Telugu Global
National

ఆలయాల పక్కన మసీదులు తీసేయండి.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

భారతదేశంలో మతోన్మాదం విస్తరిస్తోందని, దేవాలయాలకు సమీపంలోని మసీదులను తొలగించాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు యూపీ మంత్రి నిషాద్. రాష్ట్రంలో మదర్సాలపై సర్వే జరపాలని కూడా అన్నారు.

ఆలయాల పక్కన మసీదులు తీసేయండి.. యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
X

ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ మరోసారి నోరు పారేసుకున్నారు. దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదుల‌ను తొలగించాలన్నారాయన. భారతదేశంలో మతోన్మాదం విస్తరిస్తోందని, దేవాలయాలకు సమీపంలోని మసీదులను తొలగించాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మదర్సాలపై సర్వే జరపాలని కూడా అన్నారు నిషాద్. మదర్సాలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని, ఉగ్రవాదులు చాలాసార్లు మదర్సాలలో పట్టుబడ్డారని చెప్పారు. మదర్సాల సర్వేకు ముస్లిం మతపెద్దలు అనుమతివ్వాలన్నారు. అలా అనుమతిస్తేనే వారికి క్లీన్ ఇమేజ్ ఉన్నట్టు నిర్ధారిస్తామని చెప్పారు నిషాద్.

ప్రతిపక్షాలు మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేస్తున్నాయని, మౌలానాలతో కలిసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని అన్నారు యూపీ మంత్రి నిషాద్. కేంద్రంలో మోదీ, యూపీలో యోగి అధికారంలోకి వచ్చాక ఈ అల్లర్లు తగ్గుముఖం పట్టాయన్నారు. మౌలానాలు దేశంలో పేదరికాన్ని పెంచారని, వారి వల్లే ముస్లిం పిల్లలు చదువులుకు దూరం అయ్యారని సంచలన‌ వ్యాఖ్యలు చేశారు.

నిషాద్ వ్యాఖ్యలపై దుమారం..

ఆలయాలకు దగ్గరగా ఉన్నంత మాత్రాన మసీదుల్ని ఎందుకు తొలగించాలని ప్రశ్నిస్తున్నారు యూపీలోని ముస్లింలు. మసీదులకు దగ్గరగా ఉన్న ఆలయాల గురించి తాము కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని అడుగుతున్నారు. నిషాద్ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో యూపీలోని ముస్లింలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయనపై యోగి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు.

సర్వేపై ఆగ్రహం..

యూపీలోని మదర్సాలపై సర్వేకు యోగి ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఎస్పీ, బీఎస్పీ ఈ సర్వేను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సర్వేని మినీ ఎన్ఆర్సీగా అభివర్ణించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. యూపీ ప్రభుత్వం కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తోందని విమర్శించారాయన. సర్వేను అడ్డుపెట్టుకుని యూపీలో మత రాజకీయం చేస్తున్నారని అన్నారు.

First Published:  15 Sep 2022 3:12 PM GMT
Next Story