Telugu Global
National

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మీడియాపై అప్ర‌క‌టిత సెన్సార్ !?

పత్రికల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రతిరోజూ ట్రాక్ చేసి పై అధికారులకు పంపాలని యూపీ ప్రభుత్వం జిల్లా సమాచార అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ అనుకూల వార్తలు ప్రచురితమయ్యేట్టు చూడాలని ఒక వేళ పత్రిక అలా చేయక పోతే తమ దృష్టికి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మీడియాపై అప్ర‌క‌టిత సెన్సార్ !?
X

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఎమ‌ర్జెన్సీ నాటి రోజులు దాపురించాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌జాగ‌ళాన్ని వినిపించే ప‌త్రిక‌ల‌పై నాటి ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం త‌మ‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తున్నార‌న్న సాకుతో నిషేధం విధించింది. తాజాగా యోగి ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బిజెపి ప్ర‌భుత్వం కూడా ' వ్య‌తిరేక వార్త‌ల‌ను' ట్రాక్ చేయండంటూ ఒక అంత‌ర్గ‌త స‌ర్క్యుల‌ర్ ను జారీ చేసింది.

ఆ సర్క్యులర్‌లో, "ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నందున" "ప్రతికూల వార్తలు" రాసే పత్రికలను ట్రాక్ చేయడంలో చురుకుగా పని చేయాలని అన్ని జిల్లాలలో సమాచార అధికారులను ఆదేశించింది. ఆ వార్త "నిరాధారం" అయితే, ఆ వార్తాపత్రిక ఎడిటర్ లేదా స్థానిక రిపోర్టర్‌ని "సరైన వాస్తవాలను" ప్రచురించవలసిందిగా సంబంధిత విభాగం అధికారులు కోరాలని సర్క్యులర్ పేర్కొంది.

ఏదైనా వార్తాపత్రిక ఈ "సరైన వాస్తవాలను" ప్రచురించకపోతే, ఈ విషయాన్ని యుపి ప్రభుత్వ సమాచార, ప‌బ్లిక్ రిలేష‌న్స్ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి నవ్‌నీత్ సెహగల్ దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. ఆయ‌న రూపొందిచిన ఈ సర్క్యులర్‌ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమాచార అధికారులకు పంపారు.

నోయిడా హౌసింగ్ సొసైటీలో ఓ మహిళతో బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి దుర్భాషలాడుతూ, వాదిస్తున్న వీడియో యాదృచ్ఛికంగా వైర‌లైన రోజునే (ఆగస్టు 5న) ఈ సర్క్యులర్ జారీ కావ‌డం విశేషం.

యుపిలోని వివిధ జిల్లాలకు సంబంధించిన సంఘటనల గురించి ప్రచురిత‌మ‌వుతున్న అనేక వార్తలను జిల్లా సమాచార అధికారులు ట్రాక్ చేయడం లేదా గమనించడం లేదని సర్క్యులర్ పేర్కొంది.

"ఫలితంగా, జిల్లా స్థాయిలో, ప్రతికూల వార్తలు ప్రచురిత‌మ‌వుతున్నాయి, అలాంటి వార్తలపై ఎటువంటి విచారణ, చ‌ర్య‌లు ఉండ‌డంలేదు. ఇది జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతోంది'' అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. చాలా సంద‌ర్భాల‌లో ఇటువంటి నెగిటివ్ వార్త‌ల‌పై అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అవి ప్ర‌జా బాహుళ్యంలోకి వెళ్ళి ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు మ‌చ్చ‌ తెస్తున్నాయ‌ని తెలిపింది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు తీవ్ర అసంతృప్తి నిరాశ వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌ర్క్యుల‌ర్ పేర్కొంది.

వ్య‌తిరేక వార్త‌ల‌పై యాక్ష‌న్ ప్లాన్‌..

ప్ర‌తి జిల్లా స్థాయిలో ప్ర‌చురిత‌మ‌య్యే వ్య‌తిరేక‌, అనుకూల వార్త‌ల క్లిప్పింగుల‌ను ఆయా స‌మాచార శాఖ అధికారులు ప్ర‌తిరోజు జిల్లా క‌లెక్ట‌ర్- మేజిస్ట్రేట్‌ల‌కు పంపాలి. ఆయ‌న వాటిని ప‌రిశీలించి సంబంధిత శాఖ‌ల నుంచి వివ‌ర‌ణ తీసుకుంటారు. ఆ వార్త‌లు నిరాధార‌మైన‌వ‌యితే స‌రై న స‌మాచారాన్ని సంబంధిత ఎడిట‌ర్‌, రిపోర్ట‌ర్ కు పంపి దానిని ప్ర‌చురించాల‌ని కోరాలి అని పేర్కొంది. ఎవ‌రైనా ఎడిట‌ర్ ప్ర‌భుత్వం పంపిన స‌రైన స‌మాచారాన్ని ప్ర‌చురించ‌క‌పోతే ఆ విష‌యాన్ని అడిష‌న‌ల్ సెక్ర‌టరీ దృష్టికి తీసుకురావాల‌ని న‌స‌ర్క్యుల‌ర్ లో ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్ర‌క‌ట‌న‌ల గురించి కూడా ప్ర‌స్తావించారు. జిల్లా మేజిస్ట్రేట్ అనుమ‌తి లేకుండా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌త్రిక‌ల‌కు విడుద‌ల చేయ‌రాద‌ని తెలిపారు.

జ‌ర్న‌లిస్టుల‌తో ట‌చ్ లో ఉండేందుకే..

సర్క్యులర్‌పై సంతకం చేసిన నవనీత్ సెహగల్ ని సంప్ర‌దించిన‌ప్ప‌డుడు ఆయ‌న దానిని సమర్థించుకున్నారు. "ఇది అంతర్గత సర్క్యులర్. అటువంటి వార్తలను ట్రాక్ చేయడానికి ప్రతి ప్రభుత్వం ఇలాగే చేస్తుంది "అని అన్నారు. మీడియాను సెన్సార్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా అని ప్ర‌శ్నించ‌గా, జ‌ర్న‌లిస్టుల‌తో ట‌చ్‌లో ఉండేందుకేన‌ని సెన్సార్‌షిప్ ఆలోచ‌నేదీ లేద‌న్నారు. జ‌ర్న‌లిస్టుల‌తో నిత్యం ట‌చ్ లో ఉండాల‌నుకోవ‌డం త‌ప్పా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అయితే గతంలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టుల‌పై కేసులు పెట్టిన చరిత్ర యోగి ప్రభుత్వానికి ఉండటంతో జర్నలిస్టులు ఈ సర్క్యులర్ ను కూడా అదేదృష్టితో చూస్తున్నారు. ఇలా కింది స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని వ్యతిరేక వార్తలు రాసే జర్నలిస్టులపై నిఘా పెట్టడం, కేసులు పెట్టడం చేస్తారని స్థానిక జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  17 Aug 2022 7:26 AM GMT
Next Story