారా ముఖ్య‌మంత్రి సోరెన్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని బీజేపీ ఆరోపించింది.

First Published:  31 Aug 2022 11:30 PM GMT
Next Story